నాన్నగారికి కూడా...పద్మభూషణ్ బాలయ్య విన్నపం

మొత్తానికి నందమూరి బాలకృష్ణ పద్మ భూషణుడు అయ్యారు. ఆయనకు ఈ పౌర పురస్కారం దక్కడం పట్ల అంతా సంతోషిస్తున్నారు.

Update: 2025-01-26 16:21 GMT

మొత్తానికి నందమూరి బాలకృష్ణ పద్మ భూషణుడు అయ్యారు. ఆయనకు ఈ పౌర పురస్కారం దక్కడం పట్ల అంతా సంతోషిస్తున్నారు. బాలయ్య ఈ అత్యున్నత పురస్కారానికి అర్హుడు అని కూడా గట్టిగా చెబుతున్నారు. బాలయ్యకు వెల్లువలా శుభాకాంక్షలు వస్తున్నాయి.

ఈ నేపథ్యంలో బాలయ్య కూడా తనకు ఈ విధంగా పౌర పురస్కారంతో సత్కరించినందుకు కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. దీనిని తాను ఒక బిరుదుగా కాకుండా బాధ్యతగా స్వీకరిస్తాను అని ఆయన వినయంగా ప్రకటించారు.

అదే సమయంలో తనకు ఉన్న అశేష అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలియచేశారు. మరో వైపు చూస్తే తనకు దక్కిన ఈ పురస్కారం పట్ల బాలయ్య ఆనందభరితుడు అవుతూనే కేంద్ర ప్రభుత్వానికి మరో విన్నపం చేశారు. తన తండ్రి, తెలుగు జాతి నిలువెత్తు సంతకం అయిన నందమూరి తారక రామారావుకు భారతరత్నను ప్రకటించాలని ఆయన కోరారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని అన్నారు.

ఇదిలా ఉంటే బాలయ్యకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించారు కాబట్టి ఈసారికి అన్న గారికి భారతరత్న ప్రతిపాదన ఉండదని ఒక చర్చ అయితే సాగుతోంది. తొందరలోనే కొందరికి భారతరత్న అవార్డులను ప్రకటిస్తారు అని ప్రచారం సాగుతోంది.

అయితే ఒకే ఏడాది తండ్రీ కొడుకులకు అత్యున్నత పురస్కారాలను ప్రకటించడం అన్నది జరగదు అని అంటున్నారు. అలా చూస్తే బాలయ్యకు ఇచ్చారు కాబట్టి 2025 లో భారతరత్నల ప్రకటనలో ఎన్టీఆర్ పేరు ఉండదేమో అని కలవరం అయితే అభిమానులలో బయల్దేరింది.

అయితే కేంద్ర ప్రభుత్వం తలచుకుంటే ఇవ్వవచ్చు అని అంటున్నారు. ఎన్టీఆర్ కేటగిరీ వేరు. ఆయనకు భారతరత్న ప్రదానం చేయలన్నది పాతికేళ్ళుగా ఉన్న సుదీర్ఘమైన డిమాండ్ అని గుర్తు చేస్తున్నారు. అంతే కాదు ఇటీవల ఏపీకి వచ్చి ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో విందు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా ఇదే విషయం చెప్పారని అంటున్నారు

తెలుగు జాతితో పాటు దేశానికి ఎన్టీఆర్ చేసిన సేవలను ఆయన కేంద్ర హోంమంత్రి దృష్టిలో ఉంచారని అంటున్నారు. అందువల్ల కేంద్రం పరిశీలనలో ఈ విషయం ఉంటుంది అని అంటున్నారు. అయితే గణతంత్ర వేడుకల సందర్భంగానే కాదు ఏడాదిలో ఎపుడైనా కేంద్రం భారతరత్న అవార్డుల మీద ప్రకటన చేయవచ్చు.

అందువల్ల కేంద్ర ప్రభుత్వం తగిన సమయం చూసుకుని ఎన్టీఆర్ కి భారతరత్న అవార్డుని ప్రకటిస్తే తెలుగు జాతి మొత్తం సంతోషిస్తుంది అని అంటున్నారు. బాలయ్య కూడా తనకు లభించిన పౌర పురస్కారాన్ని ఆస్వాదిస్తూనే నాన్న గారికి కూడా ఉన్నత గౌరవం దక్కాలని కోరుకుంటున్న వేళ అత్యున్నత పురస్కార గ్రహీతగా బాలయ్య విన్నపానికి కేంద్రం విలువ ఇస్తుందని అంతా ఆశిస్తున్నారు.

Tags:    

Similar News