నాగ్ ఫ్యాన్స్.. ఓకే చెప్పేయమంటున్నారు

కాగా ఇప్పుడేమో నాగ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా పూరి ట్రాక్ రికార్డు చూశాక నాగ్ సినిమా చేస్తాడా అన్నది ప్రశ్నార్థకం.;

Update: 2025-03-12 04:00 GMT

సీనియర్ హీరో నాగార్జున సోలో హీరోగా సినిమా రిలీజై ఏడాది దాటింది. గత ఏడాది సంక్రాంతికి 'నా సామిరంగ'తో పలకరించాక నాగ్.. సోలో సినిమా చేయలేదు. కూలీ, కుబేర లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రలు పోషిస్తున్నారు. తమిళ దర్శకుడు నవీన్‌తో సినిమా అన్నారు కానీ.. అది ఇంకా ఒక కొలిక్కి వచ్చినట్లు లేదు. మోహన్ రాజాతో అనుకున్న సినిమా ఏమైందో కూడా తెలియదు. మరోవైపు నాగ్‌తో ఓ సినిమా చేయడానికి సీనియర్ దర్శకుడు పూరి జగన్నాథ్ ప్రయత్నిస్తున్నాడన్న వార్త ఇటీవల చర్చనీయాంశంగా మారింది.

లైగర్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాలతో షాక్‌ మీద షాక్ తిన్న పూరి.. కొన్ని నెలలుగా కొన్నిస్క్రిప్టుల మీద పనిచేస్తున్నాడు. రెండు కథలు రెడీ అయ్యాక హీరోలను సంప్రదించి నరేషన్ ఇచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్‌కు కూడా ఇటీవల ఒక కథ చెప్పినట్లు సమాచారం. అక్కడ్నుంచి ఏం సమాధానం వచ్చిందో తెలియదు.

కాగా ఇప్పుడేమో నాగ్ పేరు తెరపైకి వచ్చింది. కానీ గత కొన్నేళ్లుగా పూరి ట్రాక్ రికార్డు చూశాక నాగ్ సినిమా చేస్తాడా అన్నది ప్రశ్నార్థకం. ఐతే ఈ న్యూస్ బయటికి వచ్చినప్పటి నుంచి నాగ్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియాలో ఆసక్తికర కామెంట్లు పెడుతున్నారు. శివమణి చిత్రంలో నాగ్‌ను సరికొత్తగా ప్రెజెంట్ చేసిన ఘనత పూరి సొంతం. అప్పట్లో ఆ చిత్రం సెన్సేషన్ క్రియేట్ చేసింది. అందులో నాగ్ క్యారెక్టరైజేషన్.. యాటిట్యూడ్ వేరే లెవెల్లో ఉంటుంది. వీరి కలయికలో తర్వాత 'సూపర్' సినిమా వచ్చింది.

ఆ సినిమా ఫ్లాప్ అయినా సరే.. అందులోనూ నాగ్ క్యారెక్టర్, లుక్స్ చాలా బాగుంటాయి. నాగ్‌ను భలే స్టైలిష్‌గా ప్రెజెంట్ చేశాడు పూరి. ఆ సినిమాల్లో నాగ్ లుక్స్ తాలూకు ఫొటోలు.. సన్నివేశాలకు సంబంధించిన వీడియోలు పోస్ట్ చేస్తూ.. ఏదైతే అయింది ఓకే చేసేయండి నాగ్ సార్ అంటూ అభిమానులు పోస్టులు పెడుతుండడం విశేషం. ఇప్పుడు పూరిది చాలా క్రిటికల్ పొజిషన్. హిట్టు కొట్టి తీరాలి. అందుకోసం కొత్త రైటింగ్ టీంతో ఆయన పనిచేస్తున్నాడు. కాబట్టి ఈసారి కసిగా పని చేస్తాడని.. పూరికి ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడాలని నాగ్‌ను ఫ్యాన్స్ కోరుతుండడం గమనార్హం.

Tags:    

Similar News