పండగలను టార్గెట్ చేసిన ఎన్టీఆర్
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నుంచి రానున్న సినిమాల విషయంలో ఓ ప్లాన్ వేసుకున్నాడని తెలుస్తోంది.;
ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకున్న ఎన్టీఆర్ ఆ తర్వాత చాలా గ్యాప్ తీసుకుని దేవర సినిమా చేశాడు. ఈ రెండు సినిమాలు బాగా లేటవడంతో ఎన్టీఆర్ ఇక మీదట చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. ఇంతకుముందులా కాకుండా వేగంగా సినిమాలను పూర్తి చేయాలని చూస్తున్నాడు తారక్.
ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తన నుంచి రానున్న సినిమాల విషయంలో ఓ ప్లాన్ వేసుకున్నాడని తెలుస్తోంది. ఆడియన్స్ ను బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరించాలని చూస్తున్న తారక్, దానికి తగ్గట్టే రాబోయే మూడు సినిమాలను మూడు పండగలకు రిలీజ్ చేయాలని సన్నాహాలు చేస్తున్నాడట. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న ఎన్టీఆర్ నుంచి ముందుగా వార్2 రిలీజ్ కానుంది.
అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హృతిక్ రోషన్ తో కలిసి చేస్తున్న ఈ సినిమా షూటింగ్ ఆఖరి దశలో ఉంది. రీసెంట్ గానే హృతిక్, ఎన్టీఆర్ పై సాంగ్ షూట్ కూడా మొదలైంది. మరో వారం రోజుల్లో ఆ సాంగ్ కూడా పూర్తి కానుంది. దీంతో వార్2 షూటింగ్ ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఉంటే ఏదైనా చిన్న చిన్న ప్యాచ్ వర్క్ ఉంటుందంతే. వార్2 సినిమా ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఆగస్టు 14న రిలీజ్ కానుంది.
ఈ సినిమా తర్వాత కెజిఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ డ్రాగన్ సినిమా చేయనున్నాడు. ఆల్రెడీ ఈ సినిమా షూటింగ్ మొదలవగా, ఏప్రిల్ నుంచి ఎన్టీఆర్ కూడా షూటింగ్ లో జాయిన్ కానున్నాడు. ఈ ఏడాది నవంబర్ లోగా షూటింగ్ పూర్తి చేసి 2026 సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో సంక్రాంతి టార్గెట్ మిస్ కాకూడదని ఎన్టీఆర్ నీల్ కు చెప్పాడని సమాచారం.
ఈ రెండు కాకుండా ఎన్టీఆర్ ఒప్పుకున్న మరో సినిమా దేవర2. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన దేవర మూవీకి సీక్వెల్ గా ఈ సినిమా రానుంది. దేవరలో మిగిలిన ఎన్నో ప్రశ్నలకు దేవర2 ద్వారా సమాధానమివ్వనున్నాడు తారక్. ఈ ఇయర్ జూన్, జులై నుంచి దేవరను సెట్స్ పైకి తీసుకెళ్లి వచ్చే ఏడాది జనవరి కల్లా షూటింగ్ ను పూర్తి చేయాలని ప్లాన్ చేస్తున్నారట. తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ కు ఎక్కువ టైమ్ తీసుకుని 2026 దసరాకు దేవర2ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చూస్తున్నారట. అన్నీ అనుకున్నట్టు జరిగితే గత కొన్నేళ్లుగా ఎన్టీఆర్ నుంచి ఎక్కువ సినిమాలు లేక నిరాశ పడిన ఆయన ఫ్యాన్స్ ఆనందానికి హద్దులుండవు.