చిన్న హీరోలకే కాదు స్టార్ హీరో సినిమాకీ అదే సమస్య
ఈ మధ్య కాలంలో సినిమాల మేకింగ్ కంటే కూడా అధికంగా ప్రమోషన్ కి మరియు మంచి డేట్ న విడుదల చేయడానికి కష్టపడుతున్నారు
ఈ మధ్య కాలంలో సినిమాల మేకింగ్ కంటే కూడా అధికంగా ప్రమోషన్ కి మరియు మంచి డేట్ న విడుదల చేయడానికి కష్టపడుతున్నారు. భారీ గా ఖర్చు చేసి ప్రమోషన్ చేసినా మంచి డేట్ కి విడుదల చేయకుంటే మొత్తం ఫలితం తల కిందులు అవుతుంది. ఈ విషయం ఇప్పటికే పలు సినిమాల విషయంలో నిరూపితం అయ్యింది.
మంచి కంటెంట్ మూవీ, కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న సినిమా అయినా కూడా బ్యాడ్ టైమ్ లో రావడం వల్ల తక్కువ వసూళ్లకు పరిమితం అయిన సినిమాలు చాలా ఉన్నాయి. చిన్న సినిమాలకు మాత్రమే కాకుండా పెద్ద హీరోల సినిమాలకు కూడా ఈ సమస్య వర్తిస్తుంది.
భారీ బడ్జెట్ తో రూపొందిన సినిమాలను సరైన తేదీలో విడుదల చేయకుంటే నిర్మాత కుదేళు అవ్వడం ఖాయం. అందుకే ప్రతి సినిమాకు ఇప్పుడు విడుదల తేదీ అనేది పెద్ద సమస్యగా మారింది. చాలా వరకు సినిమాలు నాలుగు అయిదు నెలల ముందుగానే విడుదల తేదీలను బుక్ చేసుకుంటున్నాయి.
కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర నటించిన తాజా చిత్రం 'యూఐ' మేకింగ్ పూర్తి అయ్యి చాలా కాలం అయ్యింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తి అయ్యింది. కానీ విడుదల తేదీ విషయంలో మాత్రం ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఇప్పటికే విడుదల అయిన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది.
ఉపేంద్ర మళ్లీ ఏదో అద్భుతం ను చూపించబోతున్నాడు అన్నట్లుగా సినీ ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాకు రూ.100 కోట్లకు పైగా ఖర్చు చేశారట. సినిమాకు హిట్ టాక్ రావడంతో పాటు రెండు వారాల పాటు పోటీ లేకుంటేనే ఆ వంద కోట్ల వసూళ్లు సాధించగలదు అనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
అందుకే యూఐ ని ఎప్పుడు విడుదల చేయాలో అర్థం కాక మేకర్స్ జుట్టు పీక్కుంటున్న ట్లు సమాచారం అందుతోంది. జులై నుంచి మొదలుకుని డిసెంబర్ వరకు కన్నడంతో పాటు ఇతర భాషల్లో పెద్ద సినిమాలు బ్యాక్ టు బ్యాక్ వారం వారం రాబోతున్నాయి. దాంతో యూఐ ని విడుదల చేయడానికి రెండు వారాల గ్యాప్ దక్కేలా లేదు.
ఉపేంద్ర కి ఉన్న బ్రాండ్ ఇమేజ్ తో మొదటి వారంలోనే వంద కోట్ల వసూళ్లను సాధించడం సాధ్యం కాదు. అందుకే హిట్ టాక్ వచ్చినా కూడా వంద కోట్లు, అంతకు మించి వసూళ్లు సాధించాలి అంటే కచ్చితంగా రెండు లేదా మూడు వారాలు పోటీ లేకుండా ఈ సినిమా ఆడాలి. మరి ఈ సమస్య కి మేకర్స్ ఎలాంటి పరిస్కారం వెతుకుతారు అనేది చూడాలి.