సీనియర్లు..జూనియర్లు! ఎవరు దారి వారిదే
పోటీ ఉన్నా అది ఆరోగ్యకరమైన పోటీ తప్ప! ఒకరి అవకాశాలు మరోకరు తీసుకోవడం అన్నది కనిపించని సన్నివేశం.
సీనియర్ల దారి సీనియర్లదే..జూనియర్ల దారి జూనియర్లదే అన్నది నేటి మాట. కలిసి పనిచేస్తే కలదు సుఖం అన్న చందంగా ఇండస్ట్రీలో ఇప్పుడంతా కలిసి మెలిసి పనిచేస్తున్న సన్నివేశం కనిపిస్తుంది. పోటీ ఉన్నా అది ఆరోగ్యకరమైన పోటీ తప్ప! ఒకరి అవకాశాలు మరోకరు తీసుకోవడం అన్నది కనిపించని సన్నివేశం. చిరంజీవి..బాలకృష్ణ..నాగార్జు..వెంకటేష్ ..రవితేజ లాంటి సీనియర్ హీరోలకు సీనియర్ హీరోయిన్లే సరితూగుతున్నారన్నది చూస్తూనే ఉన్నాం.
వాళ్ల సరసన హీరోయిన్ గా నటించాలంటే? త్రిష.. నయనతార..కాజోల్ అగర్వాల్.. తమన్నా.. అనుష్క శెట్టి లాంటి భామలే ఆప్షన్ గా కనిపిస్తున్నారు. సీనియర్ హీరోల వయసును మ్యాచ్ చేయగల్గేది వాళ్లే దశాబ్ధానికి పైగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న భామలు. క్రేజ్ పరంగానూ ఏమాత్రం తగ్గలేదు. అందుకే ఇప్పటికీ కోట్ల రూపాయలు పారితోషికం అందుకో గల్గుతున్నారు. సీనియర్ భామల్ని కాదని యువ నాయికల్ని ఎంపిక చేస్తే సన్నివేశం ఎలా ఉందో రవితేజ పక్కన నటించిన హీరోయిన్లను పరిశీలిస్తే తెలుస్తుంది.
కుమార్తె వయసున్న భామలు 50 ఏళ్ల పైబడ్డ హీరోలకు జోడీ ఏంటని? విమర్శలు ఎదుర్కున్నారు. ఆ రకంగా చూస్తే జూనియర్ భామలకు సీనియర్ భామలు పోటీ కాదని చెప్పొచ్చు. ఇక మహేష్ ..ప్రభాస్.. బన్నీ.. తారక్ ..చరణ్ జనరేషన్ హీరోలకు ఆ భామలు తగ్గవారే. అవసరాన్ని బట్టి..పాత్రల్ని బట్టి కొత్త భామల్ని తీసుకునే వెసులు బాటు ఎలాగూ ఉంది. సక్సెస్ అయిన శ్రీలీల.. పూజాహెగ్డే..మీనాక్షి చౌదరి లాంటి వారిని ఎంపిక చేస్తున్నా..సీనియర్ భామలు అవసరాన్ని బట్టి రంగంలోకి దిగుతున్నారు.
ఒకప్పుడు పదేళ్లు కెరీర్ పూర్తయిన భామలు పరిశ్రమకి దూరమయ్యేవారు. ఇప్పుడా సన్నివేశం కనిపించ లేదు. బాలీవుడ్ తరహాలో టాలీవుడ్ లోనూ కొనసాగుతున్నారు. ఎవరి శైలిలో వారు ముందుకెళ్తున్నారు. కొత్త భామలకి సరిపడ్డ యంగ్ హీరోలు ఎలాగూ ఉన్నారు. నాగచైతన్య...రామ్.. విజయ్ దేవరకొండ మినిమం రేంజ్ ఉన్న హీరోలంతా కొత్త భామలకే ఒటేస్తున్న సంగతి తెలిసిందే. ఇలా పరిశ్రమలో కొత్త.. పాత కలిసి పనిచేయడం ఆహ్లాదరకమైనదిగా చెప్పొచ్చు.