మోక్షజ్ఞ.. డౌట్స్ క్లియర్ చేసిన బాలయ్య!
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
టాలీవుడ్ సీనియర్ హీరో బాలకృష్ణ నట వారసుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. చెప్పాలంటే.. మోక్షజ్ఞ ఎంట్రీ త్వరలోనే అంటూ బాలయ్య ఎప్పటి నుంచో ఊరిస్తూనే ఉన్నారు. కానీ ఇప్పటి వరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. అయితే మోక్షజ్ఞ అప్పటి కన్నా నాజూగ్గా అయినట్లు ఇటీవల కనిపించారు. దీంతో బాలయ్య వారసుడి ఎంట్రీ కోసం అంతా సిద్ధమైందని అంటున్నారు.
అయితే కొడుకు ఎంట్రీ ఓ పవర్ ఫుల్ సినిమాతో ఉండాలని బాలయ్య ఎప్పటి నుంచో భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2024లోనే మోక్షజ్ఞ మూవీ లాంఛ్ ఈవెంట్ జరిపేందుకు ప్రయత్నాలు మొదలైనట్లు సమాచారం. ప్రస్తుతం కథా చర్చల్లో ఉన్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీకి సరిపోయే కథ ఫైనల్ అవ్వగానే.. మూవీ షూటింగ్ ను ప్రారంభించనున్నట్లు టాలీవుడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.
ఇదే సమయంలో బాలయ్య.. నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం మాట్లాడారు. "మా వాడు మోక్షు కూడా ఇండస్ట్రీకి రావాలి. మోక్షజ్ఞ మీ అందరినీ స్ఫూర్తిగా తీసుకోవాలి. నన్ను ఎప్పుడూ స్ఫూర్తిగా తీసుకోవద్దనే చెబుతాను. ప్రేక్షకులకు తగ్గట్టుగా మనం ఉండాలి. అడివి శేష్, సిద్ధు జొన్నలగడ్డ లాంటి వాళ్లనే స్ఫూర్తిగా తీసుకోవాలని మా మోక్షజ్ఞకు చెబుతూ ఉంటాను" అని బాలయ్య అన్నారు.
దీంతో మోక్షజ్ఞ సినీ ఎంట్రీపై ఇప్పుడు జోరుగా చర్చ సాగుతోంది. త్వరలోనే మోక్షు డెబ్యూ మూవీ అనౌన్స్మెంట్ రానుందని నందమూరి ఫ్యాన్స్ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇంకొందరు మాత్రం.. బాలయ్య ఇప్పటికే చాలా సార్లు చెప్పారని అంటున్నారు. కానీ ఇప్పటి వరకు మోక్షజ్ఞ కనీసం ఫోటో షూట్ కూడా చేసింది లేదని చెబుతున్నారు. చెప్పాలంటే ఇది నిజమే అయినా.. సీక్రెట్ గా ఏమైనా చేస్తున్నారని చాలా మందిలో డౌట్ ఉంది.
నిన్నటి ఈవెంట్ లో బాలయ్య కామెంట్స్.. ఆ డౌట్ క్లియర్ చేసినట్లు అయింది. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ పక్కా అని, అది కూడా త్వరలోనేనని బాలయ్య ఇన్ డైరెక్ట్ గా చెప్పారని ఫ్యాన్స్ అంటున్నారు. అయితే మోక్షు డెబ్యూ మూవీ డైరెక్టర్ ఎవరనేది ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో హాట్ టాపిక్. బాలయ్యకు వరుస హిట్స్ ఇచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందని చాలా మంది చెబుతున్నారు. మరి బాలయ్య.. మోక్షజ్ఞ లాంఛింగ్ బాధ్యతను ఏ డైరెక్టర్ కు ఇచ్చారో చూడాలి.