ఊరమాస్ గెటప్ లో చైతూ.. తండేల్ లుక్ అదుర్స్!

అక్కినేని హీరో యువసామ్రాట్ నాగచైతన్య.. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు

Update: 2023-12-20 16:32 GMT

అక్కినేని హీరో యువసామ్రాట్ నాగచైతన్య.. ఫలితంతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు. వైవిధ్యమైన చిత్రాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు అన్ని జానర్లు టచ్ చేసిన ఆయన.. ప్రస్తుతం చందూ మొండేటి దర్శకత్వంలో తండేల్ మూవీ చేస్తున్నారు.

ఉత్తరాంధ్ర జిల్లాలకు కొందరి మత్స్యకారుల నిజజీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నాగచైతన్య.. ఓ మత్స్యకారుడి పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రంలోని పాత్ర కోసం తనను తాను చాలా మార్చుకున్నారు చైతూ. జాలరిగా రగ్డ్ లుక్‌లో ఆయన సినిమాలో కనిపించనున్నారు.

ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ కర్ణాటక, ఉడిపిలోని మల్పే పోర్టులో జరుగుతోంది. తాజాగా షూటింగ్ లొకేషన్ లోని నాగచైతన్యకు సంబంధించిన ఓ ఫొటో సోషల్ మీడియాలో లీక్ అయింది. ఆ ఫొటోలో చైతూ ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు. పొడవాటి జట్టు, మందపాటి గడ్డం, పెద్ద బొట్టుతో డీ-గ్లామర్ లుక్ లో కనిపిస్తున్నారు. అయితే చైతూ ఫొటోను ఆయన అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు. ఊరమాస్ లుక్ లో సూపర్బ్ గా ఉన్నారంటూ కామెంట్లు పెడుతున్నారు.

2018లో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల నుంచి కొంత మంది మత్స్యకారులు ఉపాధి కోసం గుజరాత్ వెళ్లారు. అక్కడ ఒక కంపెనీ తరఫున సముద్రంలోకి చేపల వేటకు వెళ్లారు. అయితే వారంతా అనుకోకుండా పాకిస్థాన్ జలాల్లోకి వెళ్లిపోయారు. దీంతో శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలకు చెందిన 22 మంది మత్స్యకారులను పాకిస్థాన్ సెక్యూరిటీ ఏజెన్సీ బంధించి జైలుకు పంపించింది.

అయితే ఈ 22 మందిని విడిపించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పటి సెంట్రల్ ఫారిన్ మినిస్టర్ సుష్మా స్వరాజ్‌ను సంప్రదించింది. ఆమె పాకిస్థాన్ ప్రభుత్వంతో చర్చలు జరిపి 22 మంది మత్స్యకారులను విడిపించారు. అయితే ఈ ఘటన ఆధారంగా రాసుకున్న కథతో ఇప్పుడు చైతూ తండేల్ తెరకెక్కుతోంది. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో నాగచైతన్య సరసన సాయి పల్లవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

Tags:    

Similar News