ప్రశాంత్ నీల్ vs రాజమౌళి: ఫ్యూచర్ బాక్సాఫీస్ కింగ్ ఎవరంటే..?
అయితే, వీరి సినిమా మేకింగ్ స్టైల్, మార్కెట్‌లో వీరి బిజినెస్ స్ట్రాటజీ చూస్తే ఎవరు టాప్ పొజిషన్‌లో ఉంటారు? అంటే ఆసక్తికరమైన విశ్లేషణ అవసరం.;
ఇండియన్ సినిమా డైరెక్టర్లలో ప్రస్తుతం అత్యంత డిమాండ్‌లో ఉన్న ఇద్దరు దర్శకులు ఎవరంటే, ఎటువంటి సందేహం లేకుండా రాజమౌళి, ప్రశాంత్ నీల్ పేర్లు ముందుగా వస్తాయి. వీరిద్దరి సినిమాలు బాక్సాఫీస్‌ను తుడిపేసే స్థాయిలో ఉంటాయి. అయితే, వీరి సినిమా మేకింగ్ స్టైల్, మార్కెట్‌లో వీరి బిజినెస్ స్ట్రాటజీ చూస్తే ఎవరు టాప్ పొజిషన్‌లో ఉంటారు? అంటే ఆసక్తికరమైన విశ్లేషణ అవసరం.
రాజమౌళి: బిగ్ స్కేల్, బిగ్ బిజినెస్
రాజమౌళి ప్రతి సినిమాను అద్భుతమైన స్కేల్‌లో ప్లాన్ చేస్తారు. ఆయన మేకింగ్ స్టైల్ హాలీవుడ్ స్థాయిలో ఉంటుందని ‘RRR’ రిజల్ట్ ద్వారా నిరూపితమైంది. ఇప్పుడు మహేష్ బాబుతో చేస్తున్న సినిమా సొంత మార్కెట్‌ను మించి, ఇంటర్నేషనల్ బిజినెస్‌కు మార్గం సుగమం చేస్తోంది. ఈ సినిమాకు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో రూపకల్పన జరుగుతున్నప్పటికీ, దీని బిజినెస్ 2000 కోట్లకు పైగా ఉండే అవకాశం ఉంది. అంతేకాదు, హాలీవుడ్ మార్కెట్‌ని దృష్టిలో పెట్టుకుని ప్లాన్ చేయడం వల్ల 3000 కోట్ల వరకు రెవెన్యూ అందుకునే ఛాన్స్ కూడా ఉంది.
అయితే, రాజమౌళి సినిమాల ప్రాబ్లమ్ ఏమిటంటే, ఓ సినిమా తెరకెక్కించడానికి ఆయన కనీసం రెండేళ్లు తీసుకుంటారు. మహేష్ సినిమా పూర్తయిన తర్వాత మరొక సినిమాకు ఇంకో రెండేళ్లు పడితే, రాజమౌళి నుంచి వచ్చే మరో మూవీ కోసం ప్రేక్షకులు 2028 వరకు వెయిట్ చేయాల్సి వస్తుంది. అంటే, నాలుగు సంవత్సరాల్లో కేవలం ఒకే సినిమా బాక్సాఫీస్‌పై కనిపించనుంది.
ప్రశాంత్ నీల్: స్పీడ్ & స్ట్రాంగ్ బిజినెస్
ప్రశాంత్ నీల్‌కు రాజమౌళిలా భారీ బడ్జెట్ పెట్టి, నాలుగేళ్లు తీయడం అన్నది అలవాటు కాదు. ఆయన సినిమాలు బడ్జెట్ పరంగా 300-400 కోట్ల రేంజ్‌లోనే ఉంటాయి. కానీ, కలెక్షన్స్ మాత్రం 1000 నుంచి 1500 కోట్లకు వెళ్లేలా ఉండటం విశేషం. ‘కేజీఎఫ్ 2’ అలా చేసింది. ‘సలార్ 2’ కూడా అదే రేంజ్ హిట్ కావచ్చు. ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేస్తున్న ‘డ్రాగన్’ అదే స్కేల్‌లో ఉండే అవకాశం ఉంది.
ఇక్కడ అసలు విషయం ఏమిటంటే, రాజమౌళి ఒక సినిమాతో 3000 కోట్ల బిజినెస్ తీసుకొస్తే, అదే సమయానికి ప్రశాంత్ నీల్ మూడు లేదా నాలుగు సినిమాలు విడుదల చేసే ఛాన్స్ ఉంది. అంటే, ఒక్కో సినిమాతో 1000 కోట్ల మినిమమ్ బిజినెస్ చేసి, మొత్తంగా 3000-4000 కోట్ల వరకూ బాక్సాఫీస్ బిజినెస్ చేయగలరు. ఇవన్నీ ప్యాన్-ఇండియా ప్రాజెక్ట్స్ కావడంతో, ఆయా మార్కెట్లలో సాలిడ్ బేస్ ఉంటుందనడంలో సందేహం లేదు.
కాంబినేషన్లు - లైన్-అప్ వ్యత్యాసం
రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో సినిమా చేస్తున్నప్పుడు, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్‌తో ‘డ్రాగన్’ పూర్తి చేస్తారు. ఆ తర్వాత ‘సలార్ 2’ స్టార్ట్ చేసి, 2027లో విడుదల చేయడానికి రెడీ అవుతారు. ఇదే టైమ్‌లో ‘కేజీఎఫ్ 3’ ప్రీ-ప్రొడక్షన్ మొదలవుతుంది. అంటే, 2028లో మరో మాసివ్ బాక్సాఫీస్ హిట్ పక్కా. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా అంటున్నారు.
రాజమౌళి మరో సినిమా చేయాలంటే కనీసం 2028 వరకు వెయిట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అయితే, ప్రశాంత్ నీల్ నాలుగేళ్లలో మూడు సినిమాలు తీసే చాన్స్ ఉండటంతో, బాక్సాఫీస్ పరంగా ఆయన హవా మరింత పెరిగే అవకాశం ఉంది. ఇది పూర్తిగా మార్కెట్ డిపెండెంట్. లాంగ్ టర్మ్‌లో రాజమౌళి తీసే ప్రతీ సినిమా బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్ అవుతుంది. కానీ, షార్ట్ టర్మ్ బాక్సాఫీస్ రేస్‌లో ప్రశాంత్ నీల్ లీడ్ తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే, రాబోయే నాలుగేళ్లలో రాజమౌళి ఒక సినిమానే తీస్తే, ప్రశాంత్ నీల్ నాలుగు సినిమాలు తీస్తారు. అంటే, మొత్తం కలిపితే ఆయన రెవెన్యూ, బిజినెస్ స్కోప్ 4000 కోట్లకు పైగా ఉండొచ్చు.
ఫైనల్ గా..
ప్రశాంత్ నీల్ ఇప్పుడు మరింత వేగంగా సినిమాలను పూర్తి చేసేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆయన లైన్అప్ చూస్తే, వచ్చే నాలుగేళ్లలో అత్యధిక బిజినెస్ చేసేవారిలో ముందుండే అవకాశం ఉంది. కానీ, ఒకే సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు క్రియేట్ చేయాలంటే రాజమౌళి ముందు ఎవ్వరూ ఉండలేరు. ఇద్దరి వేర్వేరు స్టైల్ బిజినెస్ పాయింట్‌లో రియలిస్టిక్ వ్యూహాలతో ముందుకు సాగుతాయి. మరి, తుదికి ఎవరు నెంబర్ వన్ డైరెక్టర్‌గా నిలుస్తారో వేచి చూడాలి.