పాపం మృణాల్ కష్టమంతా ఓటీటీ పాలు..!
హిందీలో మృణాల్ గత రెండేళ్లుగా 'పిప్ప' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో సాగుతుంది.
తెలుగు లో సీతారామం సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకున్న ముద్దుగుమ్మ మృణాల్ ఠాకూర్. ఇక్కడ ఎంట్రీ ఇవ్వక ముందే ఉత్తరాదిన బుల్లితెర మరియు వెండి తెరపై మంచి గుర్తింపును మృణాల్ సొంతం చేసుకుంది. బాలీవుడ్ లో ఇప్పుడిప్పుడే ఈ అమ్మడు పెద్ద సినిమాల్లో అవకాశాలు దక్కించుకుంటూ, మంచి పాత్రల్లో నటిస్తూ ఉంది.
హిందీలో మృణాల్ గత రెండేళ్లుగా 'పిప్ప' అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఎయిర్ ఫోర్స్ నేపథ్యం లో సాగుతుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఏకంగా ఏడాది పాటు కఠిన శిక్షణ తీసుకున్నట్లుగా బాలీవుడ్ వర్గాల సమాచారం. ఏడాదికి పైగా కష్టమైన లొకేషన్స్ లో పిప్ప షూటింగ్ ను నిర్వహించారట. మృణాల్ ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటించింది.
ఈ ఏడాదిలోనే థియేటర్ల ద్వారా పిప్ప సినిమా తో మీ ముందుకు రాబోతున్నట్లుగా పలు ఇంటర్వ్యూల్లో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ చెప్పుకొచ్చింది. కానీ ఇప్పుడు పిప్ప పరిస్థితి అటు ఇటు కాకుండా ఉందట. పిప్ప సినిమాను నిర్మించిన రోన్ని స్క్రూవాలా గత చిత్రం 'తేజస్' దారుణంగా నిరాశ పరిచింది. పెట్టిన పెట్టుబడిలో కనీసం 25 శాతం కూడా వెనక్కి తీసుకుని రాలేక పోయిందట.
తేజస్ ఎఫెక్ట్ 'పిప్ప' సినిమా పై పడిందట. ఆర్థిక పరమైన విషయాల కారణంగా పిప్ప సినిమా ను థియేట్రికల్ రిలీజ్ చేయడం నిర్మాత రోన్ని కి సాధ్యం అయ్యే పరిస్థితి కనిపించడం లేదు. మృణాల్ ఠాకూర్ గత చిత్రాలు థియేట్రికల్ రిలీజ్ అయ్యి మంచి విజయాలను సొంతం చేసుకున్నాయి. ఇప్పుడు పిప్ప సినిమా కూడా థియేట్రికల్ రిలీజ్ అయితే కచ్చితంగా మంచి విజయాన్ని సొంతం చేసుకునేది అంటూ చాలా మంది నమ్మకం వ్యక్తం చేస్తున్నారు.
ఎంతో కష్టపడి మృణాల్ చేసిన పిప్ప సినిమాను థియేట్రికల్ రిలీజ్ కాకుండా ఓటీటీ ద్వారా డైరెక్ట్ స్ట్రీమింగ్ చేసేందుకు గాను నిర్మాత రోన్ని అమెజాన్ ప్రైమ్ తో ఒప్పందం చేసుకున్నారంటూ వార్తలు వస్తున్నాయి. హీరో, హీరోయిన్ ఎంత కష్టపడి నటించినా కూడా నిర్మాత నిర్ణయం ఫైనల్. కనుక ఆయన ఓటీటీ స్ట్రీమింగ్ కి సినిమా ను ఇవ్వడంతో మృణాల్ ఆవేదన వ్యక్తం చేయడం తప్ప ఏమీ చేయలేని పరిస్థితి. పాపం మృణాల్ కష్టం అంతా కూడా ఓటీటీ పాలు అన్నట్టు కొందరు మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.