ఏం జరుగుతోంది..? వేలాది అమెరికన్ వెబ్ సైట్లు ఆఫ్.. ట్రంప్ ఆపేశారా?

తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (యూఎస్ ఎయిడ్)కు చెందిన వెబ్ సైట్ సహా వందలాది ప్రభుత్వ వెబ్ సైట్లు ఆఫ్ లైన్ లోకి వెళ్లాయి.

Update: 2025-02-04 07:46 GMT

కన్ను మూసి తెరిచే సరికి ఒక నిర్ణయం.. రోజు గడిచేలోగా ఒక మార్పు.. తెల్లారేసరికి మరొక పరిణామం.. అసలు అది అమెరికానేనా..? లేక మరేదైనా దేశమా..? అన్నట్లుగా ఒక్కో సంఘటన.. కేవలం 15 రోజుల్లో పరిస్థితులు మారిపోయాయి.. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తానేం చెప్పారో అది చేసేస్తున్నారు.. కొన్నిసార్లు అంతకుమించి కూడా చేస్తున్నారు. తాజాగా ప్రపంచంలోనే అతిపెద్ద సహాయ సంస్థ ‘అమెరికా అంతర్జాతీయ అభివృద్ధి సంస్థ’ (యూఎస్ ఎయిడ్)కు చెందిన వెబ్ సైట్ సహా వందలాది ప్రభుత్వ వెబ్ సైట్లు ఆఫ్ లైన్ లోకి వెళ్లాయి. అధికార బాధ్యతలు చేపట్టే సమయంలోనే యూఎస్ ఎయిడ్ పై ట్రంప్‌ తీవ్ర విమర్శలు చేశారు. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థ సైట్ ఆఫ్ లైన్ లోకి వెళ్లడం గమనార్హం.

సైబర్‌ సెక్యూరిటీ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెక్యూరిటీ ఏజెన్సీ (సీఐఎస్ఏ) రూపొందించిన 1,400 ఫెడరల్ సైట్ల జాబితాలో దాదాపు 350 కంటే ఎక్కువ వెబ్‌ సైట్లు అందుబాటులో లేవని తేలింది. అంతేకాదు.. వేలాది వెబ్‌ పేజీలు సైతం గాయబ్ అయినట్లు సమాచారం. అవేదో సాధారణ పేజీలు అయితే ఓకే.. కానీ రక్షణ, వాణిజ్యం, ఇంధనం, రవాణా, కార్మిక శాఖలతో పాటు సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ), సుప్రీంకోర్టుకు సంబంధించిన సైట్లూ ఆఫ్ లైన్ లోకి వెళ్లడమే సంచలనం రేపుతోంది.

ట్రంప్ ఆదేశాలతోనేనా..?

వందల ప్రభుత్వ వెబ్ సైట్లు ఒకేసారి ఆఫ్ లైన్ లోకి వెళ్లడం అంటే తాత్కాలికంగా జరిగిందా..? లేక ట్రంప్ ఏమైనా ఆదేశాలు జారీ చేశారా? అనేది ఆసక్తికరంగా మారింది. అసలు శాశ్వంతా మూసేశారా? అనేది తెలియాల్సి ఉంది.

అపర కుబేరుడు ఎలాన్ మస్క్, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామిలతో.. ప్రభుత్వ వ్యవస్థలో సమూల మార్పులే లక్ష్యంగా డోజ్‌ ను ట్రంప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత మస్క.. యూఎస్‌ ఎయిడ్‌ ను నేరగాళ్ల సంస్థ అని నిందించారు. దానిని తీవ్రవాద ఉన్మాదులు నడుపుతున్నారని, వాళ్లందరినీ వెళ్లగొడతానని ట్రంప్‌ ఆదివారం రాత్రి మీడియాతో చెప్పారు. దీనికి సంబంధించిన సైట్‌ శనివారం మూసుకుపోయింది. 600 మంది ఉద్యోగులను కార్యాలయ భవనంలోకి వెళ్లొద్దని ఆదేశాలు జారీ చేశారు. కంప్యూటర్‌ వ్యవస్థలో వారి పేర్లూ కనిపించలేదు. మరోవైపు రహస్య సమాచారాన్ని సిబ్బందికి ఇవ్వడానికి నిరాకరించిన యూఎస్‌ ఎయిడ్‌ భద్రతాధికారులు ఇద్దరిని ట్రంప్‌ ప్రభుత్వం సెలవుపై పంపింది. యూఎస్ ఎయిడ్.. 120 దేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. వందల కోట్ల డాలర్లను సాయం చేస్తోంది.

Tags:    

Similar News