పవన్ నిర్మాతల్లో 'రిలీజ్' గొడవ?
ఐతే పవన్ ఎప్పుడు ఏ సినిమా పూర్తి చేస్తాడనే విషయంలో స్పష్టత లేకున్నా.. ఈ రెండు చిత్రాలూ విడుదల కోసం ముహూర్తాలు చూసేసుకున్నాయి.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గత ఏడాది మూడు సినిమాలను పెండింగ్‌లో పెట్టి రాజకీయాల్లో బిజీ అయిపోయాడు. దాదాపు ఏడాది నుంచి ఆయన సినిమాల చిత్రీకరణలు జరగట్లేదు. ఎన్నికల ఫలితాలు వచ్చాక పవన్ ఏకంగా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అయిపోవడంతో బాధ్యతలు పెరిగిపోయాయి. వెంటనే సినిమాల గురించి ఆలోచించే పరిస్థితి లేకపోయింది. ప్రభుత్వం ఏర్పాటై వంద రోజులు గడిచింది. ఇంకా పవన్ తీరిక చేసుకోలేకపోతున్నాడు. ఆయన ఎప్పుడు అందుబాటులోకి వస్తాడు.. పెండింగ్‌లో ఉన్న సినిమాల్లో దేన్ని ముందు పట్టాలెక్కిస్తాడు అనే విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది.
మూడు మూవీస్‌లో 'ఉస్తాద్ భగత్ సింగ్'కు అయితే వెంటనే మోక్షం లభించే సంకేతాలు కనిపించడం లేదు. హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాల మేకర్స్ మాత్రం షూటింగ్‌కు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. రెండు బృందాల్లోనూ యాక్టివిటీ మొదలైంది.
ఐతే పవన్ ఎప్పుడు ఏ సినిమా పూర్తి చేస్తాడనే విషయంలో స్పష్టత లేకున్నా.. ఈ రెండు చిత్రాలూ విడుదల కోసం ముహూర్తాలు చూసేసుకున్నాయి. ముందు తమ సినిమానే పూర్తవుతుంది, విడుదలవుతుంది అనే ధీమాతో 'ఓజీ' టీం మార్చి నెలాఖరులో విడుదలకు డేట్ చూసుకుంది. ఈ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్ చేసే క్రమంలో రిలీజ్ డేట్ ప్రకటిద్దాం అనుకున్నారు. కానీ ఈలోపే 'హరి హర వీరమల్లు' టీం లైన్లోకి వచ్చేసింది. మార్చి 28న తమ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు ప్రకటించేసింది. ఇది 'ఓజీ' టీంకు మింగుడుపడలేదని తెలుస్తోంది.
'హరిహర వీరమల్లు'తో పోలిస్తే 'ఓజీ'లో మిగిలిన సీన్లే తక్కువ. పవన్ అందుబాటులోకి వస్తే తక్కువ రోజుల్లో ఆ షూట్ పూర్తి చేసేస్తారు. తమ సినిమాకే హైప్ ఎక్కువ ఉన్న నేపథ్యంలో దాన్ని రిలీజ్ చేస్తే 'హరిహర వీరమల్లు'కు ప్రయోజనం అని భావిస్తున్నారు ఓజీ మేకర్స్.
కానీ ఇప్పటికే తమ సినిమా చాలా ఆలస్యం అయిందని.. ముందు 'ఓజీ' వస్తే తమ సినిమాను కనీసం మూణ్నాలుగు నెలలు వెనక్కి తీసుకెళ్లాల్సి ఉంటుందని.. దీంతో మరింత నష్టం తప్పదని.. పవన్ తమ సినిమానే ముందు పూర్తి చేస్తానని హామీ ఇచ్చిన నేపథ్యంలో తమ చిత్రమే ముందు థియేటర్లలోకి దిగాలని 'వీరమల్లు' టీం పట్టుబట్టినట్లు తెలుస్తోంది. దీని మీద గొడవ పడడం లాంటిదేమీ జరగలేదు కానీ.. రెండు వర్గాల మధ్య కొంత ఇబ్బందికర వాతావరణం నెలకొన్నట్లు సమాచారం.