జయం రవి-ఆర్తీ విడాకులపై కోర్టు ఏమందంటే?
తమిళ నటుడు జయం రవి భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొంత కాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే.
తమిళ నటుడు జయం రవి భార్య ఆర్తీతో విడిపోతున్నట్లు కొంత కాలం క్రితం ప్రకటించిన సంగతి తెలిసిందే. విడాకుల కోసం చెన్నై ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ కూడా దాఖలు చేసారు. తాజాగా ఈ పిటీషన్ ని కోర్టు పరిశీలించింది. జయం రవి కోర్టు కు హాజరు కాగా, ఆర్తీ వీడియో కాల్ ద్వారా అందుబాటులోకి వచ్చారు. ఈ నేపథ్యంలో న్యాయస్థానం ఇరు వర్గాల వాదనలు వింది.
అనంతరం ఇద్దరు మరోసారి కలిసి మాట్లాడుకోవాలని..రాజీ కోసం ప్రయత్నించాలని సూచించింది. విడిపోవా లనుకుంటే అందుకు గల కారణాలు స్పష్టంగా పేర్కోవాలని ఆదేశించింది. వివాదం నేపథ్యంలో జయం రవి, ఆర్తి ఎవరి వెర్షన్ వారు ఇప్పటికే మీడియా ముఖంగా చెప్పుకొచ్చారు. ఇలాంటి తరుణంలో రాజీ ప్రయత్నం విషయంలో ఎలాంటి పురోగతి ఉంటుందో చూడాలి. విడాకుల పిటీషన్ నేపథ్యంలో కోర్టు సైతం ఆరు నెలలు పాటు కలిసి ఉండాలని ఆదేశిస్తుంది.
విడిపోవడానికి బలమైన కారణాలుంటేనే కోర్టు కూడా అందుకు తగ్గట్టు ఆదేశాలిస్తుంది. మరి ఈ కేసు విషయంలో ఏం జరుగుతుందో చూడాలి. 2009లో హీరో రవి- ఆర్తి వివాహం జరిగింది. ఈ జంటకు ఇద్దరు పిల్లలు కలరు. అయితే పరస్పర అంగీకారంతోనే తాము విడిపోవాలని అనుకున్నట్లు సెప్టెంబర్‌లో జయం రవి సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. `ఎన్నో ఆలోచనలు, చర్చల తర్వాత నేను, నా భార్య ఆర్తి విడాకులు తీసుకోవాలనే కఠినమైన నిర్ణయాన్ని తీసుకున్నాం. మా ఇద్దరి మంచి కోసమే ఇలా చేస్తున్నాం` అని పేర్కొన్నారు.
అయితే జయం రవి ప్రకటనపై ఆర్తి సంచలన ఆరోపణలు చేసారు. తనకు తెలియకుండానే, అనుమతి తీసుకోకుండానే డివోర్స్ గురించి రవి బహిరంగంగా ప్రకటించారని అసహనం వ్యక్తం చేసారు. అలా వీరి విడాకుల వ్యవహారం సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలోనే ఆర్తి ఆరోపణలపై రవి ఆ మధ్య మీడియాతోనూ మాట్లాడారు. లాయర్ ద్వారా విడాకుల నోటీసు పంపించానని, ఈ విషయం ఆమె తండ్రికి కూడా తెలుసని, దీని గురించి ఇరు కుటుంబాల పెద్దలు కూడా చర్చించినట్లు తెలిపారు.