అలా కావాలంటే వాళ్ల దగ్గరకే వెళ్లండని చెప్పా..!

ఇక కొందరు దర్శక నిర్మాతలు అంతకుముందు వచ్చిన పాటలనే కాస్త అటు ఇటు మార్చి మ్యూజిక్ ఇవ్వమన్నారు. అలా కావాలంటే మీరు వాళ్ల దగ్గరకే వెళ్లి సంగీతం చేయించుకోండని చెప్పానని అన్నారు శశి ప్రీతం.

Update: 2023-07-21 16:46 GMT

కృష్ణవంశీ డైరెక్షన్ లో వచ్చిన గులాబి సినిమా చూసిన వారెవరైనా సరే ఆ సినిమా మ్యూజిక్ ని అంత త్వరగా మర్చిపోలేరు. ఆ సినిమాలోని ఈ వేళలో నీవు ఏం చేస్తు ఉంటావో సాంగ్ ఇప్పటికీ సంగీత ప్రియులను అలరిస్తూ ఉంది. ఈ సినిమాతోనే శశి ప్రీతం సంగీత దర్శకుడిగా టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే అద్భుతమైన మ్యూజిక్ అందించిన శశి ప్రీతం ఆ తర్వాత వరుస సినిమా అవకాశాలు అందుకున్నారు.

1999 నుంచి 2019 వరకు పాతిక సినిమాలకు సంగీతాన్ని అందించారు శశి ప్రీతం. రీసెంట్ గా శశి ప్రీతం ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. కాలేజ్ స్టడీ పూర్తి కాగానే స్టూడియో పెట్టుకుని కంపోజింగ్ స్టార్ట్ చేశారు. మొదట్లో జింగిల్స్ కంపోజ్ చేసేవాడిని ఆ టైం లో జింగ్ కోసం 50 రూపాయలు తీసుకునే వాడినని అన్నారు. గులాబి సినిమా చేసే టైం కు జింగిల్స్ లో తను మంచి పేరు సంపాదించానని అందుకే గులాబి సినిమాకు తనకు 50 వేల రెమ్యునరేషన్ అందించారని చెప్పుకొచ్చారు శశి ప్రీతం.

మధ్యలో కృష్ణవంశీతో గొడవ వల్ల కొన్నాళ్లు మాట్లాడలేదు కానీ సముద్రం సినిమా టైం లో మళ్లీ అతనితో కలిసి పనిచేశానని అన్నారు. పుట్టి పెరిగింది కలకత్తాలోనే అయినా ఆ తర్వాత హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాం.. కంపోజర్ గా మారిన తర్వాత ఇక్కడ సినిమాలు చేస్తూ వచ్చాను. 1993లో తనకు పెళ్లైందని చెప్పిన శశి ప్రీతం గులాబి సినిమా టైం లో పాపని ఎత్తుకుని రాత్రుల్లు ఆ సినిమా సాంగ్స్ కంపోజ్ చేశానని చెప్పారు. పెళ్లైన పదేళ్ల తర్వాత భార్యతో విడిపోవాల్సి వచ్చింది. అయినా తన పాప తన దగ్గరే పెరిగిందని అన్నారు శశి ప్రీతం.

ఇక కొందరు దర్శక నిర్మాతలు అంతకుముందు వచ్చిన పాటలనే కాస్త అటు ఇటు మార్చి మ్యూజిక్ ఇవ్వమన్నారు. అలా కావాలంటే మీరు వాళ్ల దగ్గరకే వెళ్లి సంగీతం చేయించుకోండని చెప్పానని అన్నారు శశి ప్రీతం. అయితే తాను అలా చెప్పడం కొందరికి నచ్చలేదు కావొచ్చు అందుకే తనకు అవకాశాలు సరిగా రాలేదు అలా సినిమాలకు దూరం కావాల్సి వచ్చిందని అన్నారు. తెలుగులో చేసిన తక్కువ సినిమాలతోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకున్న శశి ప్రీతం చాలా గ్యాప్ తర్వాత మళ్లీ ఇలా ఇంటర్వ్యూతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.


Tags:    

Similar News