దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు!
ఈ జెనరేషన్ లో మనకి తెలిసిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
సినీ ఇండస్ట్రీలో ఇప్పుడు దర్శకులు, నిర్మాతలు సపరేట్ గా లేరు. దర్శకులే నిర్మాతలుగా మారి సినిమాలు నిర్మిస్తుంటే, నిర్మాతలే దర్శకులుగా మారి మెగా ఫోన్ పట్టుకొని డైరెక్షన్ చేస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో చాలామంది డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ గానూ రాణిస్తున్నారు. ఓవైపు దర్శకత్వ బాధ్యతలు చేపడుతూనే, మరోవైపు సినిమా నిర్మాణ వ్యవహారాలు కూడా చూసుకుంటున్నారు. ఈ జెనరేషన్ లో మనకి తెలిసిన డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.
ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలు తీసిన టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్.. 'సుకుమార్ రైటింగ్స్' అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి నిర్మాతగా మారారు. తన శిష్యులను దర్శకులుగా పరిచయం చేయడమే కాదు, అవసరమైతే తన కథలను అందించి కొత్తవారికి అవకాశాలు కల్పిస్తున్నారు. గతేడాది తన బ్యానర్ లో 'విరూపాక్ష' లాంటి హిట్టు కొట్టిన సుక్కూ.. ఇప్పుడు 'పుష్ప 2', RC 16 లాంటి పాన్ ఇండియా సినిమాల నిర్మాణంలో భాగం పంచుకుంటున్నారు. ఇదే క్రమంలో రాబోతున్న RC 17 సినిమాకి కూడా తన బ్యానర్ ను అటాచ్ చేయనున్నారు.
మరో అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ సైతం సినిమా ప్రొడక్షన్ లోకి దిగారు. గతంలో 'చల్ మోహన రంగా' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించిన త్రివిక్రమ్.. 'ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్' అనే బ్యానర్ ఏర్పాటు చేసి తన సతీమణి సాయి సౌజన్యను ప్రొడ్యూసర్ గా పరిచయం చేసారు. ప్రస్తుతం సితార ఎంటర్టైన్మెంట్స్ తో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ నిర్మిస్తున్నారు. లాస్ట్ ఇయర్ 'సార్' 'మ్యాడ్' లాంటి హిట్లు కొట్టారు. లేటెస్టుగా 'టిల్లు స్క్వేర్' లాంటి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. త్వరలో 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి' మూవీ విడుదల కాబోతోంది. NBK 109, లక్కీ భాస్కర్ లాంటి మరికొన్ని చిత్రాలు సెట్స్ మీద ఉన్నాయి.
సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ 90స్ నుంచే సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. వర్మ క్రియేషన్స్, RGV ఫిలిం కంపెనీ, RGV డెన్ ప్రొడక్ట్స్ వంటి బ్యానర్స్ మీద ఆర్జీవీ సినిమాలు రూపొందిస్తుంటారు. కొన్ని చిత్రాలకు సమర్పకులుగానూ వ్యవహరిస్తుంటారు. వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్ కూడా ఆయన బాటలోనే నడిచారు. మొదట్లో 'వైష్ణో అకాడమీ' పేరు మీద సినిమాలు తీసిన పూరీ.. ఆ తర్వాత 'పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్' సంస్థలో కొన్ని చిత్రాలు నిర్మించారు. ప్రస్తుతం 'పూరీ కనెక్ట్స్' బ్యానర్ లో చార్మీతో కలిసి సినిమాలు తెరకెక్కిస్తున్నారు. వీరు త్వరలో 'డబుల్ ఇస్మార్ట్' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.
స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కూడా నిర్మాణంలోకి దిగారు. 'కృష్ణమ్మ' అనే చిత్రానికి సమర్పకులుగా వ్యవహరిస్తున్నారు. ఇది మే 3వ తేదీన విడుదల కాబోతోంది. దర్శకుడు హరీశ్ శంకర్ గతేడాది 'ATM' అనే వెబ్ సిరీస్ ను ప్రెజెంట్ చేసిన సంగతి తెలిసిందే. అంతకముందు అనిల్ రావిపూడి సైతం 'గాలి సంపత్' సినిమాకి ప్రెజెంటర్ గా చేసారు. డైరెక్టర్ దశరథ్ ఆ మధ్య 'లవ్ యూ రామ్' అనే చిత్రాన్ని సమర్పించారు. అలానే బంగార్రాజు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల ఇటీవల 'లంబసింగి' అనే చిత్రంతో నిర్మాతగా మారారు.
దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గతంలో 'విశ్వామిత్ర క్రియేషన్స్' అనే బ్యానర్ స్థాపించి తన భార్య రమ సమర్పణలో 'యమదొంగ' సినిమా చేసారు. ఆ తర్వాత 'అందాల రాక్షసి' చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. 'బ్రహ్మాస్త్రం' అనే హిందీ సినిమాని తెలుగులో సమర్పించిన జక్కన్న.. ఇప్పుడు ‘ఆక్సిజన్’, ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ వంటి రెండు చిత్రాలకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన తాజాగా 'నక్కిన నేరేటివ్స్' అనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు.
యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ 'భద్రకాళి పిక్చర్స్' అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన సోదరుడు ప్రణయ్ వంగాతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. తన డెబ్యూ మూవీ 'అర్జున్ రెడ్డి' ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సందీప్.. 'యానిమల్' వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. రాబోయే 'స్పిరిట్' మూవీలోనూ తన ప్రొడక్షన్ హౌస్ ను భాగం చేయనున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి 'సరెండర్ 2 సినిమా' అనే బ్యానర్ పెట్టి, తాను డైరెక్ట్ చేసే సినిమాల నిర్మాణంలో పెట్టుబడులు పెడుతున్నారు.
సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటి నుంచీ తన 'అమిగోస్ క్రియేషన్స్' సంస్థలో సినిమాలు రూపొందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న 'కుబేర' మూవీ ప్రొడక్షన్ కూడా చూసుకుంటున్నారు. మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ 'స్వప్న సినిమాస్' బ్యానర్ మీద 'జాతిరత్నాలు' సినిమా నిర్మించి మంచి హిట్టు కొట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ 'చిత్రం మూవీస్' అనే పేరు మీద సినిమాలు నిర్మిస్తే.. దర్శక నటుడు రవిబాబు 'ఫ్లయింగ్ ఫాగ్స్' ప్రొడక్షన్ లో సినిమాలు రూపొందిస్తుంటారు.
గతంలో 'గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్' తో కలిసి సినిమాలు తీసిన 'రాజా సాబ్' డైరెక్టర్ మారుతి.. ఆ తర్వాత మారుతి టాకీస్, మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్ పేర్లతో చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన సినిమాలన్నీ 'ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్' బ్యానర్ లో చేస్తుంటారు. ప్రస్తుతం అనుష్కతో 'ఘాటి' అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. రచ్చ దర్శకుడు సంపత్ నంది 'సంపత్ నంది టీమ్ వర్క్స్' అనే బ్యానర్ లో తీస్తున్నారు. ఇటీవలే తమన్నా భాటియాతో 'ఓదెల 2' చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు.
'జానీ' సినిమాతో దర్శకుడిగా మారిన హీరో పవన్ కల్యాణ్.. అప్పట్లో 'పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్' పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసారు. త్రివిక్రమ్ తో కలిసి 'చల్ మోహన రంగా' నిర్మాణంలో భాగం పంచుకున్నారు. 'ఫలక్ నుమా దాస్' చిత్రంతో డైరెక్టర్ గా మారిన హీరో విశ్వక్ సేన్.. 'విశ్వక్ సేన్ సినిమాస్' బ్యానర్ లో సొంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. గతేడాది తన స్వీయ దర్శక నిర్మాణంలో 'దాస్ కా ధమ్కీ' మూవీని తెరకెక్కించారు. 'జోష్' డైరెక్టర్ వాసు వర్మ సైతం సినీ నిర్మాణంలోకి వచ్చారు.
Rx 100 డైరెక్టర్ అజయ్ భూపతి 'ఎ క్రియేటివ్ వర్క్స్' అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, 'మంగళవారం' సినిమా రూపొందించారు. ఓ బేబీ దర్శకుడు సాయి రాజేశ్ 'అమృత ప్రొడక్షన్స్' బ్యానర్ లో 'కలర్ ఫోటో' సినిమా తీసి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. గుణ శేఖర్ 'గుణ టీమ్ వర్క్స్' లో రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీస్ తెరకెక్కించారు. అలానే వైవిఎస్ చౌదరి 'బొమ్మరిల్లు' అనే బ్యానర్ స్థాపించి గతంలో సినిమాలు నిర్మించారు.
ఇలా అనేకమంది దర్శకులు నిర్మాతలుగా మారి రెండు పడవల మీద ప్రయాణం సాగించారు. వారిలో కొందరు రెండు క్రాఫ్ట్స్ లోనూ సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం నిర్మాతలుగా సినిమాలు తీసి దివాలు తీశారు. అదే సమయంలో కొందరు ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ మధ్య కాలంలో 'డర్టీ హరి' '7 డేస్ 6 నైట్స్' 'మళ్ళీ పెళ్లి' లాంటి సినిమాలను డైరెక్ట్ చేసారు. నిర్మాత అభిషేక్ నామా 'డెవిల్' మూవీ కోసం మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.