గన్నవరంలో అభ్యర్ధి దొరికినట్లేనా ?
గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి అభ్యర్ధి దొరికినట్లేనా ? పార్టీలో ఇపుడిదే చర్చ జోరుగా సాగుతోంది
గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి గట్టి అభ్యర్ధి దొరికినట్లేనా ? పార్టీలో ఇపుడిదే చర్చ జోరుగా సాగుతోంది. ఎందుకంటే వైసీపీకి రాజీనామా చేసిన యార్లగడ్డ వెంకటరావు టీడీపీలో చేరారు. చంద్రబాబునాయుడును కలిసినపుడు తాను పార్టీలో చేరాలని అనుకుంటున్న విషయాన్ని చెప్పారు. లోకేష్ పాదయాత్ర యువగళం ఇపుడు గన్నవరం నియోజకవర్గంలోకి ప్రవేశించింది. ఈ సందర్భంగా 22వ తేదీన బహిరంగసభ ఏర్పాటుచేశారు. ఆ సభలోనే యార్లగడ్డ టీడీపీలో చేరబోతున్నారు. అందుకే టీడీపీకి గట్టి క్యాండిడేట్ దొరికినట్లేనా అనే చర్చ మొదలైంది.
వాస్తవానికి టీడీపీకి నియోజకవర్గంలో గట్టి నేతలేరు. చాలాకాలం బచ్చుల అర్జునుడు నియోజకవర్గం ఇన్చార్జిగా ఉన్నారు. అయితే ఆయన సడెన్ గా చనిపోయారు. అప్పటినుండి ఇన్చార్జిని కూడా నియమించలేదు. మచిలీపట్నం మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణ ఆధ్వర్యంలో త్రిసభ్య కమిటిని వేసి పార్టీ వ్యవహారాలను నడుపుతున్నారు. పట్టాభి లాంటి ఒకరిద్దరు టికెట్టిస్తే పోటీచేస్తామని చెప్పినప్పటికీ చంద్రబాబు ఎందుకో పెద్దగా ఆసక్తి చూపలేదు.
ఈ పరిస్ధితుల్లో రాబోయే ఎన్నికల్లో టీడీపీ తరపున ఎవరు పోటీచేస్తారనే విషయం ఆసక్తిగా మారింది. ఇంతలో వైసీపీలో ఇమడలేక యార్లగడ్డ బయటకు వచ్చేశారు. అంటే టీడీపీతో లోపాయికారీగా మాట్లాడుకునే వైసీపీలో నుండి యార్లగడ్డ బయటకు వచ్చేశారు. సో ఇపుడు యార్లగడ్డ పార్టీలో చేరుతున్నారు కాబట్టి టికెట్ హామీతోనే చేరుతున్నారనే ప్రచారం ఊపందుకుంది. టీడీపీకి గట్టి క్యాండిడేట్ లేరు ఇదే సమయంలో యార్లగడ్డకు టికెట్ కావాలి. అదుకనే చంద్రబాబు కూడా యార్లగడ్డను వెంటనే పార్టీలో చేర్చుకున్నట్లు అనిపిస్తోంది.
సో, పరిస్ధితులన్నీ అనుకూలిస్తే రేపటి ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేయబోయే వల్లభనేని వంశీని టీడీపీ తరపున యార్లగడ్డే ఢీ కొనబోతున్నారనే చర్చ పార్టీలో పెరిగిపోతోంది. పోయిన ఎన్నికల్లో టీడీపీ తరపున పోటీచేసిన వంశీ వైసీపీ తరపున పోటీచేసిన యార్లగడ్డను ఓడించారు. రాబోయే ఎన్నికల్లో ప్రత్యర్ధులు వీళ్ళే కానీ వాళ్ళు ప్రాతినిధ్యం వహించబోయే పార్టీలే మారిపోతున్నాయి. మొత్తానికి తాజా పరిణామాలను బేరీజు వేసుకుంటే రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో ఫైట్ బాగా రంజుగా ఉండేట్లే ఉంది. మరి చివరకు ఏమి జరుగుతుందో చూడాలి.