ఏపీ బీజేపీ అధ్యక్షుడిని తేల్చనున్న అమిత్ షా
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారు అన్న ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఏపీ బీజేపీకి కొత్త అధ్యక్షుడు వస్తారు అన్న ఊహాగానాలు చాలా కాలంగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే. 2023లో దగ్గుబాటి పురంధేశ్వరి ఈ బాధ్యతలు స్వీకరించారు. ఈ ఏడాది జూన్ లో ఆమె పదవీకాలం పూర్తి అవుతుంది. బీజేపీ నియమావళి ప్రకారం రెండేళ్లు మాత్రమే అధ్యక్షుడు కొనసాగుతారు.
ఇదిలా ఉంటే ఈ రెండేళ్లకు కొద్ది నెలల ముందుగానే పురంధేశ్వరి పదవీ కాలం ముగుస్తోందా అన్న చర్చ అయితే ఉంది. బీజేపీకి ఇపుడు ఏపీలో అనుకూల వాతావరణం ఉందని కేంద్ర బీజేపీ నాయకత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమరావతికి నిధులు సమకూర్చి పెట్టడం, అలాగే పోలవరానికి భారీగా రీఅంబర్స్ మెంట్ నిధులు ఇవ్వడం లేటెస్ట్ గా చూస్తే విశాఖ స్టీల్ ప్లాంట్ కి భారీ ఎత్తున ఆర్ధిక ప్యాకేజీని ప్రకటించడం వంటివి ఉన్నాయి.
వీటిని జనంలో ప్రచారం చేయడంతో పాటు పార్టీని అన్ని విధాలుగా విస్తరించేందుకు దూకుడు తో కూడిన వ్యూహాలను చేసే సరికొత్త నాయకత్వం కావాలని బీజేపీ చూస్తోంది అని అంటున్నారు. మరో వైపు చూస్తే ఏపీలో కూటమి ప్రభుత్వంలో బీజేపీ మంత్రి ఉన్నారు. అలాగే ఎనిమిది మంది ఎమ్మెల్యేలు బీజేపీకి ఉన్నారు.
అదే విధంగా కేంద్రంలో ఒక కేంద్ర మంత్రి ఏపీ నుంచి బీజేపీకి ఉన్నారు అలాగే ముగ్గురు ఎంపీలు ఉన్నారు. దాంతో వీరి సాయం తీసుకుంటూ పార్టీలో సీనియర్లను అందరినీ కో ఆర్డినేట్ చేసుకుంటూ బీజేపీ కొత్త సారధి పార్టీని పరుగులు పెట్టించాలని కమలం పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
ఇక ఏపీలో వైసీపీ అన్ని విధాలుగా ఇబ్బందుల్లో ఉంది. దాంతో ఆ పార్టీ నుంచి అనేక మంది నేతలు కూటమి వైపు చూస్తున్నారు. వారిలో చాలా మంది టీడీపీ జనసేన వైపు వెళ్తున్నారు. వారిని బీజేపీ వైపు కూడా మళ్ళించడం ద్వారా రాయలసీమ ఉత్తరాంధ్ర వంటి చోట్ల బీజేపీ మరింత బలపడేలా చూడాలని కూడా అధినాయకత్వం కోరుకుంటోంది.
ఇక ఏపీలో బీజేపీ అధ్యక్ష పదవికి చాలా మంది పోటీ పడుతున్నారు. అందులో ఉత్తరాంధ్ర కు చెందిన కీలక బీసీ నేత పీవీఎన్ మాధవ్ ఉన్నారు ఆయన ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. ఆయన తండ్రి ఉమ్మడి ఏపీ బీజేపీకి తొలి అధ్యక్షుడిగా చాలా కాలం పాటు పనిచేశారు. దాంతో ఆయన పేరు పరిశీలనలో ఉంది అంటున్నారు.
ఇక కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కూడా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ కోసం రేసులో ఉన్నారని అంటున్నారు. ఆయన ఏపీ మంత్రివర్గంలో చోటు ఆశించినా సామాజిక సమీకరణల వల్ల అది కుదరలేదు. దాంతో ఈ పదవిని అందుకోవాలని ఆయన చూస్తున్నారు అని అంటున్నారు.
మరో వైపు చూస్తే అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ కేంద్ర బీజేపీ పెద్దలకు చాలా సన్నిహితంగా ఉంటున్నారు. ఆయన అంగబలం అర్థబలంతో పాటు పదునైన వ్యూహాలు కూడా కేంద్ర పెద్దలను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల ప్రధాని విశాఖ సభను బీజేపీ తరఫున ఆయన ఘనంగా జరిపించారు అని మార్కులు పడ్డాయి.
వీరితో పాటు మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పేరు కూడా పరిశీలనలో ఉంది అని అంటున్నారు. ఇలా ఏపీ బీజేపీ ప్రెసిడెంట్ పదవికి ఎవరి పేరు ఎక్కువ మందికి ఆమోదమో వంటి వాటిని అమిత్ షా విజయవాడలో పార్టీ మీటింగులో తెలుసుకుంటారు అని అంటున్నారు. అదే సమయంలో ఏపీ బీజేపీ నేతలకు ఆయన దిశా నిర్దేశం చేస్తూ పార్టీని పరుగులు పెట్టించాలని సూచిస్తారని అంటున్నారు.