రాజేంద్రప్రసాద్-కృష్ణారెడ్డి మధ్య వివాదం ఇదేనా?
డేట్లు కూడా దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఆమె కాల్షీట్లు సంపాదించి..షూటింగ్ కి వెళ్దామని రాజేంద్ర ప్రసాద్ కి కృష్ణారెడ్డి చెప్పారుట.
రాజేంద్రప్రసాద్-కృష్ణారెడ్డి సక్సస్ ఫుల్ కాంబినేషన్ గురించి చెప్పాల్సిన పనిలేదు. ఆ రోజుల్లో' 'కొబ్బరి బోండాం'.. 'రాజేంద్రుడు-గజేంద్రుడు'.. 'మాయలోడు' లాంటి హిట్ చిత్రాలతో ఇండస్ట్రీని ఊపే సిన కాంబినేషన్ అది. అప్పట్లో ఆ ఇద్దరి మధ్య కుదిరినట్లుగా మరో కాంబినేషన్ సెట్ అవ్వలేదంటే అతిశ యోక్తి కాదు. అలాంటి సక్సెస్ ఫుల్ కాంబినేషన్ మధ్య కలతలు చోటు చేసుకున్నాయని అప్పట్లో ప్రచారంలోకి వచ్చింది. ఆ సినిమాల తర్వాత మళ్లీ ఆ కాంబినేషన్ లో ఇప్పటివరకూ సినిమా రాలేదు.
దీంతో అసలు ఇద్దరి మధ్య ఏం జరిగింది? అన్నది ఎవరికీ అర్దం కాలేదు. ఎందుకు సడెన్ గా సినిమాలు చేయడం మానేసారని అంతా అనుకోవడం తప్ప! ఏం జరిగిందన్నది ఎవరికీ తెలియదు. ఎందుకంటే ఇద్దరు కూడా ఈ విషయంలో మౌనంగానే ఉన్నారు. ఒకరిపై ఒకరు ఎలాంటి ఆరోపణలు చేసుకోలేదు. తాజాగా ఈ క్లాష్ గురించి ఓ అప్ డేట్ వైరల్ అవుతోంది. సౌందర్య అప్పట్లో బిజీ హీరోయిన్. డేట్లు కూడా దొరకని పరిస్థితి. అలాంటి సమయంలో ఆమె కాల్షీట్లు సంపాదించి..షూటింగ్ కి వెళ్దామని రాజేంద్ర ప్రసాద్ కి కృష్ణారెడ్డి చెప్పారుట.
అందుకు రాజేంద్ర ప్రసాద్ ఆమె ఇచ్చిన డేట్లకు తన డేట్లు సర్దుబాటు చేయాలా? అని అన్నాడుట. అయితే అప్పటికే 'మాయలోడు' షూటింగ్ విషయంలో సరిగ్గా హాజరవ్వకుండా రాజేంద్ర ప్రసాద్ కృష్ణా రెడ్డిని ఇబ్బంది పెడుతున్నాడుట. దీంతో విసుగు చెందిన కృష్ణారెడ్డి ..రాజేంద్ర ప్రసాద్ తో చేయించాల్సిన 'చినుకు చినుకు' పాటని బాబు మోహన్ తో చేయిస్తే ఎలా ఉంటుంది? అన్న ఆలోచన మొదలైందిట. దీంతో బాబు మోహన్ ని సీన్ లోకి తెచ్చి ఆ పాటని వెంటనే అన్నపూర్ణ స్టూడియోలో పూర్తి చేసారుట.
అదే సమయంలో మూడు రోజుల్లో పూర్త చేయాల్సిన డబ్బింగ్ ని రాజేంద్ర ప్రసాద్ తో నాలుగు గంటల్లోనూ పూర్తి చేసి పంపించేసారుట. ఆ తర్వాత చినుకు చినుకు పాటని బాబు మోహన్ తో చేయిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకున్న రాజేంద్రప్రసాద్ ఎస్వీ కృష్ణారెడ్డి దగ్గరకు మేనేజర్‌ని రాయబారానికి పంపినా.. చివరికి రాజేంద్రప్రసాద్ నేరుగా దిగొచ్చినా కృష్ణారెడ్డి బాబు మోహన్ తోనే చేయిస్తానని తెగేసి చెప్పే సాడుట. అలా రాజేంద్ర ప్రసాద్ చేయాల్సిన 'చినుకు చినుకు' పాట బాబు మోహన్ చేతికి వెళ్లింది. ఆ పాట ఎంత సంచలమైందో తెలిసిందే.