మెట్రో సిటీస్ తో మొదలై రాజమండ్రితో ముగింపు!
`గేమ్ ఛేంజర్` రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రిలీజ్ కి ఇంకా 16 రోజులే సమయం ఉంది.
`గేమ్ ఛేంజర్` రిలీజ్ కౌంట్ డౌన్ ప్రారంభమైంది. రిలీజ్ కి ఇంకా 16 రోజులే సమయం ఉంది. ఇప్పటికే ప్రచారం పనులు మొదలయ్యాయి. అమెరికాలో భారీ ఎత్తున ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించి మంచి బూస్టింగ్ అందించారు. రామ్ చరణ్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు వరిస్తుందని సుకుమార్ లాంటి దిగ్గజమే వ్యాఖ్యానించారు. ఇక శంకర్ కాన్పిడెన్స్ గురించి చెప్పాల్సిన పనిలేదు. చరణ్ కి భారీ హిట్ ఇస్తాననే నమ్మకాన్ని వ్యక్తం చేసారు.
సినిమా రిలీజ్ ఆలస్యమైనా అభిమానులు మెచ్చే సినిమా అవుతుందని చిత్ర వర్గాల్లో ధీమా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ప్రచారం పనులు మరింత వేగవంతం చేయడానికి మేకర్స్ రెడీ అవుతున్నారు. ఇండియా వైడ్ మెట్రోపాలిటన్ నగరాల్లో భారీ ఎత్తున ఈవెంట్లు నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా చెన్నై, కొచ్చి, ఢిల్లీ, హైదరాబాద్ గ్రాండ్ ఈవెంట్లు నిర్వ హిస్తున్నారు. అదే సందర్భంలో నేషనల్ మీడియాతో టీమ్ ఇంటరాక్షన్ ఉంటుంది.
సినిమాను ఎంతగా వీలైతే అంతగా పైకి లేపి రిలీజ్ చేయాలన్నది శంకర్ ప్లాన్. దీనిలో భాగంగా చరణ్ తో పాటు కియారా అద్వాణీ, ఇతర కీలక నటులంతా ప్రచారంలో భాగం కానున్నారు. ఇక చిత్ర నిర్మాత దిల్ రాజు మొట్ట మొదటి పాన్ ఇండియా చిత్రం ఇది. దీంతో ఆయన రేంజ్ ని చూపించుకోవడానికి అంతే ఆశ పడుతున్నారు. ప్రచారమంతా ప్రతిష్టాత్మకంగానే ప్లాన్ చేస్తున్నారు. వేర్వేరు ఈవెంట్ల కోసం రాజుగారు నేషనల్ మీడియా ముందుకు వెళ్లి ఉంటారు.
కానీ ఆయన సొంత పాన్ ఇండియా సినిమాతో వెళ్లడం ఇదే తొలిసారి. శంకర్-రామ్ చరణ్ లతో పాటు రాజుగారు పాన్ ఇండియాలో వైరల్ అవుతారు. చివరిగా రాజమండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ తో ప్రచారం పనులు ముగిస్తారు. రాజమండ్రి ఈవెంట్ కు ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిధిగా హాజరు కానున్నారని సమాచారం. అబ్బాయ్ రామ్ చరణ్ సినిమా కాబట్టి ఆయన బిజీ షెడ్యూల్ ని సైతం పక్కనబెట్టి రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.