స్టార్ కోసం ఎదురుచూడకుండా.. హరీష్ ముందు జాగ్రత్త
2019 లో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది.
2019 లో వచ్చిన గద్దల కొండ గణేష్ సినిమా అనంతరం దర్శకుడు హరీష్ శంకర్ చాలా గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఇక మళ్ళీ చాలా కాలం తరువాత మళ్ళీ ఫుల్ స్వింగ్ లోకి వచ్చారు. మొదట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో 'భవదీయుడు భగత్ సింగ్' అనే సినిమాను చేయాలని ఉద్దేశించిన హరీశ్, ప్రస్తుతం ఆ కథను 'తేరీ' రీమేక్ తో మిళితం చేసి 'ఉస్తాద్ భగత్ సింగ్' గా మారుస్తున్నారు.
ఇక పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రాధాన్యతల కారణంగా ఈ సినిమా ఆలస్యం అయింది. ఇప్పుడు ఇండస్ట్రీలోని అంతర్గత సమాచారం ప్రకారం, తాజా పరిణామాలు ఇలా ఉన్నాయి. 'ఉస్తాద్ భగత్ సింగ్' ఆలస్యం కావడంతో, హరీశ్ శంకర్ బాలీవుడ్ సినిమా 'రైడ్' రీమేక్ 'మిస్టర్ బచ్చన్' తో రవితేజను ప్రధాన పాత్రలో తీసుకుని సినిమాను ప్రారంభించారు.
ఈ సినిమా పూర్తయిన తర్వాత, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ డేట్స్ ఇస్తే, హరీశ్ మళ్ళీ ఆయనతో ప్రాజెక్ట్ చేయనున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో జనసేన కూటమి గెలిచే అవకాశాలు ఉన్నందున, పవన్ షూటింగ్ కి రావడానికి మరింత సమయం పట్టవచ్చు. ఈ నేపథ్యంలో, హరీశ్ శంకర్ మరో సినిమాను సెటప్ చేసుకునే ఆలోచనలో ఉన్నట్లు మరో టాక్ వినిపిస్తోంది.
ఇక హరీష్ శంకర్ లిస్టులో రామ్ పోతినేని ఉన్నట్లు తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం రామ్ పోతినేని 'డబుల్ ఇస్మార్ట్' తర్వాత సినిమా హరీశ్ శంకర్ దర్శకత్వంలోనే ఉండే అవకాశం ఉందట. ఇది ఒరిజినల్ సినిమా గానీ, రీమేక్ మూవీ గానీ ఏదైనా ఉండవచ్చు, కానీ రామ్ మరియు హరీశ్ కలిసి త్వరలో ఒక సినిమా చేయబోతున్నట్లు బలమైన ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
హరీశ్ శంకర్ ప్రస్తుతం 'మిస్టర్ బచ్చన్' సినిమా పనులు పూర్తిచేసి రామ్ తో చేసే కొత్త ప్రాజెక్ట్ కి సిద్ధమవుతున్నట్లు సమాచారం. రామ్ తో చేయబోయే ఈ ప్రాజెక్ట్ హరీశ్ శంకర్ కు మరింత క్రేజ్ తీసుకురాగలదని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి, హరీశ్ శంకర్ తన ప్రాజెక్టులను ఎటువంటి ఆటుపోటు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారు.
పవన్ తో చేయబోయే సినిమా ఆలస్యమైనా కూడా ఖాళీగా ఉండడం లేదు. రవితేజ రామ్ తో కొత్త ప్రాజెక్టులు కొనసాగిస్తూ తన దర్శకత్వ ప్రతిభను మరింత మెరుగుపరుస్తున్నారు. ఇది హరీష్ శంకర్ కు ఒక మంచి బూస్ట్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఒక సినిమా గురించి టైమ్ వెస్ట్ చేస్తే మళ్ళీ హీరోలు దొరకడం కష్టంగా మారుతుంది. అందుకే హరీష్ గతంలో మాదిరిగా పవన్ కోసం ఎదురు చూడడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యవహారాలు పూర్తి చేస్తే ఆ తర్వాత, 'ఉస్తాద్ భగత్ సింగ్' కూడా వెంటనే స్టార్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.