లేడీ కొరియోగ్రాఫర్.. చావో రేవో తేల్చుకోవాల్సిన స్థితిలో..!
ముఖ్యంగా లైంగికంగా వేధించిందని తనపై కేసు పెట్టిన యువకుడి వెనక, కొరియోగ్రాఫర్ భార్య ఉందని, ఆమెకు సిగ్గులేదని లేడీ కొరియోగ్రాఫర్ తాజా ఇంటర్వ్యూలో మరోసారి ఫైరయ్యారు.
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ తన సహాయకురాలిపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారనే ఆరోపణలు గత ఏడాది సంచలనమైన సంగతి తెలిసిందే. ఈ కేసులో జైలు శిక్షను అనుభవించిన సదరు కొరియోగ్రాపర్ ప్రస్తుతం బెయిల్ పై బయటే ఉన్నారు. ప్రస్తుతం మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ ఏం చేస్తున్నారు? అంటే.. తన కెరీర్ పథంలో బిజీగా ఉన్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్, పుష్ప డైరెక్టర్ సుకుమార్ సహా పలువురు టాప్ సెలబ్రిటీలతో కలిసి దిగిన లేటెస్ట్ ఫోటోలు, తన డ్యాన్సింగ్ ఎబిలిటీని ప్రదర్శించే 'పుష్ప 2' కొరియోగ్రఫీ వీడియోలు ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. మహిళా కొరియోగ్రాఫర్ అందచందాలు, నృత్యప్రదర్శనకు సోషల్ మీడియాలో అద్బుతమైన ఫాలోయింగ్ ఏర్పడింది.
ఇదిలా ఉంటే పాపులర్ కొరియోగ్రాఫర్ పై ఆరోపణల అనంతరం మహిళా అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ కి అవకాశాలు తగ్గిపోతాయని అంతా భావించారు. కానీ తన ఇమేజ్ అమాంతం పెరిగిందే కానీ తగ్గలేదు. పెద్ద స్టార్లు, పెద్ద దర్శకులు తనకు అవకాశాలు కల్పిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఎలాంటి మాస్క్ లేకుండా తనను వేధించిన ప్రముఖ కొరియోగ్రాఫర్ గురించి, అతడి భార్య గురించి, తనపై కేసు పెట్టిన ఒక యువకుడి గురించి బహిరంగంగా చర్చించారు.
ముఖ్యంగా లైంగికంగా వేధించిందని తనపై కేసు పెట్టిన యువకుడి వెనక, కొరియోగ్రాఫర్ భార్య ఉందని, ఆమెకు సిగ్గులేదని లేడీ కొరియోగ్రాఫర్ తాజా ఇంటర్వ్యూలో మరోసారి ఫైరయ్యారు. ఈ కేసులో న్యాయం జరగకపోతే ఆ యువకుడు ఆత్మహత్య చేసుకుంటానని అన్నాడు. కానీ అతడు ఆత్మహత్య చేసుకున్నాడా? అతడు ఎక్కడున్నాడు? అని కూడా ప్రశ్నించారు సహాయక కొరియోగ్రాఫర్. ఆ కుర్రాడిని ప్రేరేపించి కొరియోగ్రాఫర్ భార్య ఈ పని చేయించిందని కూడా ఆమె ఆరోపించారు. కనీసం పోలీసులు ఈ కేసును తీసుకోలేదని అన్నారు.
తాను బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి ఆరోపించడానికి కారణం, ఇది చూశాక అయినా ఇతర మహిళలు జాగ్రత్త పడతారనేది తన ఉద్ధేశమని అన్నారు. నాలుగేళ్ల క్రితం వేధింపులు ఎదురైనా కానీ నేను ఇప్పుడు కేసు పెట్టడానికి కారణం..ఆ సమయంలో అంత పెద్ద వ్యక్తిని ఎదురించే ధైర్యం లేకపోవడమేనని మరోసారి లేడీ కొరియోగ్రాఫర్ తన భయాన్ని వ్యక్తం చేసారు. అతడు మారతాడని ఎదురు చూశానని, మారకపోవడంతో చివరికి పోలీసులకు ఫిర్యాదు చేయాల్సొచ్చిందని అన్నారు. చావో బతుకో తేల్చుకోవాల్సిన పరిస్థితిలోనే తాను ఈ కేసు పెట్టానని, ఆత్మగౌరవం కోసం పోరాడనని ఆమె వ్యాఖ్యానించారు.