దసరాకి బొమ్మ పెలాల్సిందే అంటున్నారా?
సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ చిత్రం `వెట్టేయాన్` జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే.
సూపర్ స్టార్ రజనీకాంత్ 170వ చిత్రం `వెట్టేయాన్` జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. ఇక సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో చెప్పాల్సిన పనిలేదు. `జైభీమ్` సినిమాతో జ్ఞాన్ వేల్ రేంజ్ మారిపోయింది. గొప్ప సందేశాత్మక చిత్రాన్ని తెరకెక్కించి విమర్శకుల ప్రశంసలందుకున్నారు. ఈ సక్సెస్ చూసి రజనీకాంత్ పిలిచి మరీ అవకాశం ఇచ్చారు.
దీంతో ఇద్దరు పెద్ద సంచనలం చేస్తున్నారా? అంచనాలు అభిమానుల్లో బలంగా కనిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్ పోస్టర్..ఇతర ప్రచార చిత్రాలతో సినిమాకి మంచి బజ్ క్రియేట్ అయింది. అయితే ఇంతవరకూ సినిమా రిలీజ్ తేదీ మాత్రం ప్రకటించలేదు. షూటింగ్ పూర్తిచేసుకున్నా రిలీజ్ తేదీపై క్లారిటీ లేకపోవడం ఆసక్తికరంగా మారింది. ఈ నేపథ్యంలో రిలీజ్ తేదీపై రజనీకాంత్ అల్టిమేటం జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఎట్టి పరిస్థుతుల్లో చిత్రాన్ని దసరా కానుకగా ఆక్టోబర్ లో రిలీజ్ చేయాలని అన్నారుట. అప్పటికల్లా అన్ని పనులు పూర్తి చేసి నెల రోజుల ముందుగానే సినిమాని జనాల్లోకి తీసుకెళ్లేలా ప్రచార కార్యక్రమాలు కూడా చేద్దామని ప్రామిస్ చేసారుట. ప్రస్తుతం టీమ్ ఈ రిలీజ్ తేదీపైనే పనిచేస్తున్నట్లు సమాచారం. సూపర్ స్టార్ చెప్పారంటే చేయాల్సిందే. అందులో ఎలాంటి మార్పు ఉండదు. సినిమాపై రజనీకాంత్ ఇంత పట్టుదతో ఉన్నారంటే? వెట్టేయాన్ తో ఏదో మ్యాజిక్ చేయబోతున్నారు? అన్న అంచనాలు మరింత బలపడుతున్నాయి.
ప్రస్తుతం చెన్నైలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. వాటిని వీలైనంత త్వరగా పూర్తి చేసే అవకాశం ఉంది. అంటే చిత్ర యూనిట్ కి గట్టిగా మూడు నెలల సమయం చేతిలో ఉంది. ఈలోగా అన్ని ముగించుకుని రజనీ ముందుకు వెళ్లాలి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది.