'కల్కి'కి ఆ రెండు చోట్లా నిరాశే..!
ఓటీటీ ఫలితం తీవ్రంగా నిరాశ పరచగా తాజాగా కల్కి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది. జీ తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది.
ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొంది గత ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'కల్కి 2898 ఏడీ' బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. దాదాపుగా రూ.1000 కోట్ల వసూళ్లు రాబట్టిన కల్కి సినిమా సీక్వెల్ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కల్కి సినిమా థియేట్రికల్ రిలీజ్‌లో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఓటీటీ ద్వారా ఆశించిన స్థాయిలో ఫలితాన్ని సొంతం చేసుకోలేక పోయింది అనేది టాక్. ప్రముఖ ఓటీటీ నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయిన కల్కి సినిమాకు డిజిటల్ ప్రపంచంలో నిరాశ మిగిలింది. అంతకు ముందు వెయ్యి కోట్ల వసూళ్లు సాధించిన పలు సినిమాలు ఓటీటీలో అద్భుత స్పందన దక్కించుకున్నాయి.
ఆ సినిమాలతో పోల్చుతూ ఈ సినిమాకు ఓటీటీలో ప్రేక్షకుల మద్దతు ఎందుకు దక్కలేదు అంటూ చాలా మంది చాలా రకాలుగా విశ్లేషించారు. ఎవరికి తోచిన విధంగా వారు కామెంట్స్ చేశారు. ఓటీటీ ఫలితం తీవ్రంగా నిరాశ పరచగా తాజాగా కల్కి సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ అయ్యింది. జీ తెలుగులో ఈ సినిమా టెలికాస్ట్ అయ్యింది. ప్రేక్షకుల నుంచి అద్భుత స్పందన వస్తుందని మేకర్స్‌తో పాటు జీ తెలుగు భావించారు. కానీ అనూహ్యంగా కల్కి సినిమాకు కేవలం 5.26 రేటింగ్ అర్బన్‌లో నమోదు అయ్యింది. ఈమధ్య కాలంలో పెద్ద హీరోల సినిమాలు అర్బన్ ఏరియాల్లో భారీ రేటింగ్ దక్కించుకుంటున్నా ఈ సినిమా ఆ స్థాయి రేటింగ్ దక్కించుకోక పోవడం ఆశ్చర్యంగా ఉంది.
కల్కి సినిమా థియేట్రికల్ రిలీజ్ తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నప్పటికీ ఎందుకు ఓటీటీలో, బుల్లి తెరపై ఆకట్టుకోలేక పోయింది అంటూ పలువురు సోషల్ మీడియా ద్వారా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా టీవీల్లో టెలికాస్ట్ అయిన సమయంలో కచ్చితంగా మంచి స్పందన వస్తుందని అనుకున్నారు. కానీ ఆశించిన రేటింగ్‌లో కనీసం సగం రేటింగ్ రాలేదు. అందుకు కారణం సినిమా విడుదల అయ్యి చాలా నెలలు అవుతుంది. ఇప్పుడు టెలికాస్ట్ చేయడం ద్వారా ప్రేక్షకుల్లో ఆసక్తి లేదని కొందరు అంటూ ఉంటే, కొందరు మాత్రం ఈ సినిమాను వెండి తెరపై చూస్తేనే బాగుంటుంది. బుల్లి తెరపై చూసే సినిమా కాదని కొందరు అనుకుని ఉంటారని అంచనా వేస్తున్నారు.
ఫ్యూచర్‌ను మహాభారతంతో కనెక్ట్ చేసి ఈ సినిమాను రూపొందించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ ప్రతి పాత్రను చక్కగా చూపించాడు. ప్రభాస్ హీరో విషయంలో కాస్త విమర్శలు వచ్చినా ఓవరాల్‌గా సినిమా వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సొంతం చేసుకున్న సినిమా ఓటీటీ, టీవీ ప్రిమియర్‌లో నిరాశ పరచడంతో పార్ట్ 2 విషయంలో మేకర్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి. ఈ ఏడాది జూన్ లేదా జులై నుంచి పార్ట్ 2 షూటింగ్ ప్రారంభించనున్నట్లు ఇటీవల నిర్మాత అశ్వినీదత్ తెలియజేశారు.