యూకే పార్లమెంట్‌లో చిరంజీవికి అత్యున్నత గౌరవం
ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి.;
ఇండియన్ సినీ ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుడు మెగాస్టార్ చిరంజీవి. కోట్లాది మంది ప్రేమను అందుకుంటున్న ఆయన ఒక నటుడిగానే కాకుండా బాధ్యత గల వ్యక్తిగా అనేక విషయాల్లో తనవంతు సహాయం చేస్తూ వస్తున్నారు. ఇప్పుడు మెగాస్టార్ అంతర్జాతీయంగా మరో గొప్ప గౌరవం దక్కింది. యూకే పార్లమెంట్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్ వేదికగా మెగాస్టార్ చిరంజీవిని సత్కరించనున్నారు.
మార్చి 19న జరిగే ఈ ఘనమైన వేడుకలో చిరంజీవికి "లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు ఫర్ ఎక్సలెన్స్ ఇన్ పబ్లిక్ సర్వీస్ త్రూ కల్చరల్ లీడర్‌షిప్" పురస్కారం అందించనున్నారు. బ్రిడ్జ్ ఇండియా సంస్థ ఆధ్వర్యంలో లేబర్ ఎంపీ నవేందు మిశ్రా హోస్ట్‌గా వ్యవహరించనున్న ఈ కార్యక్రమంలో యూకే పార్లమెంట్‌కు చెందిన గౌరవ సభ్యులు హాజరవ్వనున్నారు.
ఇది కేవలం ఒక పురస్కారం మాత్రమే కాదు, చిరంజీవి సినీ ప్రస్థానానికి, సమాజసేవకు ఇచ్చే ఒక అంతర్జాతీయ గుర్తింపు అని చెప్పవచ్చు. ఎందుకంటే 150కి పైగా సినిమాల్లో నటించి కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్న చిరు, వెండితెరను మాత్రమే కాకుండా తన సామాజిక సేవా కార్యక్రమాలతో లక్షలాది మందికి మానవత్వాన్ని చాటిచెప్పారు. ఆరోగ్య రంగంలో చిరంజీవి బ్లడ్ బ్యాంక్, ఆక్సిజన్ బ్యాంక్, అలాగే కరోనాకాలంలో అందించిన సేవలు కూడా ఈ స్థాయిలో గౌరవాన్ని తీసుకొచ్చాయి.
ఇక లేటెస్ట్ గా పద్మవిభూషణ్ పురస్కారాన్ని అందుకున్న చిరంజీవికి మరో ఘనత జతకానుంది. భారతీయ సినిమా ఖ్యాతిని ప్రపంచానికి చాటి చెప్పడంలో ఆయన పాత్ర అగ్రస్థానంలో నిలుస్తుంది. తన అద్భుతమైన నటనతో తెలుగు సినీ పరిశ్రమను జాతీయ స్థాయికి తీసుకెళ్లిన చిరు, ప్రస్తుతం కూడా అదే స్థాయిలో ప్రభావం చూపిస్తున్నారు. మెగాస్టార్‌కు అందుతున్న ఈ గౌరవం టాలీవుడ్‌కు మాత్రమే కాకుండా భారతీయ సినీ పరిశ్రమకు గర్వకారణం.
గతంలో ఎందరో మహనీయులకు దక్కిన వేదికపై చిరంజీవిని సత్కరించనుండడం ఓ విశేషం. భారతీయ సినిమా ద్వారా కల్చరల్ డిప్లొమసీని కొత్త ఎత్తులకు తీసుకెళ్లిన చిరంజీవి, ఈ అద్భుతమైన గౌరవాన్ని అందుకోవడం ఆయన ప్రయాణంలో మరొక మైలురాయిగా నిలుస్తుందని ఫ్యాన్స్ చెబుతున్నారు. మొత్తానికి, మెగాస్టార్ చిరంజీవి పేరు మరోసారి అంతర్జాతీయ వేదికపై మారుమ్రోగనుంది. లండన్‌లోని హౌస్ ఆఫ్ కామన్స్‌లో గౌరవించబోతున్న వేడుక భారతీయ సినీ పరిశ్రమలో ఓ ప్రత్యేక ఘట్టంగా నిలుస్తుంది. మెగాస్టార్ చరిత్రలోనే ఇది మరో గోల్డెన్ మూమెంట్‌గా మారబోతోంది. ప్రస్తుతం ఆయన విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. అలాగే అనిల్ రావిపూడి, శ్రీకాంత్ ఓదెల వంటి దర్శకులతో కూడా కొత్త ప్రాజెక్టులను లైన్ లో పెట్టారు.