టీడీపీ హైకమాండుపై ఎమ్మెల్యేల రుసరుస
తాజాగా నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఆరు చోట్ల జనసేనకు కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు.;

ఏపీలో నామినేటెడ్ పదవుల పంపకం అధికార టీడీపీ ఎమ్మెల్యేల్లో అసంతృప్తి రాజేస్తోంది. తాజాగా నియమించిన వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఆరు చోట్ల జనసేనకు కేటాయించడంపై టీడీపీ ఎమ్మెల్యేలు షాక్ తిన్నారు. వీరిలో డిప్యూటీ స్పీకర్ రఘురామరాజుతోపాటు మాజీ మంత్రులు గంటా శ్రీనివాసరావు, కోండ్రు మురళిమోహన్, ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు, ఎమ్మెల్యేల్లో కాగిత క్రిష్ణప్రసాద్, సీనియర్ నేత బండారు సత్యానందరావు వంటివారు ఉండటం గమనార్హం. తమ నియోజకవర్గాల్లో తాము సూచించిన వారిని పక్కన పెట్టడమే కాకుండా మాటమాత్రంగానైనా తమకు చెప్పకుండా జనసేనకు కేటాయించడంపై ఎమ్మెల్యేలు బాహటంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో టీడీపీ అధిష్టానం రంగంలోకి దిగి ఎమ్మెల్యేలకు సర్ది చెప్పే బాధ్యతను ఏపీ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావుకు అప్పగించినట్లు చెబుతున్నారు.
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పదవుల పంపకంలో మిత్రపక్షాలకు చోటు కల్పిస్తున్నారు. అయితే గతంలో జరిగిన ఒప్పందం ప్రకారం కూటమిలో ఏ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తే ఆ పార్టీకే ఆయా నియోజకవర్గాల్లో మెజార్టీ పదవులు కట్టబెట్టాలని నిర్ణయించారు. కానీ, తాజాగా నియమించిన మార్కెట్ కమిటీ చైర్మన్లలో ఆరు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నా, జనసేనలోని జూనియర్లకు చైర్మన్ పదవులు కట్టబెట్టడంపై టీడీపీ కేడర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తమ ఎమ్మెల్యేలు మౌనంగా ఉండటం వల్లే తమకు అన్యాయం జరిగిందని కేడర్ తిరుగుబాటు చేస్తోంది. అంతేకాకుండా ఎమ్మెల్యేలు కూడా అధిష్టానం వైఖరిపై తీవ్ర అసంతృప్తికి లోనైనట్లు చెబుతున్నారు. ఇలా చేస్తే తాము నియోజకవర్గాల్లో ఎలా తలెత్తుకుని తిరుగుతామని, కేడర్ ను ఎలా మంచి చేసుకుంటామని కుమిలిపోతున్నట్లు చెబుతున్నారు. జనసేనకు ఇస్తామని ముందే చెబితే తాము పార్టీ నేతలను ముందే ప్రిపేర్ చేయించేవారమని, అలా కాకుండా తమ వద్ద నుంచి ప్రతిపాదనలు తీసుకుని, జనసేనకు కేటాయించడమే అభ్యంతరకంగా ఉందని చెబుతున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 218 వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉండగా, ప్రస్తుతం 85 కమిటీలకు పాలకవర్గాలను నియమించారు. ఇందులో 68 టీడీపీకి దక్కగా, జనసేనకు 14, బీజేపీకి 3 ఏఎంసీలు కేటాయించారు. అయితే జనసేనకు కేటాయించిన ఆరు చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తుండటం ఆ పార్టీలో చర్చకు దారితీస్తోంది. తాము ఒకరి పేరును సూచిస్తే పార్టీ జనసేనలోని జూనియర్ ను తీసుకువచ్చి చైర్మన్ చేయడంపై కేడర్ రగిలిపోతోందని, వారిని ఎలా సముదాయించాలో అర్థం కావడం లేదని ఎమ్మెల్యేలు అధిష్టానంతో మొరపెట్టుకున్నట్లు చెబుతున్నారు. అయితే పొత్తు ధర్మంలో భాగంగా జనసేనకు కొన్ని కేటాయించాల్సివచ్చిందని, రెండేళ్లు ఆగితే మన పార్టీ వారికి న్యాయం చేస్తామని టీడీపీ హైకమాండ్ సముదాయిస్తోందని అంటున్నారు. కానీ, కేడర్ మాత్రం పార్టీ తీరును నిరసిస్తున్నట్లే చెబుతున్నారు.
కొన్నిచోట్ల జనసేనకు కేటాయించడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ఆ పార్టీలోని మరీ జూనియర్లకు పదవులిచ్చి, 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న తమను పక్కన కూర్చోమనడం కరెక్టు కాదని నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలపై రుసరుసలాడుతున్నారని అంటున్నారు. జనసేనకు పెద్దగా బలం లేకపోయిన నియోజకవర్గాల్లో ఏఎంసీ చైర్మన్లుగా ఆ పార్టీ వారిని నియమించడం సబబుగా లేదని కార్యకర్తలు మండిపడుతున్నారని చెబుతున్నారు. దీంతో ఎమ్మెల్యేలు ఇదెక్కడి తలనొప్పి అంటూ నెత్తీనోరు బాదుకుంటున్నారు. కార్యకర్తలను సర్దిచెప్పలేక, అధిష్టానాన్ని ఒప్పించలేక సతమతమవుతున్నారని అంటున్నారు. ఈ పరిస్థితుల్లో మిగిలిన మార్కెట్ కమిటీల నియామకంలో అయినా టీడీపీ అధిష్టానం అప్రమత్తంగా వ్యవహరించాలని పార్టీ వర్గాలు సూచిస్తున్నాయి.