పవన్ గెలుపు పొగరు.. ఇది అసలైన మాట!
హీరో పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా నిలిచారు.
హీరో పవన్ కళ్యాణ్.. సినిమాల్లోనే కాదు రాజకీయాల్లో కూడా పవర్ స్టార్ గా నిలిచారు. ఎందరికో ఇన్స్పిరేషన్ గా మారారు. కొన్ని నెలల క్రితం వరుస ఫ్లాపులు ఎదుర్కొన్నా.. ముందు కన్నా ఎక్కువ ఉత్సాహంతో నటించి మరిన్ని హిట్లు కొట్టారు. కించిత్తు కూడా ఫ్యాన్ బేస్ మిస్ చేసుకోలేదు. ఇక రాజకీయాల్లోకి వచ్చి పదేళ్లు అయినా.. ఎప్పుడూ నిరాశ వ్యక్తం చేయలేదు. గతసారి రెండు చోట్లా ఓడిపోయినా.. పట్టు వదలని విక్రమార్కుడిగా పోరాడారు పవన్.
2014లో జనసేన పార్టీని మొదలు పెట్టిన పవన్ కళ్యాణ్.. 2024లో తొలి విజయాన్ని అందుకున్నారు. ఎన్నో ఒడుదొడుకులు ఎదుర్కొంటూ అనుకున్నది సాధించి తీరారు. పిఠాపురం నుంచి భారీ విజయం సాధించారు. 69 వేలకు పైగా మెజార్టీతో వైసీపీ అభ్యర్థి వంగా గీతపై గెలుపొందారు. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి తన గళాన్ని వినిపించనున్నారు. అసెంబ్లీ గేటు వద్దకు కూడా రాలేడన్న వారికి.. తన మాటలతో సమాధానమివ్వనున్నారు.
అత్తారింటికి దారేది సినిమాలోని 'ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసినోడే గొప్ప' డైలాగ్ ను పవన్ నిరూపించి చూపించారు. ఇప్పుడు టీడీపీతో కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు పవన్. అందులో తొలి అడుగుగా నిన్న సాయంత్రం చంద్రబాబుతో తన పార్టీ ఆఫీస్ లో భేటీ అయ్యారు. ఆ సమయంలో పవన్ తన కుమారుడు అకీరా నందన్ ను సీబీఎన్ కు పరిచయం చేశారు. అకీరా కూడా ఆశీర్వాదం తీసుకున్నారు.
అంతకుముందు పిఠాపురం ప్రజలకు ఎలాంటి మెసేజ్ ఇస్తారని పవన్ ను ఓ మీడియా ప్రతినిధి అడిగారు. ప్రచార సమయంలో పవన్ ప్రత్యర్థి విషయంలో హామీలను సదరు ప్రతినిధి గుర్తు చేశారు. దానికి పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో స్పందించారు. అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు ఏం చేయాలో అది చేసుకుపోవడమేనని తెలిపారు. ఒక్క మాటతో తనకు ఎలాంటి రివెంజ్ తీర్చుకోవాల్సిన అవసరం లేదని పరోక్షంగా చెప్పారు.
"పొలిటికల్ ప్రాసెస్ లో అన్నీ కామన్. తప్పనుకోవడం లేదు. మాటా మాటా అనుకుంటాం. కొందరు తిడతారు. అవన్నీ విని అక్కడితో వదిలేయాలి. దాన్ని ముందుకు తీసుకెళ్లాలని లేదు. ఎవరు ఎక్కువ మాట్లాడారో అది వాళ్లకు సంబంధించిన విషయం. మనం అవన్నీ పట్టించుకోకుండా ప్రజలకు ఏం చేయాలో అది చేసుకుపోవడమే" అని చెప్పి మరోసారి అందరి మనసులు గెలుచుకున్నారు పవన్. ప్రస్తుతం ఈ వీడియో తెగ చక్కర్లు కొడుతోంది.
దీంతో పవన్ ఫ్యాన్స్ ఓ రేంజ్ లో స్పందిస్తున్నారు. ప్రజలకు మంచి చేయాలనే పొగరు తప్ప ఆయనకు కౌంటర్లు ఇవ్వాలనే పొగరు ఏ మాత్రం కూడా కనిపించడం లేదని కామెంట్లు పెడుతున్నారు. 'యుద్ధంలో గెలవడం అంటే.. శత్రువులను చంపడం కాదు.. శత్రువులను ఓడించడం' అంటా జల్సా డైలాగ్ ను షేర్ చేస్తున్నారు. మొత్తానికి పవన్ రాజకీయ పరంగా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారనేది ఇప్పుడంతా ఆసక్తిగా మారింది.