జర్నలిస్టు హౌసింగ్ సొసైటీ JCHSL ఎన్నికలు?
స్టీరింగ్ కమిటీ సమావేశం భీమగాని మహేశ్ గౌడ్ అధ్యక్షతన ఇటీవల సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సమావేశం జరిగింది.
రాజకీయ ఒత్తిళ్లకు తలవంచకుండా, సొసైటీ సంక్షేమం కోసం, సభ్యులు ప్రయోజనాలకు పాటుపడే వారిని ప్రతినిధులుగా ఎన్నుకోవాలని జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ స్టీరింగ్ కమిటీ సభ్యులు నిర్ణయించారు. స్టీరింగ్ కమిటీ సమావేశం భీమగాని మహేశ్ గౌడ్ అధ్యక్షతన ఇటీవల సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో ప్రత్యేక సమావేశం జరిగింది.
మెజారిటీ వర్గం అయిన నాన్ అలాటీ జర్నలిస్టులకు ఇళ్ల స్థలాల సాధనే ధ్యేయంగా ఈ సమావేశంలో చర్చించారు. సొంతింటి సాధనలో అడుగడుగునా ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోడానికి సభ్యుల మద్దతు, సహకారం అవసరమని స్టీరింగ్ కమిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. సొసైటీ మేనేజింగ్ కమిటీ ఎన్నికలకు సన్నద్ధత, సభ్యుల పాత్ర, ఇంటి స్థలాల సాధన, ఎన్నికల్లో ఏకగ్రీవం, పోటీదారుల ఆసక్తి వ్యక్తీకరణ, నాన్ అలాటీస్ తరఫున ప్యానల్ రూపకల్పన అంశాలు ప్రస్తావనకు వచ్చాయి.
ఎన్నికలు ప్రక్రియ పూర్తయిన తర్వాత కొత్త మేనేజింగ్ కమిటీ బాధ్యతాయుత పాత్రపై చర్చ సాగింది. అలాటీస్, నాన్ అలాటీస్ సభ్యులు సమన్వయంతో ఉమ్మడి ఎజెండాను రూపొందించుకుని సభ్యులను ఎన్నికలకు సన్నద్ధంచేస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమైంది. హౌసింగ్ సొసైటీలో మెజారిటీ ఉన్న నాన్ అలాటీస్ సభ్యులతో ప్యానల్ రెడీ చేస్తే సొసైటీ సభ్యుల ఐక్యతతో మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో విజయం సాధించవచ్చని సభ్యులు అభిప్రాయపడ్డారు.
సొసైటీ తరఫున నాన్ అలాటీస్ సభ్యుల జాబితాను ఆధార్ నెంబర్లతో మీడియా అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డికి సమర్పించాలనే ప్రస్తావనపై చర్చ జరిగింది. మన సొసైటీ ఇతర హౌసింగ్ సొసైటీలతో విలీనం జరుగుతోందనే అపోహ, ఆందోళన సభ్యులు దూరం చేసుకోవాలనే విషయంపై ప్రతినిధులు స్పష్టత నిచ్చారు. ఒకే వ్యక్తి రెండు, మూడు సొసైటీల్లో కొనసాగే ప్రక్రియకు అడ్డుకట్ట వేసే విధంగా ఆధార్ నెంబర్లతో జాబితా సిద్ధం చేస్తున్నట్లు గోపరాజు తెలిపారు. వివిధ సంస్థల్లో పనిచేస్తున్న జర్నలిస్టులు ఈ ఎన్నికల్లో పోటీ చేయాలని ముందుకొచ్చేవారిని గుర్తించాలని ప్రస్తావించారు. అలాటీస్ తరుఫున ఒకరు, మహిళా విభాగం తరఫున ఒకరు, ముస్లిం మైనారిటీల తరఫున ఒకరు, ఫిల్మ్ జర్నలిస్టుల తరఫున ఒకరు, కెమరామెన్ల తరఫున ఒకరు, స్టీరింగ్ కమిటీ తరఫున ఓ ఇద్దరితో ప్యానల్ సిద్ధం చేసి ఎన్నికల బరిలో దింపితే బాగుంటుందని గోపరాజు అభిప్రాయం వ్యక్తం చేశారు.
కోర్టు కేసు కోసం సభ్యుల నుంచి 2500 రూపాయలు చొప్పున వసూలు చేసిన నగదు ఖర్చులు, అడ్వొకేట్ ఫీజు మినహాయిస్తే మిగులు నిధి రూ. 1,71,496 (ఒక లక్ష డెబ్బై ఒక్క వెయ్యి నాలుగు వందల తొంభై ఆరు రూపాయలు) ఉన్నాయని స్టీరింగ్ కమిటీ కోశాధికారి మిక్కిలినేని రవీంద్రబాబు తెలిపారు. ఎన్నికలు పూర్తయ్యే వరకు మిగులు నిధిని బ్యాంకులో ఉంచమని స్టీరింగ్ కమిటీ సూచించింది. వసూలు చేసిన నగదుకు ఎవరు అడిగినా స్టీరింగ్ కమిటీ సభ్యులు సమాధానం ఇవ్వాలని సమ్మతించారు.
జర్నలిస్టు కో-ఆపరేటివ్ హౌసింగ్ సొసైటీ లిమిటెడ్ సభ్యుడిగా కొనసాగుతున్నానని, మరే సొసైటీతో సంబంధంలేదని, అలా కొనసాగితే సొసైటీ తరఫున ప్రయోజనాలకు అనర్హుడిగా ప్రకటించాలనే అఫిడవిట్ సభ్యుల నుంచి తీసుకోవాలని సీనియర్ జర్నలిస్టు సత్యమూర్తి ప్రతిపాదించారు. ఈ సమావేశంలో స్టీరింగ్ కమిటీ సభ్యులు యలవర్తి సునీత, జంగారెడ్డి, మహేష్ గౌడ్, యాదయ్య, దుర్గం శ్రీనివాస్, కిశోర్, ప్రభు, పవన్ కుమార్, లక్ష్మీనారాయణ, అశోక్, ముద్దం నరసింహా స్వామి , యోగానంద్, వీరాంజనేయులు, సాగర్ తదితరులు పాల్గొన్నారు.