పవన్ పాలిటిక్స్.. ది గేమ్ ఛేంజర్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ సోదరుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే యూత్ లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మెగాస్టార్ సోదరుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాలోనే యూత్ లో తనదైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్నారు. ఆ తర్వాత వచ్చిన తమ్ముడు, తొలిప్రేమ, సుస్వాగతం సినిమాలు పవన్ కళ్యాణ్ ని ఏకంగా స్టార్ గా నిలబెట్టాయి. ఖుషి మూవీతో పవన్ కళ్యాణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. నెక్స్ట్ సుదీర్ఘ కాలం పాటు సరైన సక్సెస్ లో పవన్ కళ్యాణ్ కు రాలేదు. అయినా కూడా ఆయన ఫ్యాన్ బేస్, మాస్ ఫాలోయింగ్ లో ఎలాంటి మార్పు రాలేదు.
పవన్ కళ్యాణ్ ని అభిమానించే వారందరూ కూడా చాలావరకు యాక్టర్ గా కంటే ఒక వ్యక్తిగా అతన్ని ఇష్టపడతారు. అందుకే సామాన్య జనాల్లో మాత్రమే కాకుండా సెలబ్రిటీలలో కూడా ఆయనకు అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో టాప్ స్టార్ లలో ఒకడిగా నిలిచిన పవన్ కళ్యాణ్ 2014 ఎన్నికలకు ముందు జనసేన పార్టీతో రాజకీయ ప్రయాణం మొదలుపెట్టారు. అంతకుముందు మెగాస్టార్ పెట్టిన ప్రజారాజ్యం పార్టీలో యువరాజ్యం అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ కొనసాగారు.
అయితే ప్రజారాజ్యం కాంగ్రెస్ లో విలీనం తర్వాత పవన్ కళ్యాణ్ బయటకు వచ్చారు. 2014 ఎన్నికలలోనే పోటీ చేయకుండా తెలుగుదేశం, బీజేపీ పార్టీలకు సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ఆ ఎన్నికలలో పవన్ కళ్యాణ్ ప్రభావం కారణంగా వైసీపీ ఓడిపోయింది. 2019 ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేశారు. టీడీపీకి ఆ దెబ్బ గట్టిగానే తగిలింది. పవన్ కళ్యాణ్ కూడా దారుణంగా ఓడిపోయారు. పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోవడంతో ఆయన అనేక హేళనలో, అవమానాలు ఎదుర్కొన్నారు.
అయిన కూడా ప్రజల్లో బలంగా నిలబడ్డారు. ప్రజా సమస్యలపై పోరాటం చేశారు. ఈ క్రమంలో వ్యక్తిగత దూషణలు కూడా ఎదుర్కొన్నారు. వైసీపీని ఓడించడమే లక్ష్యంగా కూటమి కట్టడంలో పవన్ కళ్యాణ్ కీలక భూమిక పోషించారు. జనసేన పోటీ చేసే స్థానాలను తగ్గించుకున్నారు. సొంత పార్టీ కార్యకర్తల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. అండగా నిలబడిన నాయకులు వదిలేసారు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం తన నిర్ణయాలకు, వ్యూహాలకు కట్టుబడి ఎన్నికలలో వైసీపీని ఓడించడమే లక్ష్యంగా విస్తృత ప్రచారం చేశారు.
తన ప్రచారస్త్రాలతో చాలాసార్లు వైసీపీని పవన్ కళ్యాణ్ ఇరుపైన పెట్టారు. ఈరోజు ఎన్నికల ఫలితాలలో పవన్ కళ్యాణ్ ఇంపాక్ట్ రాష్ట్ర రాజకీయాలలో ఏ స్థాయిలో ఉందో అందరికి స్పష్టంగా కనిపించింది. జనసేన పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలుపొందడమే కాకుండా, చెప్పినట్టుగానే వైసీపీకి దారుణ పరాభావాన్ని ఇచ్చారు. ఫలితాలు పూర్తిగా కూటమికి అనుకూలంగా వచ్చాయి. ఎవరైతే పవన్ కళ్యాణ్ ని ఆవేశపరుడని విమర్శలు చేశారో, పవన్ కళ్యాణ్ ప్రసంగాలను కూడా తప్పుపట్టారో వారే ఈరోజు పవన్ కళ్యాణ్ వ్యూహాలపై ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఆయన తీసుకున్న నిర్ణయాలు, అమలు చేసిన విధానం, రాజకీయ పరిణితి గురించి గొప్పగా మాట్లాడుతున్నారు. రాష్ట్ర రాజకీయాలలో పవన్ కళ్యాణ్ మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, గేమ్ చేంజర్ అంటూ కొనియాడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్వయంగా జనసేన పార్టీ కార్యాలయానికి వెళ్లి పవన్ కళ్యాణ్ ని కలవడం విశేషం. దీనిని బట్టి పవన్ కళ్యాణ్ రాష్ట్ర రాజకీయాలలో ఏ స్థాయిలో చక్రం తిప్పాడనేది అర్థం చేసుకోవచ్చు. ఈ పదేళ్ల రాజకీయ ప్రయాణంలో పవన్ కళ్యాణ్ తన ఆలోచనలతో, వ్యూహాలతో రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యానికి గురి చేశారు… ఏపీ రాజకీయాలలో ఇప్పుడు అందరూ చర్చించుకుంటుంది పవన్ కళ్యాణ్ వ్యూహాత్మక నిర్ణయాలు మీదే కావడం విశేషం.