ఐఫాలో రకుల్.. మీడియా నుంచి ఊహించని ప్రశ్న
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.
సౌత్ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్ నటుడు, నిర్మాత జాకీ భగ్నానీ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. హిందీ చిత్రసీమలో దిగ్గజ ఫిలింమేకర్స్ కుటుంబంలోకి కోడలుగా అడుగుపెట్టింది. రకుల్ మామ గారు వాసు భగ్నానీ (జాకీ తండ్రి) పేరున్న ప్రముఖ నిర్మాత. బాలీవుడ్ కి ఎన్నో క్లాసిక్ విజయాలను అందించారు.
కూలీ నంబర్ 1, హీరో నంబర్ 1, ప్యార్ కియా తో డర్నా క్యా, బడే మియాన్ చోటే మియాన్, బీవీ నంబర్ 1, తేరా జాదూ చల్ గయా, ముఝే కుచ్ కెహనా హై, రెహనా హై తేర్రే దిల్ మే, దీవానపన్, ఓం జై వంటి చిత్రాలను వాసు భగ్నానీ నిర్మించారు. జీనా సిర్ఫ్ మెర్రే లియే, సర్బ్జిత్, వెల్కమ్ టు న్యూయార్క్, బెల్ బాటమ్ వంటి చిత్రాలను కూడా నిర్మించారు.
కానీ ఇటీవల వాసు భగ్నానీ నిర్మాణ సంస్థ డిజాస్టర్లతో ఇబ్బందుల్లో ఉందని హిందీ మీడియాలో కథనాలొచ్చాయి. ఇలాంటి సమయంలో `ఐఫా 2024` ఉత్సవాల్లో తనని ప్రశ్నించాలని చూసిన మీడియాకు రకుల్ దూరంగా వెళ్లిపోయిందని హిందూస్థాన్ టైమ్స్ (హెచ్.టి) కథనంలో పేర్కొంది. అందుకు సంబంధించిన క్లిప్ ను హెచ్టి షేర్ చేసింది. రకుల్ ప్రీత్ సింగ్ మీడియాతో మాట్లాడుతున్నప్పుడు తన మామ, నిర్మాత వాసు భగ్నాని గురించి అడిగినప్పుడు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గత కొన్ని నెలలుగా వాసు భగ్నానిపై బకాయిలు చెల్లించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి.
అక్షయ్ కుమార్-టైగర్ ష్రాఫ్ నటించిన బడే మియాన్ చోటే మియాన్ చిత్రానికి దర్శకత్వం వహించినందుకు తన ఫీజు చెల్లించలేదని దర్శకుడు అలీ అబ్బాస్ జాఫర్ ఫిర్యాదు చేయగా, అతడిపై వాసు భగ్నానీ కూడా డబ్బును దుర్వినియోగం చేసాడని కౌంటర్ దాఖలు చేసారు. పలువురు ఫిలింమేకర్స్ కి వాసు భగ్నానీ ఇంకా పేమెంట్లు క్లియర్ చేయాల్సి ఉందన్న చర్చ ఉంది.