నందమూరి బ్రాండ్ లో తమన్ సౌండ్!

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమన్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

Update: 2025-01-22 06:35 GMT

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం తమన్ ఎంత బిజీగా ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. గ్యాప్ లేకుండా స్టార్ హీరోల సినిమాలకు సంగీతాన్ని అందించి, తనదైన ముద్రను ఏర్పరచుకున్నాడు. అయితే, నందమూరి అభిమానుల‌కు త‌మన్ కేవలం సంగీత దర్శకుడు కాదు, వారి గుండెల్లో ఒక ప్ర‌త్యేక స్థానం సంపాదించుకున్న వ్యక్తి. ఇప్పుడు అదే భావాన్ని నారా భువ‌నేశ్వ‌రి వ్యక్తపరచడం, 'నందమూరి త‌మ‌న్' అనే పిలుపుతో అతనిపై ప్రశంసలు కురిపించడం గొప్ప విషయం.

ఫిబ్ర‌వ‌రి 15న విజయవాడలో ఎన్టీఆర్ ట్ర‌స్ట్ యుఫోరియా నైట్ జ‌ర‌గ‌నుంది. సంగీత ప్రదర్శన సందర్భంగా నిర్వహించిన మీట్ లో త‌మ‌న్ నందమూరి కుటుంబానికి చెందినటువంటి అనుబంధాన్ని మరింతగా బలపరిచాడు. ఈ కార్యక్రమం తలసేమియా బాధితుల కోసం నిధుల సేకరణకు నిర్వహించబడుతుంది, ఇది ఒక సేవా కార్యక్రమానికి త‌మ‌న్ తన సంగీతాన్ని అంకితం చేస్తున్న ఒక ప్రత్యేక సందర్భం. ఈ సందర్భంగా భువ‌నేశ్వ‌రి, త‌మన్ గురించి 'నందమూరి త‌మన్ అని' ప్రస్తావించడం, అతని సేవా కార్యక్రమాలకు అండగా నిలిచే సందేశాన్ని ఇచ్చింది.

అంతే కాకుండా తమన్ ఇటీవల నందమూరి బాలకృష్ణ సినిమాలకు సాలీడ్ హిట్స్ ఇవ్వడం విశేషం. అఖండ‌, వీర‌సింహారెడ్డి, భ‌గవంత్ కేస‌రి, డాకు మ‌హారాజ్.. సినిమాలకు అందించిన మ్యూజిక్ ఏ స్థాయిలో క్లిక్కయ్యిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. త‌మ‌న్ సైతం తన ప్రసంగంలో తన సంగీత ప్రస్థానంతో పాటు, తన సేవా కార్యక్రమాలను సవివరంగా వివరించాడు. సినిమాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని వ్యక్తిగత అవసరాలకు మాత్రమే వినియోగిస్తానని, మిగిలిన మొత్తం ఆదాయాన్ని సేవా కార్యక్రమాలకు వినియోగిస్తానని చెప్పడం, త‌మ‌న్ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబిస్తుంది.

ఇది కేవలం సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేయాలనే భావనతో ఉన్న వ్యక్తిగా త‌మ‌న్‌ను హైలెట్ చేస్తోంది. నందమూరి కుటుంబంతో త‌మ‌న్‌కు ఉన్న ప్రత్యేకమైన అనుబంధం, ప్రత్యేకించి బాలకృష్ణ చిత్రాల ద్వారా, అతనికి ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చిపెట్టింది. ఈ నేపథ్యంలో భువ‌నేశ్వ‌రి నందమూరి త‌మన్ అనే పిలుపు వినిపించడం, ఆ కుటుంబంతో త‌మన్‌కు ఉన్న అనుబంధాన్ని మరింతగా బలపరుస్తుంది.

ఈ కార్యక్రమం ద్వారా త‌మ‌న్‌కి వచ్చిన ఆదరణ, తన సంగీత ప్రస్థానానికి నందమూరి బ్రాండ్ ఇమేజ్ మరింత బూస్ట్ ఇస్తుందని చెప్పవచ్చు. ఒక సంగీత దర్శకుడిగా మాత్రమే కాకుండా, సమాజానికి సేవ చేయాలనే తపనతో ఉన్న వ్యక్తిగా త‌మ‌న్‌ని గుర్తిస్తూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు. ఇక తమన్, నందమూరి కుటుంబం, ఎన్టీఆర్ ట్రస్ట్ నిర్వహిస్తున్న ఈ సంగీత సంబరం, తెలుగు సినిమా అభిమానులకు ఏ స్థాయిలో కిక్కిస్తుందో చూడాలి.

Tags:    

Similar News