వీవీఐపీల భద్రత కోసం అధునాతన వాహనాలు
ఏపీలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అతిథుల తాకిడి ఎక్కువైంది.
ఏపీలో వీఐపీల భద్రత కోసం ప్రభుత్వం పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రానికి అతిథుల తాకిడి ఎక్కువైంది. పెట్టుబడుల పెట్టేందుకు నిత్యం ఎవరో ఒకరు రాష్ట్రానికి వస్తూనే ఉన్నారు. అలాంటి వారి భద్రత ప్రభుత్వానికి సవాల్ గా మారింది. అదేవిధంగా రాష్ట్రపతి, ప్రధాని, కేంద్ర మంత్రుల పర్యటన సమయంలో బుల్లెట్ ప్రూఫ్ వాహనాల కొరత సమస్యగా మారింది. దీన్ని అధిగమించేందుకు చంద్రబాబు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నప్పటికీ, వీఐపీల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సివుందని అంటున్నారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో 10 బుల్లెట్ ప్రూఫ్ వాహనాలను సమకూర్చుకోవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం రూ.9.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధులతో 10 ఫార్చునర్ వాహనాలు కొనుగోలు చేయనుంది. వీటికి బుల్లెట్ ప్రూఫ్ ఫ్రాబ్రికేషన్ చేయించాలని సూచించింది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు రాష్ట్రంలో కొందరు ముఖ్యనేతలు, రాష్ట్రానికి అతిథులుగా వచ్చే వారి కోసం ఈ కొత్త వాహనాలు అందుబాటులో ఉంచనున్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన 9 నెలల్లో రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. అదేవిధంగా రాష్ట్రపతి ఒకసారి, ప్రధాని రెండు సార్లు రాష్ట్రంలో పర్యటించారు. కేంద్ర మంత్రులు ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు సైతం ప్రతి నెలా జిల్లాల పర్యటనకు వెళుతున్నారు. దీనివల్ల పోలీసులు భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కొంటున్నారు. దీంతో 10 కొత్త వాహనాలు అందుబాటులో ఉంటే ఈ సమస్యను చాలా వరకు నివారించవచ్చని ప్రభుత్వానికి నివేదించారు. ఈ మేరకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.