సెట్స్‌లో మా యాక్షన్‌ కంటే వాళ్ల యాక్షన్‌ ఎక్కవైంది : బ్రహ్మాజీ

జనాల్లో ఆ బౌన్సర్లు అనవసరంగా దాడులు చేయడం, ముఖ్యంగా ఆ సెలబ్రిటీపై అభిమానంతో వచ్చే వారిపై బౌన్సర్‌లు చేసే దాడులు అన్నీ ఇన్నీ కావు.

Update: 2025-01-06 06:08 GMT

పుష్ప 2 సినిమా ప్రీమియర్‌ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటకు అనేక కారణాలు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. అందులో హీరో అల్లు అర్జున్‌ కి రక్షణగా వచ్చిన పదుల సంఖ్యలో బౌన్సర్లు చేసిన ఓవర్‌ యాక్షన్ కూడా ఒక కారణం అనే విమర్శలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో సినిమా హీరోల నుంచి మొదలుకుని సోషల్‌ మీడియాలో ఒకింత పాపులారిటీ వచ్చిన వారి వరకు ఒకరిద్దరు మొదలుకుని పదుల కొద్ది బౌన్సర్‌లను వెంట పెట్టుకుని బయటకు వస్తున్నారు. జనాల్లో ఆ బౌన్సర్లు అనవసరంగా దాడులు చేయడం, ముఖ్యంగా ఆ సెలబ్రిటీపై అభిమానంతో వచ్చే వారిపై బౌన్సర్‌లు చేసే దాడులు అన్నీ ఇన్నీ కావు.

షాపింగ్ మాల్స్‌కి వెళ్లిన సమయంలో, ఔట్‌ డోర్‌ షూటింగ్‌ సమయంలో, థియేటర్‌కి వెళ్లిన సమయంలో లేదంటే ఏదైనా పబ్లిక్ మీటింగ్‌కు వెళ్లిన సమయంలో పక్కన బౌన్సర్లు ఉండటం అంటే పర్వాలేదు. కానీ షూటింగ్‌ సమయంలో, అదీ ఇన్‌ డోర్‌ సెట్స్‌ లో షూటింగ్‌ సమయంలోనూ కొందరు స్టార్స్ బౌన్సర్‌లను వినియోగించుకుంటున్నట్లు సీనియర్ నటుడు బ్రహ్మాజీ చేసిన వ్యాఖ్యలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. సెట్స్‌లో సినిమాకు సంబంధించిన వారు కాకుండా బయటి వారు ఎవరూ ఉండరు. అలాంటి చోట ఎందుకు బౌన్సర్లు అంటూ చాలా మంది ఆశ్చర్యంగా బ్రహ్మాజీ ట్వీట్‌కి సమాధానం ఇస్తున్నారు.

అసలు విషయం ఏంటి అంటే సెట్స్‌ లో బౌన్సర్‌లకు ఖర్చు నిర్మాత భరించాల్సి ఉంటుంది. కనుక మనదేం ఉంది పోయేది అన్నట్లుగా నిర్మాతల ఖాతాలో బౌన్సర్‌ల జీతాలను వేయడం వల్ల సెలబ్రెటీలు సెట్స్‌లో ఉన్న సమయంలోనూ బౌన్సర్‌లను పక్కన పెట్టుకుంటున్నారు. అతి తక్కువ మంది యంగ్‌ హీరోలు మాత్రమే ఒక్క బౌన్సర్‌ లేకుండా బయటకు వెళ్తారు. సెట్స్‌లోనూ వారి పక్కన బౌనర్లు ఉండరు. కానీ కొందరు మాత్రం ఓవర్‌ యాక్షన్‌తో అతి చేయాలనే ఉద్దేశ్యంతో బౌన్సర్లను పెట్టుకుంటారు. షూటింగ్‌ సమయంలో మేము చేసే యాక్షన్‌ కంటే బౌన్సర్‌లు చేసే యాక్షన్ ఎక్కువ ఉంటుంది అంటూ బ్రహ్మాజీ అన్నాడంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.

పోలీసులు ఈ మధ్య కాలంలో సెలబ్రిటీలు ఏర్పాటు చేసుకుంటున్న బౌన్సర్‌ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. అంతే కాకుండా బౌన్సర్‌లు జనాలపై దాడి చేస్తే, వారు సెక్యూరిటీ విషయంలో హడావిడి చేస్తే కచ్చితంగా ఆ సెలబ్రిటీ పై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా సెలబ్రిటీలు మాత్రం తగ్గడం లేదు. చిన్న చిన్న యూట్యూబర్స్‌ సైతం రోడ్ల మీద తిరుగుతూ సెక్యూరిటీ పేరుతో బౌన్సర్‌లను పెట్టుకుని షో చేస్తున్నారు. బౌన్సర్‌లుగా ఈ మధ్య కాలంలో వేలాది మంది ఉపాది పొందుతున్నారు అంటే ఏ స్థాయిలో వారి ఉపయోగం పెరిగిందో అర్థం చేసుకోవచ్చు.

Tags:    

Similar News