నాని.. ఇన్నాళ్ళకు చిక్కిన కంటెంట్ ఉన్న డైరెక్టర్!

ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

Update: 2025-02-12 17:30 GMT

నేచురల్ స్టార్ నాని టాలెంట్ ఉన్న దర్శకులను పట్టుకోవడంలో దిట్ట. అలాగే కంటెంట్ ఉన్న దర్శకులు కూడా నానితో సినిమా చేయాలని చూస్తుంటారు. ఈమధ్య వచ్చిన దసరా, హయ్ నాన్న, సరిపోదా శనివారం లాంటి సినిమాలను డైరెక్ట్ చేసింది కొత్తవారు, చిన్న దర్శకులే కావడం విశేషం. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు బ్లాక్‌బస్టర్ హిట్ సాధించడంతో, నాని మళ్లీ వరుసగా కంటెంట్ బేస్డ్ సినిమాలను చేస్తూ తన స్థాయిని పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతానికి హిట్ 3లో బిజీగా ఉన్న నాని, అదే సమయంలో దసరా డైరెక్టర్ శ్రీకాంత్ ఒదెలతో ది ప్యారడైజ్ అనే సినిమాను కూడా చేస్తున్నాడు.

ఇవి పూర్తయిన తర్వాత తమిళ్ డైరెక్టర్ సీబీ చక్రవర్తితో ఓ సినిమా చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే పలు టాలెంటెడ్ డైరెక్టర్లతో పనిచేసిన నాని, ఎప్పటి నుంచో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా చేయాలని చూస్తున్నాడని టాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. గతంలోనూ ఈ కాంబోపై చర్చలు జరిగాయి కానీ, సరైన కథ సెట్టవ్వకపోవడంతో ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ గురించి వార్తలు వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.

కమ్ముల మేకింగ్ స్టైల్, నాని నేచురల్ యాక్టింగ్ కుదిరితే.. మరో అద్భుతమైన సినిమాకు తెరలేవచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటివరకు నాని ఎన్నో కమర్షియల్ ఎంటర్‌టైనర్స్ చేసినా, బలమైన కంటెంట్ ఉన్న దర్శకులతో పని చేయడానికి ఆసక్తి చూపిస్తూ వచ్చాడు. జెర్సీ, శ్యామ్ సింగ రాయ్, దసరా వంటి సినిమాలు బలమైన కథ, ఎమోషన్స్‌తో పాటు మంచి మేకింగ్ కూడా కలిగి ఉన్నాయి.

ఇదే రూట్లో నాని, శేఖర్ కమ్ముల కాంబో వస్తే, ప్రేక్షకులకు ఓ న్యాచురల్ మాస్టర్‌పీస్ ఇచ్చే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల తన పాన్ ఇండియా ప్రాజెక్ట్ కుబేరతో బిజీగా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయిన తర్వాత నాని సినిమా పట్టాలెక్కే అవకాశముంది. గతంలో కమ్ముల, నాగ చైతన్యతో లవ్ స్టోరీ చేశారు. అది అంతగా క్లిక్కవ్వలేదు. ఇక ఇప్పుడు ధనుష్ తో కుబేర చేస్తున్నారు. నాగార్జున ఈ సినిమాలో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నాడు.

కుబేర పాన్ ఇండియా సినిమా కాబట్టి కమ్ముల ఆ తరువాత సినిమా కూడా అదే రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఇక నాని హిట్ 3, ప్యారడైజ్ సినిమాలు కూడా పాన్ ఇండియా టార్గెట్ తో వస్తున్నవే. ఇక నానితో కమ్ముల ప్రాజెక్ట్ సెట్టయితే అది కూడా పాన్ ఇండియా ప్రాజెక్టు అవ్వడం పక్కా. మరి ఈ నేచురల్ కాంబినేషన్లో ఎలాంటి సినిమా వస్తుందో చూడాలి.

Tags:    

Similar News