క్వీన్ కంగన చారిత్రక తప్పిదం!
అయితే ఈ చిత్రంలో తొలిగా దీపిక బదులుగా కంగనకు పద్మావత్ గా నటించే అవకాశం లభించింది.
దీపిక పదుకొనే ప్రధాన పాత్రలో సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన 'పద్మావత్ 3డి' సంచలన విజయం సాధించి బాక్సాఫీస్ వద్ద దాదాపు 500 కోట్లు వసూలు చేసిన మహిళా ప్రధాన చిత్రంగా రికార్డులకెక్కింది. ఈ సినిమాలో రాణి పాత్రలో దీపిక పదుకొనే నటనకు గొప్ప ప్రశంసలు కురిసాయి.
అయితే ఈ చిత్రంలో తొలిగా దీపిక బదులుగా కంగనకు పద్మావత్ గా నటించే అవకాశం లభించింది. సంజయ్ లీలా భన్సాలీ కంగనను ఈ పాత్ర కోసం సంప్రదించగా, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో అవకాశాన్ని కాలదన్నుకుంది. భన్సాలీ తనకు పాత్రను వివరించినప్పుడు పద్మావతి పాత్రకు అంతగా ప్రాధాన్యత లేదని భావించినందున కంగన నిర్ద్వంద్వంగా తిరస్కరించానని తెలిపింది. రాణి పద్మావతి పాత్ర సినిమా అంతటా ప్రిపరేషన్ తోనే ఉంటుందని, దర్శకుడు చెప్పినప్పుడే ఆ విషయం అర్థమైపోయిందని కంగన అన్నారు.
ఇటీవల విడుదలైన కంగన 'ఎమర్జెన్సీ'కి మిశ్రమ స్పందనలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా కంగన త్రోబ్యాక్ వీడియో ఒకటి వైరల్ గా మారింది. దీనిలో క్వీన్ మాట్లాడుతూ...'పద్మావత్'లో రాణి పద్మావతి పాత్రను తనకు ఆఫర్ చేశారని కంగనా రనౌత్ వెల్లడించారు. కానీ అది అంత ముఖ్యమైన పాత్ర కాదని భావించి తిరస్కరించారు. ఈ చిత్రంలో రణవీర్ సింగ్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో నటించారు. సంజయ్ లీలా భన్సాలీ స్వీయదర్శకత్వంలో నిర్మించిన ఈ చిత్రం దీపిక, రణవీర్ ల కెరీర్ ఉత్తమ చిత్రాలలో ఒకటిగా నిలిచింది. రాజ్ పుత్ మహారాణి పాత్రలో దీపికను ఎంతో అందంగా, అద్భుతంగా చూపించారు భన్సాలీ.
అయితే కంగనకు భన్సాలీ వివరించిన సీన్ బహుశా కనెక్ట్ కాలేదు. పద్మావత్ ఆఫర్ రాగానే, సర్ నేను స్క్రిప్టు చదవగలనా? అని కంగన దర్శకుడు భన్సాలీని ఎదురు ప్రశ్నించింది. కానీ ''నేనెప్పుడూ స్క్రిప్ట్ ఇవ్వను'' అని చెప్పారట. అయితే హీరోయిన్ పాత్ర ఏమిటి? అని కంగన మళ్లీ ప్రశ్నించారు. దానికి భన్సాలీ ఇచ్చిన జవాబు సంతృప్తి పరచకపోవడంతో కంగన అవకాశాన్ని కాదనుకుంది.
నేను సినిమా చూసినప్పుడు, ఆమె (దీపిక) మొత్తం సినిమా అంతటా సిద్ధమవుతోంది. అతడు (భన్సాలీ) చెప్పింది నిజమే. ఆమె మాత్రమే సిద్ధమవుతోంది. కాబట్టి నేను పేర్లు పెట్టాల్సిన అవసం లేదు! అని కంగన తాజా ఇంటర్వ్యూలో నర్మగర్భంగా వ్యాఖ్యానించింది. కంగన తాజా చిత్రం 'ఎమర్జెన్సీ'లో ఇందిరా గాంధీ పాత్రను పోషించడమే కాకుండా స్వీయదర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కించింది. అయితే కంగన నటనకు ప్రశంసలు కురుస్తున్నా బాక్సాఫీస్ వద్ద ఆశించిన వసూళ్లు దక్కడం లేదు. పద్మావత్ చిత్రం తనకు నచ్చినా నచ్చకపోయినా 500 కోట్లు వసూలు చేయడం ఒక సంచలనం. కానీ కంగన ఆ అవకాశాన్ని వదులుకోవడం చారిత్రక తప్పిదమని, ఆ తర్వాత కంగన నటించిన వరుస ఫ్లాపులు వంద శాతం తన ఎంపికలు తప్పు అని నిరూపించాయి.