'ది ఫ్యామిలీ మ్యాన్' సీజన్ 3 స్టోరి డీకోడెడ్

ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విడుదల అవుతుందా? శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి తిరిగి వస్తున్నాడా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి.

Update: 2024-05-24 00:30 GMT

అమెజాన్ ప్రైమ్ వీడియో 'పంచాయత్' సీజన్ 3లో అప్‌డేట్‌ను ప్రకటించిన తర్వాత, క్రైమ్ థ్రిల్లర్ జాన‌ర్ లో తెర‌కెక్క‌నున్న 'ది ఫ్యామిలీమ్యాన్' సీజ‌న్ 3 గురించిన అప్‌డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ది ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 3 విడుదల అవుతుందా? శ్రీకాంత్ తివారీగా మనోజ్ బాజ్‌పేయి తిరిగి వస్తున్నాడా? అంటూ ఆరాలు మొద‌ల‌య్యాయి. అయితే మేకర్స్ ఇంకా విడుదల తేదీని ప్రకటించలేదు.

తాజా మీడియా క‌థ‌నాల‌ ప్రకారం.. ఈ షో 2025లో విడుదలయ్యే అవకాశం ఉంది. రాజ్ & DK ద్వయం ఇంతకుముందు 2025లో విడుద‌ల చేసే వీలుంద‌ని హింట్ ఇచ్చారు. మ‌నోజ్ బాజ్‌పేయ్ ఇటీవలే పార్ట్ 3 గురించిన వివ‌రాలు వెల్లడించారు. ప్రస్తుతం షూట్ ద‌శ‌లో ఉంది. ఈ ప్రాసెస్‌ను నేను చాలా ఎంజాయ్ చేస్తున్నాను. షూటింగ్ లో పాల్గొంటున్నాను.. నేను 1:30 గంటలకు నిద్రపోయాను అని చెప్పారు.

ఈ సీజన్ లో ఏం చూపిస్తారు? తొలి రెండు భాగాల్లో తీవ్ర‌వాదంపై దృష్టి సారించారు. ఈసారి దేనిపై రాజ్ అండ్ డీకే దృష్టి పెట్టారు? అనేది తెలుసుకోవాల‌ని స‌ర్వ‌త్రా ఆస‌క్తి నెల‌కొంది. సీజ‌న్ 3లో భారతదేశంలోని ఈశాన్య ప్రాంత భౌగోళిక రాజకీయాలపై క‌థ‌నం ర‌క్తి క‌ట్టించ‌నుంద‌ని తెలుస్తోంది. స్థానిక సమస్యలను తెర‌పై చూపిస్తారు. క‌థ‌నంలో ప్రామాణికతను మెరుగుపరచడానికి స్థానిక కళాకారులను కూడా క‌లుపుకుని ప‌ని చేయాల‌ని రాజ్ అండ్ డీకే భావిస్తున్నారు. అయితే ఈ సీజ‌న్ లో క‌థేంటి? అంటే.. కచ్చితమైన ప్లాట్ వివరాలు వెల్లడి కాలేదు. షూటింగ్ నవంబర్ 2024 వరకు కొనసాగుతుందని భావిస్తున్నారు.

ది ఫ్యామిలీ మ్యాన్ సీజ‌న్ 1, 2 అలాగే ఫర్జీ సిరీస్ ల‌కు రాజ్ & డికె ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు కాబ‌ట్టి వాటికి క్రాస్‌ఓవర్ ఉంటుందా? అని అభిమానులు ప్ర‌శ్నిస్తున్నారు. మూడవ సీజన్‌లో షాహిద్ కపూర్ అతిథి పాత్రలో కనిపిస్తాడా లేదా అనే దాని గురించి ఆరాలు కొన‌సాగుతున్నాయి. షాహిద్ ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో మాట్లాడుతూ.. ఈ ఆరాల సంగ‌తినే ప్ర‌స్థావించారు. ''అమెరికన్ కాంట్రాక్ట్ చాలా కఠినంగా ఉంది... నేను ఏదైనా చెబితే కొంత మొత్తాన్ని నేనే తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.. అందుకే ఏదీ చెప్ప‌లేకపోతున్నాను. నేను ఏమీ చెప్పలేను కానీ బ‌హూత్ మ‌జా ఆనే వాలా హై (ఇది సరదాగా ఉంటుంది)'' అని అన్నారు.

భారతదేశంలోని ఈశాన్య రాష్ట్రాలు అంటే సిక్కిం, అస్సాం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, త్రిపుర వంటి చోట్ల రాజ‌కీయ ప‌రిణామాలు కుట్ర‌లు ఎలా ఉన్నాయి? అన్న‌ది తెర‌పై ఆవిష్క‌రించే వీలుంది. దేశ స‌మ‌గ్ర‌త‌కు ఐక్య‌త‌కు తూట్లు పొడిచే న‌క్స‌లిజం, తీవ్ర‌వాదం ఆయా రాష్ట్రాల్లో ఉండ‌నే ఉంది. ఇలాంటి వాటిని రాజ‌కీయ నాయ‌కులు ఎలా ఎగ‌దోస్తారు? అనేది కూడా వెబ్ సిరీస్ లో రాజ్ అండ్ డీకే చూపిస్తార‌ని భావిస్తున్నారు.

Tags:    

Similar News