పద్మవిభూషణులు ఒకరినొకరు చిరస్మరణీయంగా
ఆ ఇద్దరిపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు, మెగాస్టార్ చిరంజీవి గర్వించదగిన పద్మవిభూషణ్ పురస్కారాలకు ఎంపికవ్వడం తెలుగువారికి గొప్ప గౌరవం. దీనిని ప్రపంచవ్యాప్తంగా అభిమానులు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఆ ఇద్దరిపైనా ప్రశంసలు కురుస్తున్నాయి.. అభినందనలు వెల్లువెత్తుతున్నాయి. సెలబ్రిటీలు ఇప్పటికే విషెస్ తెలియజేసారు.
ఇదిలా ఉండగా ఇప్పుడు ఎం.వెంకయ్య నాయుడు- చిరంజీవి ఒకరినొకరు అభినందించుకోవడమే గాక సన్మానించుకున్న దృశ్యం ఎంతో కన్నులపండుగగా కనిపించింది. ఆ ఇరువురి ఫెలికేషన్ కి సంబంధించిన ఫోటోలు అంతర్జాలంలో వైరల్ గా మారాయి. వెంకయ్య నాయుడును చిరు శాలువా కప్పి సన్మానించగా, ప్రత్యేకమైన డిజైనర్ వెండి అంచు శాలువాతో వెంకయ్య నాయుడు చిరును సన్మానించారు. ఈ దృశ్యం చాలా అరుదైనది.. ప్రత్యేకమైనది. మెగాభిమానులు ఈ ఫోటోలను అంతర్జాలంలో వైరల్ చేస్తున్నారు.
చిరంజీవి స్వయంగా ఈ ఫోటోలను షేర్ చేసి కొన్ని సంతోషకరమైన విషయాలను పంచుకున్నారు. ఇవి చాలా ప్రత్యేకమైన క్షణాలు అని అన్నారు. వెంకయ్య నాయుడు గారు.. ప్రతిష్టాత్మకమైన గౌరవానికి తోటి గ్రహీతగా ఉండడం వల్ల పరస్పర అభినందన సభ మరింత ఆనందంగా చిరస్మరణీయంగా ఉంటుంది! #పద్మవిభూషణ్.. అని దీనికి శీర్షికను ఇచ్చారు.
వీళ్లతో పాటు ఇంకా ఎవరెవరు?
చిరు- వెంకయ్యలతో పాటు, సామాజిక కార్యకర్త సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్, వెటరన్ నటి వైజయంతిమాల బాలి, భరతనాట్యం ప్రఖ్యాత పద్మా సుబ్రహ్మణ్యం ఈ సంవత్సరం పద్మవిభూషణ్ గ్రహీతలు. నటుడు మిథున్ చక్రవర్తి మరియు దివంగత విజయకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ప్యారేలాల్ శర్మ (లక్ష్మీకాంత్-ప్యారేలాల్ ఫేమ్) సహా 17 మంది పద్మభూషణ్ అవార్డులు అందుకున్నారు.
సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తి, మాజీ గవర్నర్ ఎం ఫాతిమా బీవీ, గాయని ఉషా ఉతుప్ కూడా పద్మభూషణ్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ప్రపంచ నంబర్ 1 డబుల్స్ టెన్నిస్ ప్లేయర్ రోహన్ బోపన్న, ఆర్ట్ కలెక్టర్ కిరణ్ నాడార్, మాజీ బ్యాంకర్ కల్పనా మోర్పారియా పద్మశ్రీ అవార్డు పొందిన వారిలో ఉన్నారు.