షాకిస్తున్న అగ్ర బ్యాన‌ర్ లైన‌ప్

110 సంవ‌త్స‌రాల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో దాదాపు 50 సంవ‌త్స‌రాలుగా మ‌నుగ‌డ సాగించింది య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్

Update: 2024-09-29 04:15 GMT

110 సంవ‌త్స‌రాల భార‌తీయ సినిమా చ‌రిత్ర‌లో దాదాపు 50 సంవ‌త్స‌రాలుగా మ‌నుగ‌డ సాగించింది య‌ష్ రాజ్ ఫిలింస్ బ్యాన‌ర్. YRF అని షార్ట్ క‌ట్ లో పిలుస్తారు. నిర్మాత యష్ చోప్రా 1970లో ఈ సంస్థ‌ను స్థాపించారు. 2022 నాటికి ఇందులో 80కి పైగా హిందీ చిత్రాలు, ఒక తమిళ చిత్రాన్ని నిర్మించింది. YRF 1997లో చలనచిత్ర పంపిణీ వ్యాపారాన్ని ప్రారంభించింది. సొంత‌ సినిమాల‌ను పంపిణీ చేయడంతో పాటు, ఇతర సంస్థల నుండి 50 చిత్రాలకు పైగా దేశీయంగా, అంతర్జాతీయంగాను పంపిణీ చేసింది. ప‌రిశ్ర‌మ అగ్ర హీరోలంద‌రితో ఈ బ్యాన‌ర్ సినిమాల‌ను నిర్మించింది. చ‌రిత్ర‌లో క్లాసిక్స్ అన‌ద‌గ్గ సినిమాల‌ను నిర్మించిన ఘ‌న‌త ఈ బ్యాన‌ర్ సొంతం.

ఇప్పుడు ఈ బ్యాన‌ర్ వ‌డి వ‌డిగా 100 సినిమాల క్ల‌బ్ లో అడుగుపెట్ట‌బోతోది. కేవ‌లం 2024 లో అర‌డ‌జ‌ను ప్రాజెక్టుల‌ను లైన్ లో పెట్టింది. ఇవ‌న్నీ క్రేజీ ఫ్రాంఛైజీ చిత్రాలు.. బ్లాక్ బ‌స్ట‌ర్ల‌ను, పాన్ ఇండియా హిట్ల‌ను అందించాల‌ని ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేసింది. ప్ర‌స్తుతం ఈ బ్యాన‌ర్ లో వార్ 2 చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో ఉంది. ఆల్ఫా, మర్దానీ 3, పఠాన్ 2, టైగర్ వర్సెస్ పఠాన్, ధూమ్ 4 వంటి భారీ చిత్రాల నిర్మాణానికి ప్ర‌ణాళిక‌లు సిద్ధంగా ఉన్నాయి. రాబోయే 5 సంవత్సరాలలో భారతదేశంలోని అతిపెద్ద చిత్రాలను అందిస్తూ వైఆర్ఎఫ్ సంచ‌ల‌నాల‌కు తెర తీయ‌బోతోంది.

ఒక్కో సినిమాకి 200 కోట్ల నుంచి 600 కోట్ల వ‌ర‌కూ బ‌డ్జెట్లు కేటాయిస్తున్న య‌ష్ రాజ్ బ్యాన‌ర్ ఇప్ప‌టికిప్పుడు భారీ ఫైనాన్స్ సెట‌ప్స్ కోసం డ‌బ్బును స‌మీక‌రిస్తోంది. 2024-25లో సెట్స్ కి వెళుతున్న సినిమాల కోసం పెట్టుబ‌డులే 2000 కోట్లు. ఒక్కో సినిమాపై 500-600 కోట్ల బిజినెస్ అవుతుంది.. నాన్ థియేట్రిక‌ల్ ఆదాయం భారీగా ఉంటుందని అంచ‌నా. హృతిక్- ఎన్టీఆర్ క‌థానాయ‌కులుగా వార్ 2 చిత్రీక‌ర‌ణ వేగంగా పూర్త‌వుతోంది. త‌దుప‌రి వ‌రుస‌గా భారీ యాక్ష‌న్ సినిమాల లైన‌ప్ ని క‌లిగి ఉంది.

ప్రీప్రొడ‌క్ష‌న్ లో ఉన్న వాటిలో `ఆల్ఫా`లో ఆలియా భ‌ట్ , శార్వ‌రి వాఘ్ న‌టిస్తున్నారు. స్పై యూనివ‌ర్శ్ లో ఇది ఒక భాగం. రాణి ముఖ‌ర్జీతో మ‌ర్ధానీ 3 క్రేజీ ప్రాజెక్ట్. అలాగే షారూఖ్ తో ప‌ఠాన్ ఘ‌న‌విజ‌యం త‌ర్వాత సీక్వెల్ కోసం భారీ ప్రణాళిక‌ల్ని ర‌చిస్తోంది. స‌ల్మాన్- షారూఖ్ ఫేసాఫ్ తో టైగ‌ర్ వ‌ర్సెస్ ప‌ఠాన్ ని అత్యంత భారీగా రూపొందించ‌నుంది. దీనికోసం సిద్ధార్థ్ ఆనంద్ స్క్రిప్టును మ‌లుస్తున్నారు. ధూమ్ 4 కోసం ర‌ణబీర్ తో చ‌ర్చ‌లు సాగించింద‌ని క‌థ‌నాలొచ్చాయి. భార‌త‌దేశంలో అత్యంత భారీ క్రేజీ చిత్రాల‌తో నంబ‌ర్ వ‌న్ సంస్థ‌గా ఏలేందుకు క‌ల‌లు గంటున్న వైఆర్ఎఫ్‌ కి ఆల్ ది బెస్ట్.

Tags:    

Similar News