పంతం పట్టిన ఆమె.. చంద్రబాబు సీఎం అయ్యాకే పుట్టింటికి
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూస్తే.. గడిచిన ఐదేళ్లు ఒక ఎత్తు అయితే మిగిలిన కాలమంతా మరో ఎత్తు
చంద్రబాబు సుదీర్ఘ రాజకీయ జీవితాన్ని చూస్తే.. గడిచిన ఐదేళ్లు ఒక ఎత్తు అయితే మిగిలిన కాలమంతా మరో ఎత్తు. ఆయనకే కాదు ఆయన పార్టీ నేతలకు.. పార్టీ కార్యకర్తలకు.. అభిమానులకు.. సానుభూతిపరులకు సైతం గడిచిన ఐదేళ్లుగా ఎన్నో గడ్డు పరిస్థితులు ఎదుర్కొన్నారు. కాలంతో పాటు చంద్రబాబుకు ఎంతోమంది రాజకీయ ప్రత్యర్థులు ఉన్నప్పటికీ.. జగన్ మాత్రం ఆయనకు ప్రత్యేక ప్రత్యర్థిగా చెప్పాలి. ఆ మాటకు వస్తే టీడీపీ కుటుంబం మొత్తానికి వైసీపీ ఒక ప్రత్యేక ప్రత్యర్థిగా చెప్పాలి.
ఒక సాదాసీదా సానుభూతిపరుడు మొదలుకొని పార్టీలో అత్యున్నత స్థాయిలో ఉన్న నేత వరకు వైసీపీతో వారికి ఎదురైన అనుభవాలెన్నో. గతంలో పార్టీల మధ్య పోరు ఉండేది. కానీ.. గడిచిన ఐదేళ్లలో పార్టీ పంచాయితీ వ్యక్తుల వ్యక్తిగత జీవితాల్లోనూ ఎన్నో పంచాయితీలకు కారణమైంది. ఇప్పుడు చెప్పే ఉదంతం కూడా ఆ కోవలోకే చెందింది. ఈ ఉదంతం గురించి తెలిస్తే.. కేవలం ఒక అభిమాని జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చిందా? అని అనుకోకుండా ఉండలేని పరిస్థితి.
మళ్లీ చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టింటికి వస్తానంటూ ప్రతిన బూనిని మహిళ.. ఐదేళ్ల అనంతరం ఆమె పుట్టింటికి వచ్చిన ఉదంతమిది. తెలంగాణలోని ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం కేశవాపురానికి చెందిన విజయలక్ష్మి.. శనివారం తన పుట్టింటికి వచ్చారు. అది కూడా ఐదేళ్ల తర్వాత.. ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణస్వీకారం చేసిన తర్వాతే. ఇంతకూ ఆమె ఎందుకు అంత కఠినమైన ప్రతిన పూనారు? అంత పంతంగా ఎందుకు ఉన్నారన్న విషయంలోకి వెళ్లాలంటే కాస్తంత ప్లాష్ బ్యాక్ కు వెళ్లాల్సిందే.
కేశవాపురానికి చెందిన విజయలక్ష్మిని ఏపీలోని క్రిష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడుకు చెందిన నర్సింహారావుతో పెళ్లి చేశారు. తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయారు. తన తల్లిదండ్రులు ఉన్న ఇంట్లోనే తన సోదరి వద్దకు అప్పుడప్పుడు విజయలక్ష్మి వస్తుంటారు. ఐదేళ్ల క్రితం తన ఇద్దరు కొడుకులతో ఊరికి వచ్చారు. ఆ సందర్భంలో ఆమె అక్క కొడుకు తాళ్లూరి ప్రసాద్ తో మాట్లాడుతున్న వేళ.. వారి సంభాషణ రాజకీయాల వైపు మళ్లింది. ఆమె చంద్రబాబుకు మద్దతుదారు కాగా.. ఆమె అక్క కొడుకు జగన్ మద్దతుదారు.
దీంతో.. ఇద్దరి మధ్య కొంత వాదన జరిగిన తర్వాత.. చంద్రబాబు మళ్లీ సీఎం అవుతారని ఆమె చెబితే.. అందుకు ఒప్పుకోని ఆమె అక్క కొడుకు జగన్ మళ్లీ సీఎం అవుతారని వాదన జరిగింది. ఇలా ఇద్దరి మధ్య జరిగిన వాదన ఒక స్థాయి దాటిపోయి.. హాట్ చర్చకు తెర తీసింది. ఈ క్రమంలో విజయలక్ష్మి తీవ్ర భావోద్వేగానికి గురై.. మళ్లీ చంద్రబాబు నాయుడు ఏపీ ముఖ్యమంత్రి అయ్యాక మాత్రమే పుట్టింటికి వస్తానంటూ ప్రతిన బూనారు.
విజయలక్ష్మి నోటి నుంచి వచ్చిన మాటకు కట్టబడిన ఆమె.. గడిచిన ఐదేళ్లుగా తమ కుటుంబాల్లో జరిగిన ఎన్నో వేడుకలకు హాజరుకాకుండా ఉండిపోయారు. అక్క కొడుకుతోనే కదా మాట్లాడుకున్నది.. ఫంక్షన్లకు రావాలని ఎంతగా పిలిచినా ఆమె మాత్రం ససేమిరా అనేశారు. ఐదేళ్లుగా ఊళ్లోకి అడుగు పెట్టని ఆమె.. తాజాగా ఏపీలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక ఆమె నిన్న (శనివారం) తన పుట్టింటికి వచ్చారు. ఐదేళ్ల ఆమె ప్రతినను విజయవంతంగా పూర్తి చేసుకొని ఊళ్లోకి వచ్చిన సందర్భంగా స్థానిక టీడీపీ అభిమానులు.. బంధువులు.. కుటుంబ సభ్యులు అందరూ ఆమెకు స్వాగతం పలికారు. గ్రామంలోని బస్టాండ్ లో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి విజయలక్ష్మి నివాళులు అర్పించారు. ఈ మొత్తం ఉదంతం చూసేందుకు చిన్నదిగా ఉండొచ్చు. ఇలాంటి వేలాది ఉదంతాలు ఐదేళ్లలో చోటు చేసుకున్నట్లుగా చెబుతున్నారు. ఇలాంటి హార్డ్ కోర్ అభిమానుల గురించి వార్తలు రూపంలో వెలుగు చూసినప్పుడు చంద్రబాబు వారిని ప్రత్యేకంగా పిలిపించి మాట్లాడితే వారెంత సంతోషానికి గురవుతారో కదా?