కొణిదెల ఫ్యామిలీ ఫర్ కాజ్.. కోడలు లావణ్య చెప్పిన సంగతి!
తెలుగు సినీతారల్లో సామాజిక బాధ్యత, సేవాగుణం గురించి, అవసరంలో ఉన్నవారిని ఆదుకునే మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే.
తెలుగు సినీతారల్లో సామాజిక బాధ్యత, సేవాగుణం గురించి, అవసరంలో ఉన్నవారిని ఆదుకునే మంచితనం గురించి ఎంత చెప్పినా తక్కువే. ముఖ్యంగా కథానాయికలు సామాజిక సేవా కార్యక్రమాలలో పాలు పంచుకుంటూ మంచితనాన్ని ప్రదర్శిస్తున్నారు. సమంత, కాజల్ అగర్వాల్, అనుష్క శెట్టి లాంటి కథానాయికలు సామాజిక సేవాకార్యక్రమాలతో నిరంతరం ప్రజాభిమానాన్ని చూరగొన్నారు.
ఇప్పుడు ఇదే జాబితాలో లావణ్య త్రిపాఠి కూడా చేరారు. లావణ్య కొణిదెల ఇంట కోడలిగా అడుగుపెట్టాక బాధ్యతాయుతమైన ఇల్లాలిగా అందరి మనసుల్ని గెలుచుకుంటున్నారు. వరుణ్ తేజ్ - లావణ్య జంట అన్యోన్య జీవనం నేటి జంటలకు కపుల్ గోల్ సెట్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు లావణ్య త్రిపాఠి సోషల్ మీడియాల్లో షేర్ చేసిన ఒక విషయం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.
లావణ్య ఈ ఆదివారం ఇన్స్టాలో ఒక వీడియోను షేర్ చేసారు. అందులో లావణ్య, తన అత్తగారితో కలిసి వంట చేయడంలో నిమగ్నమై ఉంది. అయితే ఈ వంట ఎవరి కోసం అంటే.. దానికి ఒక కాజ్ ఉందని లావణ్య వెల్లడించారు. ఫ్యామిలీ ఫర్ కాజ్...మీల్స్ విత్ లవ్ ..అనే హ్యాష్ ట్యాగులతో అసలు సంగతి చెప్పకనే చెప్పారు. ``ప్రతి వారం, మా కుటుంబం కలిసి వండడానికి, ప్యాక్ చేయడానికి కారణం ఆకలితో అవసరంలో ఉన్నవారికి ఈ భోజనాలను అందజేసేందుకే``నని తెలిపారు. ఇది ఇవ్వడం గురించి మాత్రమే కాదు... ఈ ప్రక్రియలో మన హృదయాలు ఆనందంతో ఉప్పొంగుతాయి. వారి ప్రేమ, కృతజ్ఞత గురించే ఇదంతా! అని లావణ్య వెల్లడించారు.
పరిశ్రమలో పాపులర్ హీరోలు కష్టంలో ఉన్నవారిని ఆదుకుని ప్రశంసలు అందుకుంటున్నారు. చిరంజీవి, పవన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ చరణ్, ఎన్టీఆర్ సహా పలువురు స్టార్లు సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా ఉన్నారు. వీరంతా తీవ్రమైన కష్టంలో ఉన్న ప్రజలను, అభిమానులను ఆదుకునేందుకు ఆర్థిక సహాయం చేస్తున్న సందర్భాలున్నాయి.