నాని 'ది ప్యారడైజ్'.. ట్రెండుకు తగ్గట్లే డబుల్ డోస్

నాని ఫస్ట్ లుక్ చూసినప్పుడు అదే ఫీలింగ్ రావడం విశేషం. ఇప్పుడు దీనికి మించి, ఈ కథలో చెప్పాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఒక సినిమాగా మించి మరో పార్ట్‌ కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.;

Update: 2025-03-09 07:40 GMT

టాలీవుడ్‌లో ఎప్పుడూ కొత్త కథలతో ప్రేక్షకులను ఆకట్టుకునే నాని, ఈసారి తన కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌ కోసం సిద్ధమయ్యాడు. 'దసరా'తో మాస్ హీరోగా మరో స్థాయికి వెళ్లిన నేచురల్ స్టార్, 'ది ప్యారడైజ్' అనే విభిన్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఇటీవల నాని ఇచ్చిన ఇంటర్వ్యూలో, ఈ ప్రాజెక్ట్‌ను 'ఇండియన్ మ్యాడ్ మ్యాక్స్' లా ఊహించొచ్చని చెప్పాడు.

నాని ఫస్ట్ లుక్ చూసినప్పుడు అదే ఫీలింగ్ రావడం విశేషం. ఇప్పుడు దీనికి మించి, ఈ కథలో చెప్పాల్సిన అంశాలు చాలా ఎక్కువగా ఉండటంతో, ఒక సినిమాగా మించి మరో పార్ట్‌ కూడా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. టాలీవుడ్‌లో ఇటీవల భారీ బడ్జెట్ చిత్రాలు రెండు భాగాలుగా తెరకెక్కడం ట్రెండ్‌గా మారింది. ఆ ట్రెండ్‌లోనే 'ది ప్యారడైజ్' కూడా నిలవనుందని తెలుస్తోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్‌లో నాని లుక్ చాలా ఇంటెన్స్‌గా ఉంది. రంగు రంగుల బ్యాక్‌డ్రాప్, నాని వేషధారణ, గడ్డం, మెడలో గొలుసులు, రెండింటికి విడదీయరాని కాకిలా ఉన్న గ్రాఫిక్స్.. ఇవన్నీ సినిమా టోన్‌ను మరింత ఆసక్తికరంగా మార్చేశాయి. అలాగే ట్రాన్స్ జెండర్ అనే షాకింగ్ గాసిప్స్ కూడా వైరల్ అవుతున్నాయి. మాస్ హీరోగా పూర్తిగా కొత్త అవతారం ఎత్తిన నాని, ఈ పాత్రలో రఫ్ లుక్‌తో ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతున్నాడు.

ఈ లుక్ సినిమాకు సంబంధించిన సస్పెన్స్‌ను మరింత పెంచేలా ఉంది. పైగా ఇది మామూలు కమర్షియల్ సినిమాతో పోల్చదగినది కాదు, కంటెంట్‌కు ప్రాధాన్యత ఇచ్చిన సినిమా అని ఫస్ట్ గ్లింప్స్‌తోనే అర్థమైంది. 'ది ప్యారడైజ్' భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 'దసరా'తో మంచి విజయాన్ని అందుకున్న శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తుండటంతో, ఈసారి దర్శకుడి మేకింగ్ మరింత డిఫరెంట్‌గా ఉంటుందని అంచనాలు ఉన్నాయి.

నిర్మాత సుధాకర్ చెరుకూరి ఎప్పుడూ క్వాలిటీ ప్రాజెక్ట్‌లను ప్రొడ్యూస్ చేసే బ్యానర్ అయిన SLV సినిమాస్‌లో ఈ మూవీ రూపొందుతోంది. సంగీతం అనిరుధ్ అందిస్తుండటంతో, సినిమా మ్యూజిక్ పరంగా కూడా మరింత క్రేజీగా ఉండే అవకాశం ఉంది. ఈ సినిమాకు భారీ బడ్జెట్ ఖర్చు అవుతోందని, ఇప్పటివరకు నాని చేసిన ప్రాజెక్ట్స్‌లో ఇదే అత్యంత ఖరీదైనదని టాక్. ఫస్ట్ పార్ట్ 2026 మార్చి 26న విడుదల కాబోతోంది.

అయితే రెండో భాగం కోసం మాత్రం ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. రెండు భాగాలుగా తెరకెక్కించే చిత్రాలు ఎక్కువ టైమ్ తీసుకునే అవకాశం ఉండటంతో, 'ది ప్యారడైజ్ 2' ఎప్పుడు రానుందన్నది ఉత్కంఠ రేపుతోంది. కానీ ఈ కథకు ఒకే సినిమా సరిపోదని, ప్రేక్షకులు రెండు భాగాలుగా చూస్తేనే అసలైన అనుభూతి అందుకుంటారని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. మరి ఈ ట్రెండుకు తగ్గట్లే నాని ఎలాంటి విజయాలను అందుకుంటాడో చూడాలి.

Tags:    

Similar News