ఏపీలో తగ్గింది.. టీజీలో పెరిగింది!

కేంద్ర ప్రభుత్వానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద భారీగా ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలలో వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే పది శాతం ఆదాయం అధికంగా వచ్చింది.

Update: 2024-09-02 20:30 GMT

కేంద్ర ప్రభుత్వానికి వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) కింద భారీగా ఆదాయం వచ్చింది. ఆగస్టు నెలలో వార్షిక ప్రాతిపదికన చూసుకుంటే పది శాతం ఆదాయం అధికంగా వచ్చింది. గతేడాది ఇదే సమయం (ఆగస్టు)తో పోలిస్తే ఈసారి జీఎస్టీ కింద కేంద్రానికి రూ.1.75 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. గతేడాది ఇదే సమయం (ఆగస్టు నెల)లో ఈ ఆదాయం రూ.1.59 లక్షల కోట్లే కావడం గమనార్హం. అలాగే ఈ ఏడాది జూలైలో జీఎస్టీ కింద కేంద్ర ప్రభుత్వానికి రూ.1.82 లక్షల కోట్లు ఆదాయం వచ్చింది. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం జీఎస్టీ ఆదాయ గణాంకాలను తాజాగా వెల్లడించింది. మొత్తం మీద ఈ ఏడాది ఆగస్టు వరకు నికర జీఎస్టీ ఆదాయం రూ. 8.07 లక్షల కోట్లుగా ఉంది. ఇది గతేడాది కంటే 10.2 శాతం ఎక్కువ కావడం విశేషం.

కాగా ఆగస్టులో ఆంధ్రప్రదేశ్‌ జీఎస్టీ వసూళ్లు 5 శాతం తగ్గినట్టు కేంద్ర ఆర్థిక శాఖ తెలిపింది. గతేడాది ఆగస్టు నెలలో రూ.3,479 కోట్లు వసూలు అయ్యాయని వెల్లడించింది. అయితే ఈ ఏడాది రూ.3,298 కోట్లకు తగ్గిందని పేర్కొంది.

ఇక తెలంగాణలో జీఎస్టీ వసూళ్లలో 4 శాతం వృద్ధి నమోదైంది. గతేడాది ఆగస్టులో తెలంగాణలో జీఎస్టీ వసూళ్లు రూ.4,393 కోట్లు ఉండగా ఈ ఏడాది ఆగస్టులో రూ.4,569 కోట్లు వసూలు అయ్యాయి.

కాగా ఈ ఏడాది తొలి ఐదు నెలల్లో దేశ జీఎస్టీ వసూళ్లు గతేడాదితో పోలిస్తే 10.1 శాతం పెరిగి రూ.9.14 లక్షల కోట్లకు చేరుకున్నాయని కేంద్రం తెలిపింది. అలాగే ఎగుమతులతో దేశీయ ఆదాయం 9.2 శాతం పెరిగి రూ.1.25 లక్షల కోట్లకు చేరుకుంది. గతేడాది గణాంకాలతో పోలిస్తే ఆగస్టులో దిగుమతుల ఆదాయం 12.1 శాతం పెరిగి రూ.49,976 కోట్లకు చేరుకుందని సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఇన్‌ డైరెక్ట్‌ ట్యాక్సెస్‌ చైర్మన్‌ సంజయ్‌ కుమార్‌ అగర్వాల్‌ వెల్లడించారు.

అదేవిధంగా ఈ ఏడాది ఆగస్టు నెలలో రూ.24,460 కోట్ల విలువైన రీఫండ్‌లు జారీ చేశారు. ఇది వార్షిక ప్రాతిపదికన 38 శాతం ఎక్కువ కావడం గమనార్హం. రీఫండ్‌ల కోసం సర్దుబాటు చేసిన తర్వాత నికర దేశీయ ఆదాయం 4.9 శాతం పెరిగింది. దీంతో ఆదాయం రూ. 1.11 లక్షల కోట్లకు చేరుకోగా, ఐజీఎస్‌టీ ఆదాయం 11.2 శాతం పెరిగింది. రీఫండ్‌ సర్దుబాటు తర్వాత నికర జీఎస్టీ ఆదాయం రూ. 1.5 లక్షల కోట్లుకు పరిమితమైంది.

ఈ ఏడాది జూలైలో నికర దేశీయ ఆదాయం 14.4 శాతం పెరిగి రూ.1.66 లక్షల కోట్లకు చేరుకుందని కేంద్రం వెల్లడించింది. రీఫండ్‌ చేసిన మొత్తం రూ. 24,460 కోట్లుగా ఉందని తెలిపింది. ఇందులో 58 శాతం దేశీయ వాపసులు ఉన్నాయి.

కాగా సెప్టెంబర్‌ 9న జీఎస్టీ కౌన్సిల్‌ సమావేశం జరుగుతుంది. అందులో జీవిత బీమాపై జీఎస్టీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం టర్మ్‌ ఇన్సూరెన్స్‌ పై 18 శాతం జీఎస్‌టిని విధిస్తుండగా దాన్ని మినహాయిస్తారని టాక్‌ నడుస్తోంది. అయితే పెట్టుబడి ఆధారిత బీమా ప్లాన్‌ (యూలిప్‌)లపై జీఎస్టీ అలాగే ఉంటుందని చెబుతున్నారు.

Tags:    

Similar News