'కోర్ట్' కోసం నాని అడ్వాన్స్ ప్లాన్!

నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోంది అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు.;

Update: 2025-03-08 11:05 GMT

నేచురల్ స్టార్ నాని సినిమా వస్తోంది అంటే అందులో ఏదో ఒక ప్రత్యేకత ఉంటుందనే నమ్మకంతో ప్రేక్షకులు ఎదురు చూస్తుంటారు. హీరోగా రాణిస్తూనే, తన వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ ద్వారా కొత్తదనాన్ని ప్రోత్సహిస్తూ నాని ముందుకు సాగుతున్నాడు. హిట్ సిరీస్, అ! వంటి విభిన్న చిత్రాలను నిర్మించిన అతడు ఇప్పుడు కోర్ట్ సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ప్రియదర్శి, హర్ష్ రోషన్, శ్రీదేవి, శివాజి, సాయి కుమార్ కీలక పాత్రల్లో నటించిన ఈ చిత్రం ట్రైలర్‌తోనే మంచి హైప్ తెచ్చుకుంది.

ట్రైలర్‌ను చూస్తే న్యాయవ్యవస్థలో జరుగుతున్న కొన్ని కీలకమైన అంశాలను ఇంటెన్స్‌గా చూపించబోతున్నట్లు స్పష్టమవుతోంది. ఓ లాయర్ తన కేసును గెలిపించుకునేందుకు చేసే ప్రయత్నాలు, కోర్ట్ హాల్స్‌లో నడిచే వాదనలు, సామాజిక స్థితిగతుల గురించి ప్రస్తావిస్తూ దర్శకుడు రామ్ జగదీష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఇప్పటికే నాని తన బ్యానర్ నుంచి వచ్చిన సినిమాల్లో కొత్తదనం చూపించాడనే ట్రాక్ రికార్డు ఉండటంతో కోర్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగాయి.

ఈ సినిమా విడుదలకు ముందే థియేట్రికల్ హైప్‌ను మరింత పెంచేందుకు నాని ప్రత్యేక వ్యూహాన్ని అమలు చేస్తున్నాడు. సాధారణంగా ఓ సినిమా విడుదలకు ముందు ప్రివ్యూస్, స్పెషల్ షోస్ ఏర్పాటు చేస్తారు కానీ కోర్ట్ విషయంలో ముందుగా 2-3 రోజులు పబ్లిక్ షోలు వేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. ఇది నాని మాస్టర్ ప్లాన్ అని చెప్పుకోవచ్చు. ముందుగానే ప్రేక్షకుల స్పందన తెలుసుకుని, నెగటివ్ టాక్ వచ్చే అవకాశం లేకుండా, ఇప్పటికే హైప్‌ను పెంచిన ట్రైలర్‌తో కలిసి, మొదటి రోజే గట్టి కలెక్షన్లు అందుకునేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

నాని సినిమాల విషయానికి వస్తే, ఆయన ఎక్కువగా కొత్త కథల్ని ఎంచుకుంటూ, వాటిని మార్కెట్ చేయడంలో తనదైన పద్ధతిని ఫాలో అవుతుంటాడు. ఇటీవల వచ్చిన హాయ్ నాన్న సినిమాను స్లో బర్నర్‌గా నిలిపి, మంచి వసూళ్లు రాబట్టాడు. ఇప్పుడు అదే విధంగా కోర్ట్ విషయంలో ముందుగా పబ్లిక్ షోస్ వేసి, రివ్యూస్‌ను ముందే బయటకు వచ్చేలా చేస్తే, ప్రేక్షకుల్లో మరింత ఆసక్తి పెంచే అవకాశం ఉంటుంది. ఇది పెద్ద సినిమాల దగ్గర ఎక్కువగా కనిపించిన స్ట్రాటజీ కానీ, చిన్న సినిమాకి ఇలా చేయడం రిస్క్‌తో కూడుకున్న ప్లాన్.

ఈ సినిమా న్యాయ వ్యవస్థలో ఉన్న అసమానతలపై ఫోకస్ చేస్తుందా? లేక ఇది మరొక కోణంలో మలుపు తిరుగుతుందా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు. కానీ నాని బ్యానర్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు మౌత్ టాక్‌ను బట్టి ముందుకు వెళ్లే అవకాశం ఉంది. ఇలాంటి నేటివిటీ థీమ్‌లో రూపొందిన సినిమాలు పాజిటివ్ టాక్ అందుకుంటే బాక్సాఫీస్ వద్ద మంచి కలెక్షన్స్ రాబట్టే అవకాశం ఉంది.

Tags:    

Similar News