నాన్న చనిపోయినప్పుడు ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదు
ఎక్స్‌పీరియెన్స్ తో ఏదైనా సాధించొచ్చంటున్న తమన్ తాను 11 ఏళ్ల వయసు నుంచే పని చేయడం మొదలుపెట్టినట్టు తెలిపాడు.;
టాలీవుడ్ స్టార్ హీరోలందరి సినిమాలతో పాటూ పలు పాన్ ఇండియా సినిమాలకు సంగీతం అందిస్తూ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఎంతో బిజీగా ఉన్నాడు. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమన్ తన కెరీర్ లో జరిగిన ఎన్నో విషయాలను షేర్ చేసుకున్నాడు. ఎక్స్‌పీరియెన్స్ తో ఏదైనా సాధించొచ్చంటున్న తమన్, మజిలీ సినిమాకు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన విషయం తెలిసిందే. ఆ సినిమాకు కేవలం వారం రోజుల్లోనే తాను వర్క్ కంప్లీట్ చేసినట్టు చెప్పాడు.
అదే ఇంటర్వ్యూలో తమన్ తండ్రిని గుర్తు చేసుకుని ఎమోషనల్ అయ్యాడు. తనకు 11 ఏళ్లున్నప్పుడు తండ్రి మరణించాడని, ఆ టైమ్ లో తన చెల్లెలు సెకండ్ క్లాస్ చదువుతుందని తమన్ చెప్పాడు. తండ్రి శవాన్ని అంబులెన్స్ లో తీసుకొచ్చినప్పుడు తన కంట ఒక్క కన్నీటి చుక్క కూడా రాలేదని, అందరూ ఏడుస్తున్నా తాను మాత్రం ఏడవలేదని తమన్ వెల్లడించాడు.
తండ్రి శవాన్ని చూడగానే అమ్మని, చెల్లిని ఎలా చూసుకోవాలనే ఆలోచనలో పడిపోయానని చెప్తున్న తమన్ తక్కువ వయసులోనే అంత మెచ్యూర్డ్ గా ఎలా ఆలోచించానో ఇప్పటికీ అర్థం కాదన్నాడు. ఆ రోజు తమ ఫ్యామిలీని పరామర్శించడానికి శివమణి వచ్చారని, ఆయన్ని చూసి తానెంతో ఎమోషనల్ అయినట్టు తమన్ చెప్పుకొచ్చాడు.
నాన్న చనిపోయాక వచ్చిన ఎల్ఐసీ డబ్బును నన్ను నమ్మి మా అమ్మ నాకు ఇచ్చింది. వాటితోనే మ్యూజికల్ ఇన్‌స్ట్య్రుమెంట్స్ కొని, పదకొండేళ్ల నుంచే సంగీతంపై ఫోకస్ చేశా. ఇండస్ట్రీలోని ఎంతోమంది హెల్ప్ తో ఇవాళ ఈ స్థాయి వరకు వచ్చానని తమన్ తెలిపాడు. నా కెరీర్ ఎదుగుదలలో మా అమ్మ ఎన్నో సమస్యలు ఎదుర్కొందని చెప్పిన తమన్, ఇప్పుడు ఆమెను కాలు కిందపెట్టనీయకుండా చూసుకుంటున్నట్టు చెప్పాడు.
అదే ఇంటర్వ్యూలో సాంగ్స్, వాటికొచ్చే వ్యూస్ గురించి కూడా తమన్ మాట్లాడాడు. వ్యూస్ రావాలని తానెప్పుడూ సాంగ్స్ చేయనని, తన ఆలోచనంతా మంచి మ్యూజిక్ ఇవ్వడంపైనే ఉంటుందని అన్నాడు. వ్యూస్ విషయంలో తాము అనుకున్నది జరగాలని లేదని, గేమ్ ఛేంజర్ సినిమాలోని సాంగ్స్ ఆడియన్స్ కు అనుకున్న స్థాయిలో రీచ్ అవకపోవడానికి కారణం ఆ పాటల్లో ఎలాంటి హుక్ స్టెప్స్ లేకపోవడమేనని, అల వైకుంఠపురములో సినిమాలోని సాంగ్స్ కు ఆ రేంజ్ వ్యూస్ రావడానికి రీజన్ కూడా హుక్ స్టెప్సే అని తమన్ పేర్కొన్నాడు. ఇప్పటివరకు 170 సినిమాలకు సంగీతం అందించిన తమన్ కు తన కెరీర్లో ఎంతో కష్టపడి కంపోజ్ చేసిన సాంగ్ అరవింద సమేత లోని పెనివిటి సాంగ్ అని చెప్పాడు.