ఆ దర్శకుడి ప్రవర్తనతో ఆత్మహత్యాయత్నం
ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజా ఇంటర్వ్యూలో అశ్విని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.;
సీనియర్ నటి అశ్విని నంబియార్ చాలా కాలం తర్వాత రీ ఎంట్రీ ఇచ్చింది. గతంలో పలు సినిమాల్లో నటించిన అశ్విని తెలుగులోనూ సీరియల్స్, సినిమాల ద్వారా మంచి గుర్తింపు సొంతం చేసుకున్నారు. 18 ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇచ్చిన అశ్విని భాషతో సంబంధం లేకుండా ఏ భాష నుంచి ఆఫర్లు వచ్చినా నటించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చింది. పెళ్లి అయిన తర్వాత సినిమాలకు దూరంగా ఉండాలని అనుకోలేదని, కానీ కొన్ని కారణాల వల్ల సినిమాలకు ఇన్నాళ్లు దూరంగా ఉండాల్సి వచ్చిందని అశ్విని అన్నారు. ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కొత్తలో ఎదుర్కొన్న సవాళ్ల గురించి తాజా ఇంటర్వ్యూలో అశ్విని షాకింగ్ వ్యాఖ్యలు చేసింది.
మలయాళ సినిమా ఇండస్ట్రీకి చెందిన ఒక పెద్ద దర్శకుడు తనతో అసభ్యంగా ప్రవర్తించాడని అశ్విని చెప్పుకొచ్చింది. ఆ సమయంలో తాను తప్పు చేశాననే భావనతో ఆత్మహత్యాయత్నం చేశానంది. ఆ దర్శకుడి ప్రవర్తన తనకు షాకింగ్‌గా అనిపించిందని, ఏం చేయాలో అర్థం కాక ఆత్మహత్యాయత్నం చేసినట్లు అశ్విని పేర్కొంది. ఇంకా ఆ సంఘటన గురించి అశ్విని మాట్లాడుతూ.. సినిమా గురించి మాట్లాడాలి అని ఒక దర్శకుడు పిలిచాడు. అతడి ఆఫీస్, ఇల్లు ఒకే చోట ఉంటుంది. ఎప్పుడూ నేను అమ్మతోనే వెళ్లేదాన్ని. కానీ ఆ రోజు అమ్మ ఆరోగ్యం బాగాలేక పోవడంతో నేను మాత్రమే వెళ్లాల్సి వచ్చింది. హెయిర్ డ్రెస్సర్‌ను వెంట పెట్టుకుని ఆ దర్శకుడి ఆపీస్‌కి వెళ్లాను.
ఆ దర్శకుడితో ఇంతకు ముందే ఒక సినిమా చేసిన కారణంగా కాస్త చనువు ఉండేది. నాతో వచ్చిన హెయిర్ డ్రెస్సర్ కింద ఉండగా నేను ఒంటరిగా పైకి వెళ్లాను. ఆ సమయంలో అక్కడ ఎవరూ కనిపించలేదు. బెడ్ రూం నుంచి ఆ దర్శకుడు నన్ను పిలిచాడు. నేను వెళ్లిన వెంటనే నాతో తప్పుగా ప్రవర్తించాడు. అతడు అసభ్యంగా టచ్ చేయడంతో అక్కడ నుంచి పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాను. అతడి ప్రవర్తన నాకు షాకింగ్‌గా అనిపించింది. అప్పటి వరకు నేను టీనేజర్‌నే కావడంతో అతడి ప్రవర్తనను నేను ముందుగా అంచనా వేయలేక పోయాను. నా తప్పు వల్లే అతడు అలా ప్రవర్తించాడా అని బాధ పడ్డాను.
అప్పటి వరకు నా మొహంలో ఉన్న నవ్వు మాయం అయింది. అతడు చేసిన పనితో ఒక్కసారిగా ఆందోళన మొదలైంది. ఇంటికి వెళ్లిన వెంటనే అమ్మ నా మొహం చూసి అర్థం చేసుకుని ఏం జరిగిందని ఆందోళనతో అడిగింది. ఆమెకు మొత్తం విషయం చెప్పాను. తాను రాకపోవడం వల్లే అలా జరిగిందని అమ్మ బాగా ఏడ్చింది. ఆమె కన్నీటికి కారణం నేనే అనే బాధతో నిద్ర మాత్రలు ఎక్కువగా తీసుకుని ఆత్మహత్య యత్నం చేశాను. అయితే వెంటనే నన్ను కాపాడారు. ఆ తర్వాత అమ్మ నా తప్పు ఏం లేదని అర్థం అయ్యేలా చెప్పింది. ఆ తర్వాత నుంచి నేను చాలా స్ట్రాంగ్‌గా మారుతూ వచ్చాను. ఒంటరిగా షూటింగ్‌కి వెళ్లినా భయం లేకుండా, ఎవరితో ఎలా ఉండాలో అలా మసులుకుంటూ ఉండేదాన్ని అంది. అయితే ఆ దర్శకుడి పేరు మాత్రం అశ్విని బయట పెట్టలేదు.