ఆర్థిక ఇబ్బందులతో వెనక్కి వెళ్లొద్దు.. నేను సాయం చేస్తా!
దిల్ రూబా సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.;
దిల్ రూబా సినిమాతో యంగ్ హీరో కిరణ్ అబ్బవరం మార్చి 14న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. విశ్వ కరుణ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ గా నటించింది. థియేటర్ నుంచి బయటకు వచ్చే టైమ్ లో ఓ మంచి సినిమా చూశామనే ఫీలింగ్ ఆడియన్స్ కు కలుగుతుందని కిరణ్ అబ్బవరం మంగళవారం జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తెలిపాడు.
ఈ ఈవెంట్ లో కృష్ణ నగర్, ఫిల్మ్ నగర్ లో ఉండే సినిమా పిచ్చోళ్ల గురించి మాట్లాడాడు కిరణ్ అబ్బవరం. సినిమా మీద ఇష్టంతో ఎంతోమంది ఇండస్ట్రీలోకి వస్తుంటారని, కానీ ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా కొన్నాళ్లు ప్రయత్నించి వెనుదిరిగి వెళ్లిపోతున్నారని కిరణ్ అన్నాడు. ఇండస్రీలో అవకాశాలు రావడం చాలా తక్కువని చెప్పిన ఆయన, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి తనదైన సాయం చేస్తానని వెల్లడించాడు.
తాను కృష్ణ నగర్ కు వచ్చిన మొదట్లో 50 మందితో ఓ గ్రూప్ ఉండేదని రోజులు గడుస్తున్న కొద్దీ ఆ గ్రూప్ కాస్తా 40 మంది, 30 మంది, 10 మంది అయిందని, ఆ 50 మందిలో ఇవాళ ఇద్దరు ముగ్గురు కూడా ఇండస్ట్రీలో లేరని దానికి కారణం ఆర్థిక ఇబ్బందులేనని, అలాంటివారిని తన జర్నీలో ఎంతోమంది చూశానని, తను మంచి స్థాయిలో ఉంటే అలాంటి వారికి సాయం చేయాలని ఎప్పటినుంచో అనుకుంటున్నట్టు కిరణ్ చెప్పాడు.
ఈ రోజు నాదైతే, రేపు మీదే. సినీ అవకాశాల కోసం వచ్చిన వారు ఆర్థిక కారణాలతో కృష్ణ నగర్ నుంచి తిరిగి వెళ్లొద్దని ఈ సందర్భంగా కిరణ్ సూచించాడు. ఈ రోజు తన స్థాయి చిన్నదే అయినప్పటికీ ఇండస్ట్రీలో అవకాశాల కోసం ప్రయత్నిస్తూ, ఆర్థిక ఇబ్బందులు పడుతున్న వారికి అండగా ఉంటూ తన వంతు సాయం చేస్తానని కిరణ్ తెలిపాడు.
అభిమానుల దయ వల్ల తనకంటూ ప్రత్యేక గుర్తింపు వచ్చిందని, అందుకే సినిమా మీద ప్రేమతో ప్రతీ సంవత్సరం ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న పది మందికి సాయం చేయాలని నిర్ణయించుకున్నానని, ప్రతి ఏడాది 10 మందికి అన్ని వసతులు ఉండేలా చూస్తానని, ఫ్యూచర్ లో తాను ఎదిగితే 100 మందికైనా సాయం చేయడానికి రెడీగా ఉన్నానని, దీన్ని తన బాధ్యతగా భావిస్తున్నట్టు కిరణ్ చెప్పాడు.
ఇండస్ట్రీకి కొత్త టాలెంట్ అవసరం చాలా ఉందని, కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి తాను రెడీగా ఉన్నానని, తాను నటించే ప్రతీ సినిమాలో 40 నుంచి 50 మంది వరకు కొత్త వాళ్లకు అవకాశాలు ఇవ్వడానికి ట్రై చేస్తానని, తనకంటే టాలెంట్ ఉన్న వాళ్లు బయట చాలా మంది ఉన్నారని అదృష్టం వల్ల తనకు అవకాశాలొచ్చి గుర్తింపు లభించిందని, కష్టపడితే ఎవరైనా సక్సెస్ అవుతామని కిరణ్ చెప్పాడు. కిరణ్ మంచి మనసును చూసి అందరూ తనను అభినందిస్తున్నారు.