500 కోట్ల క్లబ్ హీరో రెండు సినిమాలు గాల్లోనే..!
ఈ రెండు చిన్న సినిమాలను వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్. గద్దర్ 2తో అతడు 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు.;
కొన్నేళ్ల పాటు ఇండస్ట్రీ నుంచి తెరమరుగై, ఒకే ఒక్క బ్లాక్ బస్టర్ తో తిరిగి వచ్చిన ఓ ప్రముఖ హీరో, ఆ తర్వాత వరుసగా సెట్స్ పై ఉన్న తన చిన్న బడ్జెట్ సినిమాలను లైట్ తీస్కోవడం చర్చనీయాంశంగా మారింది. ఉన్నట్టుండి ఒకేసారి 500 కోట్ల క్లబ్ ని అందుకున్న సదరు హీరో ఏదోలా తన సినిమాలను రిలీజ్ చేయాలనే ఆలోచనలో లేడు. ఇప్పుడు కేవలం భారీ బడ్జెట్ చిత్రాలపై మాత్రమే అతడు దృష్టి సారిస్తున్నాడు. భారీ బడ్జెట్లు, క్రేజ్ ఉన్న బ్యానర్లు, దర్శకులకు మాత్రమే ఓకే చెబుతున్నాడు. పాన్ ఇండియా స్టార్ డమ్ కోసం పాకులాడుతూ ఇటు సౌత్ డైరెక్టర్లకు అవకాశాలు కల్పిస్తున్నాడు.
అయితే అతడు నటించిన ఓ సినిమా షూటింగ్ దాదాపు 80శాతం పూర్తి కాగా, దానిని ఎలాగైనా రిలీజ్ చేయాలని ఆ చిత్రానికి దర్శకత్వం వహించిన దర్శకుడు చాలా ప్రయత్నించాడు. కానీ అతడికి ఆ అవకాశమే లేకుండా పోయింది. ఆ సినిమాని నిర్ధాక్షిణ్యంగా మధ్యలో వదిలేసారు. నిర్మాతలు పెట్టుబడులు సమకూర్చకపోవడం సమస్యగా మారింది. మరోవైపు సంజయ్ దత్, జాకీ ష్రాఫ్, మిథున్ చక్రవర్తి వంటి స్టార్లతో కలిసి చేయాల్సిన భారీ చిత్రం ప్రారంభ దశలోనే నిలిచిపోయింది. దీనికోసం సదరు స్టార్ హీరో ఎలాంటి ప్రయత్నాలు చేయలేదు.
ఈ రెండు చిన్న సినిమాలను వదులుకున్న ఆ స్టార్ హీరో ఎవరో కాదు.. బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీడియోల్. గద్దర్ 2తో అతడు 500 కోట్ల క్లబ్ లో అడుగుపెట్టాడు. ఆ తర్వాత అతడి రేంజ్ మారిపోయింది. దీని కారణంగా అతడు సెట్స్ పై ఉన్న సూర్య , బాప్ చిత్రాలను పూర్తి చేసే ఆలోచనలో లేడని కథనాలొస్తున్నాయి. 80శాతం పూర్తయిన సూర్య ఆగిపోయింది. షూటింగ్ 2022లో ప్రారంభమైంది కానీ ఆర్థిక సమస్యల కారణంగా ఆగిపోయింది.
సూర్యకు దీపక్ ముకుత్ దర్శకత్వం వహిస్తున్నాడు. దర్శకుడు ఆశపడినా ఇది ఆగిపోయింది. మరో సినిమా బాప్ ని పేరున్న పెద్ద దర్శకుడు అహ్మద్ ఖాన్ దర్శకత్వం వహించాల్సి ఉన్నా, స్టార్ల కాల్షీట్లు, షెడ్యూల్ సమస్యల కారణంగా అందరినీ ఒకేతాటిపైకి తేలేక ఆరంభమే నిలిపి వేసారు. ఇక ఈ రెండూ రీమేక్ సినిమాలు కావడంతో స్టార్ హీరో అంతగా ఆసక్తి చూపడం లేదట. ఇటీవల రీమేక్ లు డిజాస్టర్లుగా మారుతుండగా వీటిపై ఆసక్తి సన్నగిల్లిందని తెలుస్తోంది. అహ్మద్ ఖాన్ పెద్ద దర్శకుడే అయినా సరైన హిట్లు లేకపోవడంతో బాప్ కూడా మూలన పడింది.