గేమ్ ఛేంజర్.. ఇది కరెక్ట్ కాదు..
కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు.
టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ రీసెంట్ గా గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కోలీవుడ్ ప్రముఖ దర్శకుడు శంకర్ తెరకెక్కించగా.. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, తెలుగమ్మాయి అంజలి ఫిమేల్ లీడ్ రోల్స్ పోషించారు. చరణ్.. వైవిధ్యమైన పాత్రల్లో యాక్ట్ చేశారు.
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు హై బడ్జెట్ తో నిర్మించిన ఆ సినిమా.. అనేక ఏళ్ల పాటు షూటింగ్ జరుపుకుంది. ఎట్టకేలకు ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది గేమ్ ఛేంజర్. జనవరి 12వ తేదీన భారీ అంచనాల మధ్య థియేటర్లలో వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది.
కానీ అనుకున్న స్థాయిలో సినిమా మెప్పించలేకపోయింది. ఆడియన్స్ అంచనాలను అందుకోలేకపోయింది. దీంతో హీరో అండ్ క్యాస్టింగ్ ఖాతాల్లో ఫ్లాప్ వచ్చి చేరింది. అయితే సినిమా రిలీజ్ కు ముందు దిల్ రాజు.. శంకర్ తో కలిసి మంచి హిట్ కొడతానని అంచనా వేశారు. కచ్చితంగా మూవీ మెప్పిస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
కానీ అస్సలు అలా జరగలేదు. దీంతో సోషల్ మీడియాలో ట్రోల్స్ భారీగా కనిపించాయి. ఇప్పటికే టాలీవుడ్ లో వివిధ చిత్రాలు ఫ్లాప్ అయినా.. గేమ్ ఛేంజర్ విషయంలో మాత్రం ట్రోల్స్, మీమ్స్ ఓ రేంజ్ లో వచ్చాయి. అది యాంటీ ఫ్యాన్స్ చేశారో లేక నార్మల్ నెటిజన్లు అలా స్పందించారో తెలియదు కానీ కాస్తంత ఎక్కువే ఉన్నాయి.
నిజానికి సినీ ఇండస్ట్రీలో ఏ హీరోకు అయినా దర్శకుడికి అయినా హిట్టులు, ఫ్లాపులు కామన్. ఎవరి కెరీర్ లో అయినా జరుగుతూనే ఉంటాయి. అలాంటి సమయంలో ట్రోల్స్ కనిపిస్తుంటాయి. కామెంట్స్ కూడా వినిపిస్తుంటాయి.. కానీ ఇప్పుడు గేమ్ ఛేంజర్ పై కామెంట్స్ చేసినట్లు.. ట్రోల్స్ చేసినట్లు ఎప్పుడూ జరగలేదని మెగా ఫ్యాన్స్ అంటున్నారు.
టాలీవుడ్ ఇండస్ట్రీలోని పెద్దలు కూడా తెలుగు సినీ చరిత్రలో ఫ్లాప్ అయిన ఏకైక సినిమా గేమ్ ఛేంజర్ అన్న విధంగా ఎగతాళి చేయడం నిజంగా షాకింగ్ విషయమని చెబుతున్నారు. ఇలా మునుపెన్నడూ జరగలేదని.. గేమ్ ఛేంజర్ విషయంలో ఎందుకు జరిగిందోనని మాట్లాడుకుంటున్నారు. ఇది మంచి పరిణామం కాదని, సరైన పద్ధతి కాదని కామెంట్లు పెడుతున్నారు. మరి ఇప్పటికైనా ట్రోల్స్, మీమ్స్, కామెంట్స్ ఆగుతాయేమో వేచి చూడాలి.