‘పుష్ప’పై పవన్ యాంగిల్ అదిరిపోయిందిగా!

అందరి అంచనాలకు భిన్నంగా ఈ అంశంపై మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా స్పందించటం.. తన అభిప్రాయన్ని కుండబద్ధలు కొట్టేశారు.

Update: 2024-12-31 05:00 GMT

లేటుగా వచ్చినా లేటెస్టుగా వచ్చినట్లు అన్న మాటకు తగ్గట్లే వ్యవహరించారు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. పుష్ప 2 ప్రీమియర్ షో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు.. అల్లు అర్జున్ పై వెల్లువెత్తిన విమర్శలతో పాటు.. ఆయన్ను అరెస్టు చేయటం లాంటి ఘటనలు చోటు చేసుకున్నప్పడు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఎలా రియాక్టు అవుతారా? అన్న దానిపై ఆసక్తి నెలకొంది. అందరి అంచనాలకు భిన్నంగా ఈ అంశంపై మౌనంగా ఉన్న ఆయన.. తాజాగా స్పందించటం.. తన అభిప్రాయన్ని కుండబద్ధలు కొట్టేశారు.

ఆసక్తికరమైన అంశం ఏమంటే.. పుష్ప ఎపిసోడ్ పై ఇప్పటికే పలువురు ప్రముఖులు స్పందించినప్పటికి.. ఎవరూ లేవనెత్తని పాయింట్ ను తెర మీదకు తీసుకురావటమే కాదు.. అల్లు అర్జున్ కు బాసటగా నిలిచారని చెప్పాలి. మొత్తంగా ఈ ఎపిసోడ్ లో అల్లు అర్జున్ బాధ్యత కంటే కూడా.. సినిమా అన్నది సమిష్ఠిక్షి అన్నప్పుడు కష్టమొచ్చినప్పుడు ఆ టీం మొత్తం నిలవాలే తప్పించి.. హీరో మీదనే మొత్తం వేయాలా? అన్న ప్రశ్నను సంధించారు.

సాపేక్షంగా చూస్తే.. పవన్ వాదనలో నిజం ఉందనే చెప్పాలి. అయితే.. ఇక్కడ కూడా ఒక అంశాన్ని ప్రస్తావించాలి. పుష్ప ఎపిసోడ్ లో మొత్తం తప్పును అల్లు అర్జున్ మీద వేయటాన్ని తప్పు పట్టిన పవన్.. ఆ సినిమా కారణంగా గరిష్ఠ ఆర్థిక ప్రయోజనాన్ని పొందించి బన్నీనే కదా? కార్పొరేట్ ప్రపంచంలోనే.. పెద్ద తలకాయకే అత్యధిక ప్రయోజనం ఉంటుంది. రిస్కు కూడా ఉంటుంది. అలా చూసినప్పుడు పుష్ప మూవీని మొత్తం తన భుజాల మీద మోసి.. రూ.350 కోట్ల రెమ్యునరేషన్ తీసుకున్నప్పుడు.. తప్పు జరిగినప్పుడు.. అది కూడా తాను ప్రీమియర్ షోకు వెళ్లిన సందర్భంలో చోటు చేసుకున్న తొక్కిసలాటకు యూనిట్ ఏం చేస్తుంది? అన్నది ప్రశ్న.

సినిమా గురించి.. సినిమా ప్రపంచానికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి? అవెలా పని చేస్తాయన్న అంశాలు పవన్ కు చెప్పాల్సిన అవసరం లేదు. ఏళ్లకు ఏళ్లుగా అందులో ఉన్న వ్యక్తికి కొన్ని అంశాల్ని గుర్తు చేయాల్సిన అవసరం లేదనే చెప్పాలి. టీం గురించి మాట్లాడిన పవన్.. పుష్ప1 సక్సెస్ మొత్తం బన్నీ ఖాతాలో పడింది, పాన్ ఇండియా ఇమేజ్ వచ్చేసింది. అంతే తప్పించి.. టీం మొత్తానికి రాలేదుగా? లాభం వచ్చినప్పుడు హీరోకు.. తేడా వచ్చినప్పుడు.. డ్యామేజ్ జరిగినప్పుడు మాత్రం టీం మాటను తీసుకురావటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తవుతోంది.

ఇలా చెప్పుకుంటూ పోతే.. పవన్ వివరణ విన్నంతనే బాగున్నట్లుగా అనిపించినా.. దాని లోతుల్లోకి వెళ్లినప్పుడు మాత్రం అల్లు అర్జున్ ను వెనకేసుకొచ్చినట్లుగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలా అని పూర్తిగా కాకున్నా..నెగిటివిటీ తీవ్రత కొంతమేర తగ్గించేలా పవన్ వ్యాఖ్యలు ఉన్నాయని చెప్పాలి. పుష్ప టీం తప్పుల్ని ఎత్తి చూపిన పవన్.. అదే సమయంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన విషయంలో మాత్రం వంక పెట్టలేని విధంగా వ్యవహరించారనే చెప్పాలి. మొత్తంగా పుష్ప ఎపిసోడ్ పై పవన్ కల్యాణ్ స్పందించలేదన్న లోటును మాత్రం తీర్చేశారని చెప్పక తప్పదు.

Tags:    

Similar News