'పద్మశ్రీ' ఎన్టీఆర్.. పద్మ భూషణ్ బాలయ్య..

కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల ప్రక్రియ పూర్తయింది.

Update: 2025-01-26 14:36 GMT

కేంద్ర ప్రభుత్వం ఏటా గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించే పద్మ అవార్డుల ప్రక్రియ పూర్తయింది. తెలుగు వారికి 50 ఏళ్లుగా సుపరిచితుడైన నందమూరి నట సింహం బాలకృష్ణకు ‘పద్మ భూషణ్’ రావడం ఆయన అభిమానులకు అమితానందం కలిగించింది. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ, తెలుగు వారి అన్న నందమూరి తారక రామారావు నట వారసుడైన బాలకృష్ణ కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు.. మరెన్నో సూపర్ హిట్ లు. తాజాగా సంక్రాంతికి వచ్చిన డాకూ మహరాజ్ బాలయ్య స్టామినాను మరోసారి చాటింది.

బాక్సాఫీస్ బొనాంజా నుంచి నట రత్నగా నట సింహంగా ఎదిగిన బాలకృష్ణకు కొన్నేళ్ల నుంచి టైమ్ బాగా నడుస్తోంది. సినిమాల వరుస హిట్ లు.. రాజకీయంగా హ్యాట్రిక్ గెలుపు.. వీటికిమించి టాక్ షో అన్ స్టాపబుల్ తో ప్రజలకు మరింత చేరువయ్యారు. తల్లిగారు నందమూరి బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి చైర్మన్ గా బాలకృష్ణ చేస్తున్న సామాజిక సేవ ఎందరి మనసులనో చూరగొంది.

గత ఏడాదితో అన్న ఎన్టీఆర్ శత జయంతి పూర్తయింది. తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాదు.. భారతీయ చిత్ర పరిశ్రమలోనే చెరగని ముద్ర నందమూరి తారక రామారావుది. ఎదురులేని కథానాయకుడిగా 303 సినిమాల్లో తెలుగు ప్రేక్షకులను అలరించిన అన్నగారు 1968లో పద్మశ్రీ అవార్డుకు ఎంపికయ్యారు. అప్పటికి సరిగ్గా ఆయన నట జీవితం ప్రారంభించి 20 ఏళ్లు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాలో ఎన్నో విలక్షణ పాత్రలను పోషించిన అన్నగారు ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం నుంచి మరే అవార్డు కూడా పొందలేదు. పద్మశ్రీ పొందిన 15 ఏళ్లకు రాజకీయాల్లోకి వచ్చేశారు. సొంతంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి కేవలం 9 నెలల్లోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు సీఎం అయ్యారు. తద్వారా తిరుగులేని నాయకుడు కూడా అయ్యారు.

57 ఏళ్ల తర్వాత..

ఎన్టీఆర్ కుమారుడు బాలకృష్ణకు పద్మ వభూషణ్ ఇవ్వడం ద్వారా నందమూరి ఇంటికి 57 ఏళ్ల తర్వా మరో పద్మం వచ్చినట్లయింది. కాగా, తండ్రి ఎన్టీఆర్ పద్మశ్రీ పొందిన ప్పడు బాలకృష్ణ ఏడెనిమిదేళ్ల బాలుడు కావడం విశేషం.

అన్నగారు భారతరత్నమే..

తెలుగు ప్రజల ఆరాధ్యుడిగా, అకుంఠిత దీక్షాపరుడిగా, సంక్షేమ సారథిగా, పేదల సీఎంగా, అమిత ప్రజాదరణ పొందిన నాయకుడిగా, అన్నిటికీ మించి దేశ రాజకీయాలనే మలుపుతిప్పిన గొప్ప వ్యక్తిగా ఎన్టీఆర్ కచ్చితంగా దేశ అత్యున్నత పౌర పురస్కారం భారత రత్నకు అర్హులు. మరి అది ఈ రోజు సాకారాం అవుతుందా? లేదా?

Tags:    

Similar News