యాపిల్ మేక్ ఇన్ ఇండియా.. ఐఫోన్ 15 రిలీజ్ డేట్ ఇదే?
ఈ క్రమంలో ఇండియాలో జూన్ త్రైమాసికంలో అమ్మకాల్లో రికార్డు సృష్టించినట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు.
యాపిల్ మేకర్ ఫాక్స్ కాన్ కంపెనీ తమిళనాడు సమీపంలోని శ్రీపెరంబుదూర్ ఫెసిలిటీలో గతంలో కంటే వేగంగా ఐఫోన్ 15 స్థానిక ఉత్పత్తిని ప్రారంభించేందుకు సిద్ధంగా ఉందని అంటున్నారు. యాపిల్ లక్ష్యం.. స్థానికంగా అసెంబుల్ చేయబడిన ఐఫోన్ 15 ను వచ్చే నెల మధ్యలో అంతర్జాతీయంగా విడుదల చేయడమే.
అవును... ఐఫోన్ లను విక్రయించే సంస్థ ఆపిల్ కంపెనీ భారతదేశంలో ఐఫోన్ 15 తయారీని ప్రారంభించింది. ఈ సమయంలో యాపిల్ మేడ్ ఇన్ ఇండియా డివైస్ లను గతంలో కంటే చాలా వేగంగా ఉత్పత్తి అవుతాయని చెబుతున్నారు. ఇదే సమయంలో భారతదేశం నుండి ఇతర దేశాలకు వేగవంతంగా ఉత్పత్తులను ఎగుమతి చేయవచ్చని భావిస్తోంది.
గతేడాది ఆపిల్ భారతదేశంలోని ఫాక్స్ కాన్ ఫెసిలిటీలో సెప్టెంబర్ లో ఐఫోన్ 14ని అసెంబ్లింగ్ చేయడం ప్రారంభించిన సంగతి తెలిసిందే. గ్లోబల్ లాంచ్ అయిన కొన్ని వారాల తర్వాత భారతదేశంలో కొత్త ఐఫోన్ అసెంబుల్ చేయడం ఇదే మొదటిసారి. మేడ్ ఇన్ ఇండియా ఐఫోన్ 15కి సంబంధించిన నివేదికను బ్లూమ్ బెర్గ్ మొదట విడుదల చేసింది.
ప్రస్తుతం మార్కెట్లో ఐఫోన్ అంటే ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఖరీదు ఎంతైనా కొనుగోళ్లు భారీగానే ఉంటున్నాయి. ఈ క్రమంలో ఇండియాలో జూన్ త్రైమాసికంలో అమ్మకాల్లో రికార్డు సృష్టించినట్లు ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ ప్రకటించారు. కొంతకాలం క్రితం యాపిల్ తన ఆపిల్ స్టోర్లను భారతదేశంలో ముంబై, ఢిల్లీ నుండి ప్రారంభించింది.
సెప్టెంబరు 12న ప్రకటించబడే అవకాశం ఉన్నట్లు చెబుతున్న కొత్త ఐఫోన్.. మూడేళ్లలో పరికరానికి అతిపెద్ద అప్ డేట్ అవుతుందని హామీ ఇచ్చింది. ఇది సిరీస్ లో కెమెరా సిస్టమ్ కు ప్రధాన నవీకరణలను కలిగి ఉంటుందని చెబుతున్నారు.
కాగా... ఏప్రిల్ లో తన భారత పర్యటనలో భాగంగా ప్రధాని మోడీని కలిసిన అనంతరం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ టిమ్ కుక్ మాట్లాడుతూ... యాపిల్ దేశవ్యాప్తంగా వృద్ధి చెందడానికి, పెట్టుబడులు పెట్టడానికి కట్టుబడి ఉందని తెలిపిన సంగతి తెలిసిందే!