రెండు సీట్లు.. కూటమి పాట్లు.. ఢిల్లీకి చేరిన పంచాయతీ!
ఎందుకంటే.. స్వతంత్ర అభ్యర్థులు సహా.. కమ్యూనిస్టులు బలపరిచిన వారు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుంటారు. అదేవిధంగా వైసీపీ, కాంగ్రెస్ కూడా పొంచి ఉన్నాయి.
ఏపీలో రెండు ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలోనే ఎన్నికలు జరగనున్నాయి. ఇవి రెండూ కూడా.. పట్టభద్రుల (గ్రాడ్యుయేట్) కోటాలో భర్తీ అవుతున్నవే. 1) ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాలకు చెందిన సీటు. 2) ఉమ్మ డి తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల కోటా. ఈ రెండు స్థానాలు కూడా..ఎన్నికల రూపంలోనే భర్తీ కానున్నా యి. ఆయా జిల్లాల్లో ఓటు నమోదు చేసుకున్న గ్రాడ్యుయేట్లు ఎన్నికల్లో పాల్గొని ఓటు వేయనున్నారు. సహజంగానే రెండు సీట్లు కూడా హాట్‌హాట్‌గానే ఉన్నాయి.
ఎందుకంటే.. స్వతంత్ర అభ్యర్థులు సహా.. కమ్యూనిస్టులు బలపరిచిన వారు కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేస్తుంటారు. అదేవిధంగా వైసీపీ, కాంగ్రెస్ కూడా పొంచి ఉన్నాయి. ఇలాంటి సమయంలో కూటమి పార్టీల్లో ఈ సీట్లను ఎవరికి ఇవ్వాలన్న అంశం ఇబ్బందిగా మారింది. ఇన్నవి రెండే సీట్లు కావడంతో తాము తీసుకుంటామని.. టీడీపీ చెబుతోంది. అంతేకాదు.. తమ పార్టీ తరఫున అభ్యర్థులను కూడా ఖరారు చేసింది. వీరు ప్రచారం కూడా ప్రారంభించారు.
గుంటూరు, కృష్ణా జిల్లాల కోటాలో తెనాలి మాజీ ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ను చంద్రబాబు ఎంపిక చేశారు. ఇటీవల ఎన్నికల్లో ఆయన సీటును త్యాగం చేసి.. జనసేనకు ఇచ్చిన విషయం తెలిసిందే. ఇక, గోదావరి జిల్లాల కోటాలో పేరాబత్తుల రాజశేఖర్‌ను ఎంపిక చేసుకున్నారు. వీరి పోటీని సీఎం చంద్రబాబు కూడా ఖరారు చేశారని.. పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ, కూటమిలో ఉన్న జనసేన, బీజేపీలు.. రెండు సీట్లలో ఒకటి తమకు ఇవ్వాలని పట్టుబడుతున్నాయి.
దీనికి టీడీపీ ససేమిరా అంటోంది. వచ్చే సారి అవకాశం వస్తే.. మీరు తీసుకుందురు.. అని ముక్తాయించిం ది. దీంతో జనసేన కొంత మేరకు వెనక్కి తగ్గింది. కానీ, బీజేపీ మాత్రం పట్టు బిగించి.. ఢిల్లీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లింది. ఇటీవల 20 నామినేటెడ్ పదువులు భర్తీ చేస్తే.. కేవలం రెండు స్థానాలే ఇచ్చారని.. కాబట్టి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ సీటును తమకు కేటాయించాలని కమల నాథులు లొల్లి పెడుతున్నారు. దీంతో ఆలపాటిని కన్ఫర్మ్ చేసిన టీడీపీ.. పేరాబత్తుల విషయాన్ని మాత్రం పెండింగులో పెట్టింది. దీంతో ప్రచారం ప్రారంభించిన రాజశేఖర్.. హఠాత్తుగా ఆగిపోయారు. మరి ఢిల్లీలో పంచాయతీ ఎలాంటి మలుపు తిరుగుతుందో చూడాలి.